breaking news
karimnagar visit
-
త్వరలో కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన!
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఆయన ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ, ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రాల సందర్శనకు రానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయం తెలిసిందే. వేములవాడ, కొండగట్ట పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీలు ముమ్మరం చేశారు. కొండగట్టుకు మాస్టర్‌ప్లానే శరణ్యం.. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంపై పార్కింగ్, తాగునీరు, గదులు, ప్రాథమిక చికిత్స కేంద్రం, మెట్లదారి అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, ఘాట్ రోడ్ పునరుద్ధరణ, 100 ఫీట్ల రోడ్డు, కోతుల పార్కు, కొండగట్టు రైల్వే స్టేషన్ హాల్టింగ్ సౌకర్యం, బస్టాండ్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ తీరాలంటే.. కేవలం మాస్టర్ ప్లాన్‌తో సాధ్యమవుతుంది. ‘కొండగట్టు మాస్టర్ ప్లాన్‌పై సీఎం దృష్టికి తీసుకెళ్లాను. కొండకు రావాలని కోరాను. గత పాలకుల సమయంలో కొండగట్టు ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. కొండగట్టును మరో యాదాద్రి తరహాలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తారు’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి తరహాలో... రాజాద్రి! సీఎం 2019 డిసెంబరు 30లో చివరిసారిగా పర్యటించారు. అంతకుముందు 2015 జూన్ 18లోనూ వచ్చారు. ఆ సమయంలో ఆలయ సముదాయాలను కలియ తిరిగిన కేసీఆర్ రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో యాదాద్రి తరహాలో రాజాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ ఆలయానికి ప్రత్యేక నిధులేమీ విడుదల కాలేదు. ‘వేములవాడ ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. సీఎం దంపతుల వివాహం కూడా ఇక్కడే జరిగింది. అందుకే.. వేములవాడ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తప్పకుండా వేములవాడను ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుంటారు’ అని ఎమ్మెల్యే రమేశ్ బాబు చెప్పారు. -
ఆ ఇద్దరితోనే రైతులకు కష్టాలు
కరీంనగర్ : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్‌తో కలిసి ఆయన కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి, వడగళ్లకు నష్టపోయిన రైతులతోను, పార్టీ ప్రతినిధులతోనూ సమీక్షించారు. వ్యవసాయాన్ని, రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు వ్యతిరేకమైన భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేసీఆర్ మద్దతు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాలని కోరారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని భావించిన రైతులకు తీరని నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. వాటర్ గ్రిడ్ బిల్లు రైతులకు వ్యతిరేకమైందని ఆరోపించారు. రైతుల అనుమతి లేకుండా వారి పంట పొలాల్లో నుంచి పైప్‌లైన్ వేసుకునే విధంగా, అలాగే పైప్‌లైన్ వేసిన చోట చెట్లను నాటకుండా నిరోధించే చర్యలు తీసుకునే అవకాశం వాటర్ గ్రిడ్ బిల్లులో ఉందని చెప్పారు. అందుకే వాటర్ గ్రిడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.