breaking news
K. Vijaya Bhaskar
-
మసాలా రెడీ
దినుసులన్నీ సమపాళ్లల్లో కుదిరితే ఆ మసాలా రుచే వేరు. అందుకే, మసాలా తయారు చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు దర్శకుడు విజయ్‌భాస్కర్ కూడా అంతే శ్రద్ధ తీసుకుని సిల్వర్ స్క్రీన్ కోసం మంచి ‘మసాలా’ తయారు చేశారు. ఇలాంటి మసాలా చిత్రాలు చేయడంలో వెంకటేష్, రామ్ స్టయిలే వేరు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ చేసే సందడి ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ అంటున్నారు విజయ్‌భాస్కర్. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కి రీమేక్ ఇది. ఇందులో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదంసీ నటించారు. థమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని, పక్కా మాస్ మసాలా అంశాలతో రూపొందించిన చిత్రం ఇదని రవికిషోర్ తెలిపారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయని, అన్ని వర్గాలవారు ఎంజాయ్ చేయదగ్గ చిత్రం ఇదని విజయ్‌భాస్కర్ చెప్పారు. -
'మసాలా' చిత్రం స్టిల్స్
హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ ఆధారంగా వెంకటేష్, రామ్, దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న 'మసాలా' చిత్రం స్టిల్స్. -
ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది - విజయ్‌భాస్కర్
‘‘మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంస్థలో నేను నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమానే అందుకు నిదర్శనం. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లో నటించాను. మళ్లీ ఆయన డెరైక్షన్‌లో చేయడం ఆనందంగా ఉంది’’ అని వెంకటేష్ అన్నారు. వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘మసాలా’. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని వెంకటేష్‌కి అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఇంకా మాట్లాడుతూ- ‘‘కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చక్కనైన కుటుంబ కథాచిత్రం ‘మసాలా’. రామ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశాడు. అతని కెరీర్లో ది బెస్ట్‌గా చెప్పుకునే సినిమా అవుతుంది. సినిమా పూర్తికావచ్చింది. ఒక పాటలో కొంత భాగం మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అతి త్వరలోనే ‘మసాలా’ని ప్రేక్షకులకు అందిస్తాం’’ అని చెప్పారు. ‘‘‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు నేను సెవెన్త్ స్టాండర్ట్ చదువుతున్నాను. అప్పుడు ఆ సినిమా సెట్‌కి వెళ్లి కూర్చొని భలే ఎంజాయ్ చేశా. ఇప్పుడు అదే బేనర్ నిర్మిస్తున్న చిత్రంలో అదే హీరోతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం స్థాయిలో ‘మసాలా’ ఉంటుంది. తమన్ వండర్ఫుల్ ఆడియో ఇచ్చాడు. ట్రైలర్స్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అని రామ్ నమ్మకం వ్యక్తం చేశారు. విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తవడానికి, సినిమా గ్రాండ్‌గా రావడానికి కారణం వెంకటేష్, రామ్, రవికిషోర్, సురేష్‌బాబు. ఈ సందర్భంగా ఈ నలుగురికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘మసాలా’ చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, బ్యాంకాక్, జపాన్లలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని, వారం రోజుల్లో విడుదల తేదీని ప్రకటిస్తామని డి.సురేష్‌బాబు తెలిపారు. వెంకటేష్‌తో మళ్లీ నటించడం పట్ల అంజలి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అలీ, పోసాని కృష్ణమురళి, ఆండ్రూ, రామజోగయ్యశాస్త్రి తదితరులు కూడా మాట్లాడారు. కృష్ణచైతన్య, ఎ.ఎస్.ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.