breaking news
Kudligi DSP
-
అనుపమ రాజీనామాలో ట్విస్ట్
బళ్లారి: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అనుపమ రాజీనామా విషయలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధుల్లో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించారని, తనన బెదిరించారని ఆరోపిస్తూ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్టు వార్తలు వచ్చాయి. అనుపమ తన రాజీనామా లేఖలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పేరును ప్రస్తావించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రస్తావన లేకుండా మరో రాజీనామా లేఖ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అనుపమ మంత్రి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా రెండోసారి రాజీనామా లేఖను అందజేసింది. ఈ రాజీనామా లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
నాకు ప్రాణహాని ఉంది: అనుపమ
బెంగళూరు: సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. కాగా ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, బెదిరింపులు ఏమైనా వచ్చాయా అన్న విషయాలను ఆమె వెల్లడించలేదు. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్‌కు సంబంధించిన సీడీ, ఆడియోలను బెంగళూరులో మీడియా సమక్షంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. అనుపమ రాజీనామా వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె రాజీనామా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాసలీలల వీడియో తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపన అనుపమ రెండు రోజుల క్రితం కుడ్లిగి వచ్చారు. కాగా అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినందుకు బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. -
ఫేస్ బుక్‌లో ‘అను’ప్రకంపనలు
*చర్చనీయాంశమైన డీఎస్పీ అనుపమ ఫేస్బుక్ సారాంశం *గొప్ప మాటలు చెప్పే వారంతా పెద్ద వారు కాలేరు *చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటేనే మహానుభావులు అంటూ పోస్టు చేసిన అనుపమ *రాజీనామా ఆమోదిస్తారా... సర్దిచెబుతారా ? *నోరు మెదపని అధికారులు, రాజకీయ నాయకులు బళ్లారి : బళ్లారి జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామాపై స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు ఉన్నతా«ధికారులు సైతం నోరు మెదిపేందుకు జంకుతున్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించిన కూడ్లిగి డీఎస్పీ అనుమప షణై రాజీనామా ఉదంతంపై బళ్లారి జిల్లాలో పలువురు ఆందోళనలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుమప షణై రాజీనామా పత్రం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం చేరింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున షణైను పోలీసు ఉన్నతాధికారులు పిలిపించుకుని ఆమె రాజీనామాను ఎలాగైనా వెనక్కి తీసుకునేలా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. నిజాయితీ పరురాలైన కూడ్లిగి డీఎస్పీ శనివారం ఉన్నఫళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారి బళ్లారి జిల్లా అనుపమ వార్తల్లోకి ఎక్కారు. రెండు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అనుమప షణై నిజాయితీపై ప్రశంసలు జల్లు కురిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఉడిపికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏ నలుగురు కలిసినా అనుపమ షణై రాజీనామా ఎందుకు చేశారు? దాని వెనుక కారణాలు ఏమిటి? అనే చర్చ సాగుతోంది. కూడ్లిగిలో అంబేడ్కర్ కట్టడ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖ నేతలను అరెస్ట్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. ఈ నేపథ్యం ఆమె రాజీనామాకు కారణమైనప్పటికీ ఇంకా రాజీనామా వెనుక వేరే బలమైన కారణాలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేశారన్న దానిపై జిల్లాలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్లో మాట్లాడేందుకు కూడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆమె స్వయానా ఫేస్బుక్లో తన అభిప్రాయాలను వెల్లడించడంతో ఫేస్బుక్ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గొప్ప గొప్ప మాటలు చెప్పే వారంతా గొప్పవారు కాదు, చిన్న చిన్న మంచి మంచి విషయాలను అర్థం చేసుకునేవారు గొప్పవారవుతారు. ‘అన్యాయం చట్టమైనప్పుడు తిరుగుబాటు కర్తవ్యమవుతుంది’(వెన్ ఇన్జస్టిస్ బికమ్స్ లా, రెబలియన్ బికమ్స్ డ్యూటీ) అని అంగ్లంలో అనుపమ షణై ఫేస్బుక్లో పొందుపరిచారు.