breaking news
journalist murders
-
జర్నలిస్ట్‌ల హంతకులకు శిక్షలు పడడం లేదు
లండన్: గత రెండేళ్ల(2017,2018)లో 55% జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావర ణం లేని ప్రాంతాల్లోనే జరిగాయని యునె స్కో ఒక నివేదికలో పేర్కొంది. నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్ కారణంగానే ఈ హత్యలు జరిగాయని దీని ద్వారా స్పష్టమవుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురి కాగా, ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90% మందికి శిక్షలు పడలేదని వెల్లడించింది. నవంబర్ 2ను ‘ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగైనెస్ట్ జర్నలిస్ట్స్’ గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో శుక్రవారం ఈ ‘ఇంటెన్సిఫైడ్ అటాక్స్, న్యూ డిఫెన్సెస్’ అనే నివేదికను విడుదల చేసింది. 2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18% పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30% అరబ్ దేశాల్లో, 26% లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో, 24% ఆసియా పసిఫిక్ దేశాల్లో చోటు చేసుకున్నాయని పేర్కొంది. -
జర్నలిస్టుల హత్యలు పెరిగిపోతున్నాయి
హైదరాబాద్: జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సాయినాథ్ మాట్లాడారు. అవినీతికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా కథనాలు రాసే జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని.. ఈ హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రింగర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులే హత్యకు గురైన వారిలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. 1992–2016 మధ్యకాలంలో 50 మంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అనంతరం మీడియా సంక్షోభం గురించి మాట్లాడారు. విద్య సంస్కారాన్ని, సామాజిక బాధ్యతను నేర్పుతుందని.. ఈ రెండు అంశాలకు అరుణ్ సాగర్ జీవితం నిలువుటద్దమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధి వంటి వారన్నారు. పెరిగిపోయిన పోటీతత్వంతో జర్నలిస్టులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి హెల్త్‌కార్డులు ఇచ్చామన్నారు. అరుణ్‌సాగర్ మరణం జర్నలిజానికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం ఉత్తమ జర్నలిస్టులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రథమ బహుమతి ‘సాక్షి’టీవి అసోసియేట్ ఔట్ పుట్ ఎడిటర్ యాజులు (ఖాకీలు చింపిన బస్తర్)కు, ప్రింట్ మీడియాలో తృతీయ బహుమతి ‘సాక్షి’పెద్దపల్లి ఆర్సీ ఇన్చార్జి కట్ట నరేంద్రచారి (వారికి ఒక రోజు వెలుగులు)కి లభించాయి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ద్వితీయ బహుమతి హెచ్ఎంటీవీ మహబూబ్‌నగర్ స్టాఫ్ రిపోర్టర్ నరేంద్రచారి (ఆ నలుగురు పిల్లల కథనం)కు, తృతీయ బహుమతి ఈటీవీ ఆదిలాబాద్ విలేకరి మాణికేశ్వర రావు (అరణ్యవాసం)కు లభించాయి. ప్రింట్ మీడియాలో ప్రథమ బహుమతి ‘నమస్తే తెలంగాణ’అంబర్పేట్ జోన్ విలేకరి వర్కాల కిష్టయ్య (మరణము శాపమేనా)కు, ద్వితీయ బహుమతి ‘నవ తెలంగాణ’మహబూబ్‌నగర్ విలేకరి శివరామ కృష్ణ (తెలంగాణ ఎడారి బతుకు చిత్రం)కు, మరో తృతీయ బహుమతి ‘ఆంధ్రజ్యోతి’హుజూరాబాద్ విలేకరి కోల నాగేశ్వరరావు (గిరిజన కన్నీటి సాగరం)ను వరించాయి. వీరందరినీ హరీశ్‌రావు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీవీ–5 ప్రతినిధి వసంత్, కవి కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు!
సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధం కొనసాగిస్తున్నారు. తమకు చిక్కిన వారిని అత్యంత కిరాతంగా చంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను ఇంటర్నెట్ లో పెడుతూ దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలు భీతి గొల్పుతున్నాయి. తమకు చిక్కిన జర్నలిస్టులను ఐసిస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. జర్నలిస్టుల కెమెరాలు, ల్యాప్ టాప్ ల్లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని వారి మెడలో వేసి పేల్చేశారు. జర్నలిస్టుల చేతులను బేడీలతో ఇనుప రెయిలింగ్ కు కట్టేసి ఈ కిరాతకానికి పాల్పడ్డారు. మెడకు ఇనుప గొలుసు బిగించి అంతమొందించారు. నాలుగో జర్నలిస్టును పదునైన కత్తితో గొంతు కోసి చంపేశారు. ఐసిస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారని, ఫండ్స్ అందుకుంటున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులను చంపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది అక్టోబర్ లో దీర్ ఇల్-జొవర్ నగరంలో వీరిని బందీలు పట్టుకుని డిసెంబర్ లో హతమార్చినట్టు అనుమానిస్తున్నారు.