breaking news
korthikota
-
ట్రిపుల్ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం
సాక్షి, అనంతరపురం: జిల్లాలో అత్యంత దారుణంగా ముగ్గురిని హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలో కోర్తికోటలో శివాలయం పరిసరాల్లో అనుమానస్పద రీతిలో మూడు మృతదేహాలు లభ్యమయిన విషయం తెలిసిందే. అయితే గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజలు చేసి ఆ ముగ్గురిని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. కొర్తికోటలో పురాతనమైన శివాలయం ఉంది. ఇది శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో రిటైర్డ్ టీచర్ శివరామిరెడ్డి (75), కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి ఆయన సోదరి కమలమ్మ, బెంగళూరు నివాసి సత్యలక్ష్మి సహకరించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. శివరామిరెడ్డి, కమలమ్మ(70), సత్యలక్ష్మి(70) గొంతుకోసి బండరాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన వారి రక్తాన్ని శివుడి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టల్లో కూడా రక్తాన్ని పోశారు. అయితే తాజా ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తనిధుల కోసం వచ్చిన దుండుగులు నరబలి ఇచ్చారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్షుద్రపూజల కోసం ఈ ఆలయాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హత్యతో కొర్తికోట గ్రామంతో పరిసర గ్రామాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. స్థానికులు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటానాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ఘటనపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని.. రాయలసీమ, కర్నాటక లోని గుప్తనిధుల వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామంటున్న ఎస్పీ తెలిపారు. ట్రిపుల్ మర్డర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛాలెంజింగా తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
పేదరికంతో అమ్మకానికి పేగు బంధం
తనకల్లు: తన పేదరికం బిడ్డకు శాపం కాకూడదని ఓ తల్లి పేగు బంధాన్ని అమ్మకానికి పెట్టింది. విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ బిడ్డను శిశు విహార్‌కు తరలించారు. వివరాల్లోకెళితే... అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన భూదేవి పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. కొన్ని నెలల క్రితం భర్త భాస్కర్ అనారోగ్యంతో చనిపోయాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయేనాటికే గర్భంతో ఉన్న భూదేవి వారం క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలే పేదరికం.. పైగా భర్త తోడు లేకపోవడంతో ఇప్పుడు పుట్టిన బిడ్డ పోషణ భారమైంది. దీంతో తన సమీపబంధువుకు శనివారం ఇటీవల జన్మించిన బిడ్డను ఇచ్చేసి.. అతను ఇచ్చిన కొంత మొత్తాన్ని స్వీకరించింది. ఈ విషయంపై కొందరు గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీడీపీఓ నాగమల్లేశ్వరి, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు జ్ఞానేశ్వరి, శోభా , కానిస్టేబుల్ సుబ్బయ్య విచారించారు. తల్లిని ప్రశ్నిస్తే బిడ్డను పోషించలేని స్థితిలో ఇచ్చేశానని తెలిపింది. దీంతో ఆ బిడ్డను శిశువిహార్‌కు తరలించారు.