‘ఆంధ్రజ్యోతి’ వల్లే ఒత్తిడికి లోనయ్యా
వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ప్రతినిధులు డబ్బుల కోసం తనను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కె.శ్రీధర్ ఆరోపించారు. ఇటీవల ఆత్మహ త్యాయత్నానికి పాల్పడి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. నా రాజకీయ గురువు వరద రాజేశ్వర్రావు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డబ్బులతోపాటు నా వద్ద ఉన్న డబ్బును కూడా తీసుకుని నన్ను కొట్టారనడం అబద్ధం. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడటంతో తట్టుకోలేకపోయానే తప్ప మరేమీ కాదు. ఆంధ్రజ్యోతి వారు డబ్బులకోసం నామీద, వరదరాజేశ్వర్రావుపైన తీవ్రంగా ఒత్తిడి చేశారు. అనుకున్నంత మేరకు రాకపోయేసరికి మాపై అపవాదు వేశారు. నేను ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకుంటాను. ఎదుటి వ్యక్తులతో లాలూచీపడి మాకు నష్టం కలిగించేలా రాసిన రాతలకు యాజమాన్యం సమాధానం చెప్పాలి’’ అని ఆయన అందులో పేర్కొన్నారు.