breaking news
Konda raghavareddi
-
బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమేనా!
కేసీఆర్‌పై వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే ఇష్టానుసారంగా విద్యుత్, బస్సు చార్జీలు పెంచడమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ అద్భుతాలే జరుగుతాయని కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కనుచూపు మేరలో ఏ ఎన్నికలూ లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచిందన్నారు. తండ్రి, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రోజుకో అంకె పెంచుతూ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉందని చెబుతున్నారన్నారు. రెండేళ్ల పాలన విజయోత్సవాలు,పూర్తి కాని సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి రూ.300 కోట్లు ఖర్చు చేయటానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయన్నారు. ‘సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన చార్జీలు భారమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి’ అని కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. నేడు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ భారీ నిరసన ప్రదర్శన, ధర్నా చేపడుతున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. -
మాట నిలబెట్టుకునే వంశం వైఎస్ఆర్దే..
షర్మిల పరామర్శయాత్ర కోసం రూట్ సర్వే చేసిన నేతలు జనగామ: రాష్ట్రంలో మాట నిలబెట్టుకునే వంశం ఒక్క వైఎస్ఆర్దేనని... ఆ ఘనత ఆ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, భీష్వ రవీందర్ అన్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల యాత్రకోసం శనివారం వీరు రూట్ సర్వే చేశారు. జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలం భైరాన్‌పల్లి, బచ్చన్నపేట మండలం కట్కూరు, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, ఆలీంపూర్, బచ్చన్నపేట, పోచన్నపేటలోని మూడు గ్రామాల్లోని 9 కుటుంబాలతో పాటు అలువాల యాదగిరి కుటుంబం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నేరుగా కలుసుకుని పరామర్శించేందుకు షర్మిల ఈ నెల చివరి వారంలో పర్యటించనున్నారని వివరించారు. లక్షలాది మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్‌కే దక్కుతుందని కొనియాడారు.