breaking news
kadiri ci
-
ఈ సీఐ ఉంటే మా ఆటలు సాగవ్!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ కదిరి టౌన్ సీఐ తమ్మిశెట్టి మధును టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఆ సీఐ ఇక్కడుంటే తమ ఆటలు సాగవని భావించి ఎలాగైనా ఆ సీఐని ఇక్కడి నుంచి పంపించే కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని ఎన్జీఓ కాలనీ చివర కొందరు మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో ఇటీవల ప్లాట్లు చదును చేసుకుంటుంటే కందికుంటతో పాటు ఆయన అనుచరులు అక్కడికెళ్లి గొడవకు దిగిన విషయం తెలిసిందే. అడ్డుకున్న సీఐ మధును కందికుంట అసభ్య పదజాలంతో దూషించారు. జేసీబీని పెట్రోలు పోసి తగలబెట్టాలని చూస్తే పోలీసులు ఆ గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో కందికుంట చేతికి స్వల్పంగా దెబ్బ తగిలింది. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట అప్పటి నుంచి సీఐని టార్గెట్ చేశాడు. ఎల్లో మీడియాలో ఆయనపై తప్పుడు కథనాలు రాయించి ఇక్కడి నుంచి బదిలీ చేయించడమో, లేదంటే సస్పెండ్ చేయించడమో చేయాలని కుట్ర పన్నుతున్నట్లు టీడీపీలోనే మరో వర్గం చెబుతోంది. కాగా, తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిబుల్ మర్డర్ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచినందుకు ప్రభుత్వం ఆయనకు ఏబీసీడీ(అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డు కూడా ఇచ్చింది. అలాంటి పోలీసు అధికారిని టీడీపీ టార్గెట్ చేయడంపై కదిరి ప్రజలు మండిపడుతున్నారు. ఇవిగో సాక్ష్యాలు.. ►‘భూతగాదా జరిగినప్పుడు సీఐ మధు నా నోట్లో తుపాకీ పెట్టి కాల్చాలని చూశాడు..’ అని కందికంట తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. ► ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలోని సైదాపురంలో స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యేపై అనవసరంగా గొడవకు దిగారు. అక్కడే ఉన్న సీఐ మధు వారిని వారించారు. తర్వాత సైదాపురానికి చెందిన ఒకరిద్దరు టీడీపీ మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సీఐ మధు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. ► పట్టణంలో గణేష్ నిమజ్జనం రోజు కూడా కందికుంట వర్గం అడుగడుగునా సీఐని టార్గెట్ చేసింది. శోభాయాత్రలో గొడవలు సృష్టించి ఆ నెపం సీఐపై నెట్టాలని కుట్రలు చేశారు. కానీ ఆరోజు పోలీసులు సంయమనం పాటించారు. ► టీడీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు పరీ్వన్‌భాను కొందరు మహిళలను వెంటబెట్టుకొని రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళల పట్ల సీఐ ప్రవర్తన ఏం బాగోలేదంటూ నిరసన ప్రదర్శించాలని వెళ్లారు. ఇటీవల కందికుంట అనుచరులు పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చావబాది.. కిడ్నాప్ చేయాలని ప్రయతి్నంచిన వీడియోను సీఐ చూపెట్టడంతో ఆమె సిగ్గుతో వెనుదిరగాల్సి వచ్చింది. ► భూతగాదాలో కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కుటాగుళ్లకు చెందిన గంగులప్పను కందికుంట ఇంటికి పిలిపించి రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ ప్రోద్బలంతోనే తాను ఆరోజు కేసు పెట్టాల్సి వచ్చిందంటూ సీఐపైనే రివర్స్ కేసు పెట్టించాలనే కుట్ర కూడా జరుగుతున్నట్లు పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి. కుట్రలకు ఖాకీ భయపడదు కుట్రలకు, బెదిరింపులకు ఖాకీ బెదరదు. కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా నన్ను తిట్టాడు. శాంతిభద్రతలకు విఘాతం కలగరాదని సంయమనంతో ఉన్నా. తప్పుడు కేసులకు భయపడితే పోలీసు ఉద్యోగం చేయలేం. – మధు, కదిరి టౌన్ సీఐ -
కదిరి టౌన్ సీఐ మధును చంపాలి
కదిరి: ‘మన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్‌పై చర్యలు తీసుకుంటున్న కదిరి టౌన్ సీఐ మధును బహిరంగంగా నరికి చంపాలనేది నా కోరిక. మన నాయకుడి జోలికొస్తే పోలీసు అధికారులనే కాదు.. ఆఖరుకు సీఎంనైనా వదలకూడదు..’ అని శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త మరో కార్యకర్తతో ఫోన్లో జరిపిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా ఆరా తీయగా కదిరి టీడీపీ కార్యకర్త మౌళాలినాయుడు, మరో టీడీపీ కార్యకర్త సిద్ధూగౌతమ్తో ఫోన్లో సంభాషించినట్లు తేలింది. ఏం జరిగిందంటే.. కదిరిలోని ఓ వెంచర్లో స్థలం కొనుగోలు చేసిన కొందరు ఈ నెల 24న ఇళ్ల నిర్మాణానికి పునాదులు తవ్వేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే 4 రోజుల కిందట వాళ్లను తన ఇంటికి పిలిపించిన కందికుంట దుప్పటి పంచాయతీకి దిగారు. తన అనుచరుడు సోమశేఖర్ పూర్వీకులు గతంలో ఆ భూమిని తక్కువ రేటుకు విక్రయించారని, అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా సెంటుకు రూ.2 లక్షల చొప్పున సోమశేఖర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అక్కడ ఎవ్వరూ ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు. ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో బుధవారం అనుచరులతో కలిసి వెంచర్ వద్దకు వెళ్లిన కందికుంట పనులను అడ్డుకున్నారు. జేసీబీపై రాళ్లవర్షం కురిపించి ధ్వంసం చేశారు. ఈ దాడిలో జేసీబీ డ్రైవర్ గాయపడ్డారు. జేసీబీని తగలబెట్టేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పట్టణ సీఐ తమ్మిశెట్టి మధు అడ్డుకుని గుంపును చెదరగొట్టారు. దీన్ని జీర్ణించుకోలేని సీఐని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ వారు ఏకంగా సీఐనే చంపేయాలని మాట్లాడుకున్న ఆడియో వైరల్ అయింది. -
‘నా కుమారుడి చావుకు కారకులైన వారిని శిక్షించాలి’
అనంతపురం సప్తగిరి సర్కిల్: తన కుమారుడు రంగారెడ్డి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షంచాలని కదిరికి చెందిన ప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు రంగారెడ్డి, కదిరికి చెందిన యువతి ప్రేమించుకున్నారని తెలిపారు. ఆమె సూచన మేరకు తన కుమారుడు చెన్నై వెళ్లాడన్నారు. అయితే అక్టోబర్ 8న చెన్నైలో వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తమకు తెలిసిందని వివరించారు. ఈ ఉదంతంలో కదిరి సీఐ వాహన డ్రైవర్ శరత్‌రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.