Katihar
-
పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు.. అద్దాలు ధ్వంసం..
పాట్నా: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు విసిరిన ఘటన మరొకటి వెలుగుచూసింది. బిహార్ కటిహార్‌లో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం వందేభారత్ రైలు(22302)పికై రాళ్లు రువ్వారు. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. ఈ దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బోగి నంగర్ సీ6 అద్దాలు మాత్రం ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రైలు కార్యకలాపాలకు ఆంటంకం ఏర్పడినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా వందేభారత్ రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారు. మెయింటెనెన్స్ సమయంలో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ రైళ్లకు సంబంధించి తరచూ ఏదో ఒక ఘటన వెలుగుచూస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలైన తొలినాళ్లలో ఈ రైళ్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చదవండి: డేరా బాబాకు 40 రోజుల పెరోల్ -
ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
పాట్నా: బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఆటో ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. సోమవారం రాత్రి 8:30 గంటలకు జాతీయ రహదారి-81 పై ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓవర్టేక్ చేయిబోయిన ట్రక్కు దాన్ని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన స్థానికులు రోడ్డుపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను శాంతింపజేశారు. ట్రక్కు, డ్రైవర్‌ను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. చదవండి: రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం -
రూ.10 కోసం యువకుడు హత్య
ప్రపంచంలో ఎక్కడో అక్కడ ప్రతి రోజు అస్తులు, బంగారం... కోసం హత్య జరగడం సర్వసాధారణం. అయితే గుట్కా కొనుగోలు చేసేందుకు రూ. 10 ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు దీపక్ కుమార్ యాదవ్ (20) అనే యువకుడిని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశారు. ఆ సంఘటన బీహార్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం... బీహార్ రాష్ట్రంలోని కతిహర్ పట్టణంలో గుట్కా ప్యాకెట్ కొనుగొలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని యాదవ్ ని నలుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు. అందుకు యాదవ్ నిరాకరించాడు. దాంతో ఆ నలుగురు ఆగ్రహంతో అతడిపై కత్తులతో దాడి చేసి అతికిరాతకంగా పొడిచారు. దాంతో యాదవ్ అక్కడికక్కడే మరణించారని కతిహర్ జిల్లా ఎస్పీ అస్గర్ ఇమామ్ బుధవారం వెల్లడించారు. ఆ ఘటన తనను తీవ్ర అశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. రూ.10ల కోసం మరి ఇంత దారుణమా అని వ్యాఖ్యానించారు. యాదవ్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే యాదవ్ హత్య స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఘటనకు బాధ్యులపై వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.ఆ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది.