breaking news
Khairatabad Ganesh uthsav committee
-
కర్రపూజ: పదితలాల రూపంలో ఖైరతాబాద్ గణపతి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ ఏకాదశ రుద్ర మహాగణపతిగా దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ నామకరణం చేశారు. నిర్జల ఏకాదశి సందర్భంగా మహాగణపతికి సోమ వారం ఉత్సవ కమిటీ సభ్యులు నిరాడంబరంగా కర్రపూజ నిర్వహించారు. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 18 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనుకున్నా కరోనా సెకండ్ వేవ్‌తో ఖైరతాబాద్ మహాగణపతి తయారీపై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు అదుపులోకి రావడంతో మహాగణపతి తయారీకి కర్రపూజ నిర్వహించారు. అయితే ఈసారి మహాగణపతి ఎత్తు, నమూనాపై త్వరలో ప్రకటన చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. సెప్టెంబర్ 10న వినాయకచవితి ఉందని, 11 తలలతో నిలబడి ఉండే ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దనున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
ఖైరతాబాద్ మహాగణపతికి 5 వేల కిలోల లడ్డూ
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు ఈ ఏడాది 5 వేల కిలోల లడ్డూను ప్రసాదంగా అంజేయనున్నారు. ఏటా ఈయన లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది మహాగణపతికి సమర్పించిన 4200 కిలోల లడ్డూ వర్షంలో తడిసి పోవడంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. దీంతో ఈ సంవత్సరం మహాప్రసాదాన్ని భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని మల్లిబాబు కోరారు. కమిటీ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మల్లిబాబు సోమవారం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, సందీప్‌లతో కలిసి సైఫాబాద్ ఇన్స్పెక్టర్ నారాయణను కలిశారు. ఈ సంవత్సరం 5 వేల కిలోల లడ్డూను ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మల్లిబాబు తెలిపారు. ప్రసాదంలో 2500 కిలోల మేరకు ప్రసాదాన్ని 50, 100 గ్రాముల ప్యాకెట్లుగా చేసి భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. మరో 1250 కిలోల ప్రసాదాన్ని కేజీ రూ. 200 చొప్పున విక్రయిస్తామని తెలిపారు. మిగిలిన 1250 కిలోలు తాను తీసుకువెళ్తానని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ను ఆయన కోరారు. ఇందుకు సీఐ సుముఖత వ్యక్తం చేశారు.