
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాలను తిలకిస్తున్నట్లుగా ఉన్న ఎంపీ తారిఖ్ అన్వర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాంగ్రెస్ నేత, బిహార్‌లోని కటిహార్ ఎంపీ అయిన తారిఖ్ అన్వర్ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అయితే, ఓ వ్యక్తి మోస్తుండగా ఆయన పర్యటన కొనసాగించారు.
ఎంపీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ వ్యక్తి వీపుపై మోసుకెళ్తూండగా వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఎంపీ తారిఖ్ అన్వర్ తీరును బీజేపీ తప్పుబట్టింది. వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లినా కాంగ్రెస్ నేతలకు వీవీఐపీ ప్రొటోకాల్ కావాల్సి వచ్చిందా? అని ఆ పార్టీ నేత పూనావాలా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఎంపీ వీవీఐపీ మోడ్. రాహుల్ గాంధీ వెకేషన్ మోడ్. ఆమ్‌ఆద్మీ పార్టీ హైడింగ్ మోడ్. ప్రధాని మోదీ మాత్రమే వర్క్ మోడ్’అని వ్యాఖ్యానించారు.