breaking news
Kurnool city police
-
ఉలికిపాటు
ఆత్మకూరు (కర్నూలు): విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం కాల్చిచంపడంతో జిల్లా ప్రజలు సైతం ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో జిల్లాలో..మరీ ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆత్మకూరు ప్రాంతంలో ‘పీపుల్స్‌వార్ బవనాసి’ పేరుతో నక్సల్స్ కార్యకలాపాలు నిర్వహించారు. వారి ఉనికి ఎంతో బలంగా ఉండేది. 1999లో అప్పటి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళæరెడ్డిని పీపుల్స్‌వార్ బవనాసి దళ సభ్యులు పట్టణంలోని పాత డీఎస్పీ బంగ్లా అతిథిగృహంలో కాల్చి చంపారు. పోలీస్ దుస్తులను ధరించిన వ్యక్తులు బుడ్డా వెంగళరెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. వాస్తవానికి 1995–96 ప్రాంతంలో అప్పటి పీపుల్స్ వార్ సభ్యులు (ప్రస్తుతం మావోయిస్ట్‌లు) తెలంగాణ ప్రాంతం నుంచి నల్ల మల అభయారణ్యం సమీపంలోని కొత్తపల్లి మండలం జానాల గూడెం చేరుకుని ఈ ప్రాంతాన్ని షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నారు. నాలుగేళ్లలోనే అటవీ సమీప గ్రామాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగించారు. అప్పటి దళం కృష్ణ నాయకత్వంలో పనిచేసింది. అయితే..అతను పుట్టిలో కృష్ణానదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్ కర్నూలు జిల్లాలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి.. పార్టీని మరింత బలోపేతం చేశారు. అప్పçట్లో పీపుల్స్‌వార్ సభ్యులు పలు సంఘటనలకు పాల్పడి ఉనికిని బలంగా చాటారు. మరీ ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో వీరి కదలికలు అధికంగా ఉండేవి. వడ్ల రామాపురం, వేంపెంట, నల్లకాలవ, బండి ఆత్మకూరు మండలం నారాయణపురం, సంతజూటూరు, మహానంది మండలం గాజులపల్లెతో పాటు ఆళ్లగడ్డ మండలంలోనూ చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించారు. 2003 సంవత్సరంలో బైర్లూటీ, వెలుగోడు తదితర ప్రాంతాలలో అటవీశాఖ భవనాలను పేల్చేశారు. అదే ఏడాది ఇందిరేశ్వరం గ్రామంలో కరువు దాడి నిర్వహించారు. 2004లో సున్నిపెంట పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేయడం సంచలనమైంది. 2005 జనవరి 15న బైర్లూటీ వద్ద కొవ్వూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. అదే ఏడాది మార్చి ఒకటో తేదీన వేంపెంట ఊచకోత ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా పలు ఘటనలతో బలంగా ఉనికిని చాటుతూ వచ్చిన నక్సల్స్ ప్రభావం ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చింది. గత కొన్నేళ్లుగా జిల్లాలో వారి కార్యకలాపాలేవీ లేవు. అయితే..ఆదివారం అరకు ఎమ్మెల్యే హత్యతో మళ్లీ అలజడి రేగింది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. మావోల కదలికలు లేవు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా మావోయిస్టుల కదలికలు లేవు. ఈ విషయంపై మేం సమగ్రంగా విచారణ చేశాం. ఎక్కడా వారి ఉనికి బయటపడలేదు. – మాధవరెడ్డి, ఏఎస్పీ -
కరుడుగట్టిన రేపిస్ట్ అరెస్ట్
కర్నూలు: నగరంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పుడుతున్న కరడుగట్టిన రేపిస్ట్, ఆటోడ్రైవర్ రవిని నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో రవిని విచారిస్తున్నారు. అతడిపై పలు రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నగరంలో ఒంటరిగా ఉన్న మహిళలను రవి తన ఆటోలో ఎక్కించుకుని... నగర శివారు ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. అక్కడ మహిళను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారం దొంగిలించి.. ఆపై వారిపై అత్యాచారం చేసి పరారైయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో బుధవారం నిందితుడు రవి పోలీసులకు చిక్కాడు. -
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
కర్నూలు: కర్నూలు జిల్లాలో దొంగనోట్ల కలకలం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దాంతో దొంగనోట్ల చలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును కర్నూలు నగర పోలీసులు బుధవారం తెల్లవారుజామున రట్టు చేశారు. నగర పోలీసులు తనిఖీలలో భాగంగా బుధవారం తెల్లవారుజామునా ఓ నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ను తరలించారు. ఆ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు ముఠా సభ్యులను ప్రశ్నించగా వారు ఎంతకీ పెదవి విప్పలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. దాంతో ముఠా సభ్యుల నోటి నుంచి నిజాలు తన్నుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు ముఠాసభ్యులు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది.