breaking news
kesineni travels bus
-
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ
రూ.1.25 కోట్లు విలువ ఉండొచ్చని అంచనా నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని ‘భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్’లో ఉద్యోగం చేస్తున్న ఎం.సెంథిల్, మహీందర్ సుమారు 14 కేజీల నగలను విక్రయించేందుకు ఈనెల 23న హైదరాబాద్ వచ్చారు. 24న దాదాపు 5 కేజీల నగలను విక్రయించి అదేరోజు రాత్రి మిగిలిన ఆభరణాలను రెండు బ్యాగుల్లో భద్రపరచుకుని కేశినేని బస్సులో చెన్నైకి బయలుదేరారు. గురువారం ఉదయం నాయుడుపేట సమీపంలో టిఫిన్ కోసం బస్సు ఆపారు. ఈ క్రమంలో బస్సు ముందు ఓ కారు వచ్చి నిలబడటం.. అక్కడి నుంచి ఓ వ్యక్తి హడావుడిగా వెళుతుండటాన్ని బస్సు డ్రైవర్ గమనించి అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అగంతకుడు డ్రైవర్‌ను తోసేసి కారులో చెన్నై వైపు పారిపోయాడు. ఇంతలో సెంథిల్, మహీందర్ తమ బంగారు నగల బ్యాగుల్లో ఒకటి కనిపించట్లేదని డ్రైవర్‌కు చెప్పారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. -
ఆగిన కేశినేని బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సులో శనివారం అర్థరాత్రి సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో బీదర్ సమీపంలో బసవ కల్యాణం వద్ద బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు చర్యలు తీసుకోవడం కానీ... ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయడం కానీ ట్రావెల్స్ యాజమాన్యం చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసిన సదరు ట్రావెల్స్ ... తమను నడి రోడ్డుపై నిలిపి చోద్యం చూస్తుందని ప్రయాణికులు కేశినేనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.