breaking news
kalyana
-
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల
కోరుకొండ : అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం – దత్తత దేవాలయమైన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నవరం దేవస్థానం పీఆర్ఓ తులారాము, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, సూపరింటెండెంట్ పీవీ రమణ, ఇన్చార్జ్ టీఎన్ రామ్‌జీ అన్నారు. ఆదివారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 12 వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త వీవీ రోహిత్, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ సారధ్యంలో జరుగుతుందన్నారు. అన్నవరం దేవస్థానం నిధులతో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుపుతామన్నారు. సుమారు రూ.14 లక్షలతో తీర్థం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి మెట్ల సమీపంలో అన్నవరం దేవస్థానం రూ.30 లక్షల నిధులతో భక్తులకు విశ్రాంతి గదులను నిర్మిస్తామన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నవరం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అర్జన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సారధ్యంలో డీఎస్పీ ఏవీఎల్. ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్సైలు బంధోబస్తు నిర్వహిస్తారన్నారు. కొండ దిగువున, కొండ పైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం 2010లో దత్తత తీసుకుందని, అప్పుడు రూ.మూడు లక్షల ఎఫ్డీఆర్తో దేవస్థానాన్ని దత్తత తీసుకున్నామని, ప్రస్తుతం రూ. 31 లక్షలు స్వామి వారి పేరున ఎఫ్డీఆర్ వేశామన్నారు. -
నిత్యకల్యాణ రాముడు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి బుధవారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోత్రధారణ చేశారు. వేదపండితులు విన్నపాలిచ్చారు. గోత్రనామాలను చదివి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. – భద్రాచలం