Joint families
-
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్‌గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్‌లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
International Family Day అద్భుత విజయాల పవర్ హౌస్
ఫ్యామిలీ అంటే...జీవితం మొదలయ్యే చోటు. ప్రేమ ఎప్పటికీ అంతం కాని చోటు. ‘భారతదేశ బలం కుటుంబం’ అంటారు. అయితే కాలంతో పాటు కుటుంబ ముఖచిత్రం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు కనిపించడం అరుదైపోయింది. కుటుంబం అసాధారణమైన బలం ఇస్తుంది. అద్భుత విజయాలు సాధించేలా చేస్తుంది. ఈ స్పృహతో ముందుకు వెళదాం... ఆ విషాదంలో ఒకరికి ఒకరు అండగా... ‘ఫ్యామిలీ నా స్ట్రెంత్’ అని తరచుగా చెబుతుంటుంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. శ్రీదేవి చనిపోవడం జాన్వీ కుటుంబానికి షాక్. ఆ విషాదం నుంచి బయట పడడానికి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు అండగా నిలిచారు. జాన్వీ ఎప్పుడైనా డల్‌గా కనిపిస్తే నాన్న బోనీ కపూర్ ఆ సమయంలో అమ్మగా మారిపోతాడు. తన కబుర్లతో జాన్వీ యాక్టివ్ అయ్యేలా చేస్తాడు. మరి బోనీ డల్‌గా కనిపిస్తే? కూతుళ్లు జాన్వీ, ఖుషీ తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. నాన్నకు ఫ్రెండ్స్‌గా మారిపోతారు. నాన్న ఎప్పటిలాగే నవ్వేలా చేస్తారు. ఆ ముగ్గురిలో ఏ మూలో విషాదం గూడుకట్టుకొని ఉండవచ్చు. అయితే వారు ఒక దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సరదాలు, సంతోషాలే ఉంటాయి. కొన్ని సమయాల్లో చెల్లి ఖుషి అక్క జాన్వీకి అమ్మ అవుతుంది. ధైర్యం చెబుతుంది. దారి చూపుతుంది! ఖుషి విషయంలో జాన్వీ కూడా అంతే! తల్లి లేని లోటు రానివ్వకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘నాన్న, చెల్లి, అన్న అర్జున్ నాకు మెంటార్స్. నా జీవితానికి మార్గదర్శకులు. కెరీర్లో, జీవనగమనంలో వారు నా బలం’ అని తన కుటుంబం గురించి చెబుతుంది జాన్వీ కపూర్.పెద్ద కుటుంబం... మను బాకర్ బలం తన స్ట్రెంత్‌కు కేరాఫ్ అడ్రస్ చెప్పమంటే స్టార్ షూటర్ మను బాకర్ నోటి నుంచి వచ్చే మాట... గోరియా.హరియాణా రాష్ట్రం చర్కీ దాద్రి జిల్లాలోని గోరియా గ్రామంలో బాకర్ కుటుంబ సభ్యులు ఉంటారు. మను పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆ కుటుంబ సంతోషం అంబరాన్ని అంటుతుంది. పోటీలకు వెళ్లి స్వదేశానికి తిరిగివస్తున్నప్పుడు... కుటుంబ సభ్యులను కలవబోతున్నానే సంతోషం మనూను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆమె తండ్రి రామ్ కిషన్ బాకర్ నేవీలో చీఫ్ ఇంజనీర్. తల్లీ సుమేధ స్కూల్ ప్రిన్సిపల్. ఆటల్లో కూతురుని ఎంతో ప్రోత్సహించేవారు. అవసరమైన ట్రైనింగ్ ఇచ్చేవారు. ‘మీ అమ్మాయిని డాక్టర్ చేస్తారా? ఇంజనీర్ చేస్తారా?’ అని బంధువులు అడిగినప్పుడు.... ‘ఛాయిస్ మాది కాదు... మనూ దే’ అనే వాళ్లు.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేఅలా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే మను బాకర్ స్టార్ షూటర్ అయింది. మను బాకర్‌కు ఊళ్లో మరో పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు యూనివర్శల్ హైయర్ సెకండరీ స్కూల్. మను కుటుంబమే ఈ స్కూల్‌ను నడుపుతుంది. ఈ స్కూల్లోని పిల్లలందరికీ మను బాకర్ అక్క. దయా కౌర్ తనకు అమ్మమ్మ కాదు... క్లోజ్ ఫ్రెండ్! ‘సంతోషంలో ఉన్నప్పుడైనా, బాధలో ఉన్నప్పుడైనా ఈ సమయంలో నా ఫ్యామిలీ నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అదే ఫ్యామిలీకి ఉన్న బలం’ అంటుంది మను బాకర్.పిల్లలకు కుటుంబ విలువ తెలియజేసే పుస్తకాలుకుటుంబ బంధాలు, శక్తి గురించి పిల్లలకు సులభమైనరీతిలో అవగాహన కలిగించడానికి ‘సెర్చ్ ఇనిస్టిట్యూట్’ సంస్థ ‘ఫస్ట్ లుక్’ భాగస్వామ్యంతో కొన్ని పుస్తకాలు విడుదల చేసింది... ‘ఫ్యామిలీ స్ట్రెంత్’ను పిల్లలకు తెలియజేయడానికి టాడ్ పార్ రాసి, బొమ్మలు వేసిన పుస్తకం...ది ఫ్యామిలీ బుక్. ‘హ్యాపీ లైక్ సాసర్: ఇన్వెస్ట్’ పుస్తకాన్ని మారిబెత్ బోయిల్డ్స్ రాశారు. లారెన్ కాస్టిలో బొమ్మలు వేశారు. అవర్ ట్రీ నేమ్డ్ స్టీవ్(ఫ్యామిలీ స్ట్రెంత్: బీ డిపెండబుల్) పుస్తకాన్ని అలాన్ జ్వైబెల్ రాశారు. డేవిడ్ కాట్రో బొమ్మలు వేశారు. సాల్ట్ ఇన్ హిజ్ షూస్(ఫ్యామిలీ స్ట్రెంత్: గైడ్) పుస్తకాన్ని మైఖేల్ జోర్డన్ రాశారు. నెల్సన్ బొమ్మలు వేశారు. అమేజింగ్ గ్రేస్(ఫ్యామిలీ స్ట్రెంత్: ఇన్స్పైర్) పుస్తకాన్ని మేరీ హఫ్మాన్ రాశారు. కరోలైన్ బించ్ బొమ్మలు వేశారు. (పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!)ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచ్!‘ఫ్యామిలీ డైనమిక్స్‌లో సమగ్రమైన, సమర్థమైన మార్పులు తేవడమే మా లక్ష్యం’ అంటున్నారు ఫ్మామిలీ మైండ్‌సెట్ కోచ్‌లు. ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచింగ్ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే...కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి వ్యక్తిగత, గ్రూప్ సెషన్లు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్ భేదాభిప్రాయాలు ఉంటే గ్రూప్ సెషన్లలో ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా లేకుండా చేస్తారు. ‘సైకోమెట్రిక్ అసెస్మెంట్’ప్రోగ్రాం ద్వారా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరి బలాబలాలను అంచనా వేసి అవసరమైన సలహాలు ఇస్తారు. -
కంచికి చేరిన కథలు
పాశ్చాత్య సం స్కృతి వెర్రి తలలు వేస్తున్న వేళ.. పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన లేకుండాపోతోంది. టీవీ, వీడియో గేమ్స్‌పై చూపుతున్న శ్రద్ధ సంప్రదాయ ఆటలపై చూపడం లేదు. పెద్దల సాన్నిహిత్యంలో నీతి కథలు వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. సమాజంలో ఉమ్మడి కుటుంబాలకు ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పుడు పండుగ, వేసవి సెలవులను పిల్లలు సంతోషంగా గడిపేవారు. వివిధ శిక్షణలతో ఇప్పుడు వారికి తీరిక కూడా లేకుండాపోతోంది. కామారెడ్డి, న్యూస్‌లైన్: ‘అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’లాంటి కథలను పిల్లలు ఆసక్తి గా వినేవారు. తాత, నాయినమ్మల ఒడిలో కూర్చుని పిల్లలు కథలను మెదడుకు ఎక్కించునేవారు. మనవలు, మనమరాండ్లకు కథలు చె ప్పడం ద్వారా తాత, నాయినమ్మలు కూడా ఎన్నో అనుభూతుల కు లోనయ్యేవారు. మనవలు, మనవరాళ్లు ఉత్తములుగా ఎదుగుతారని ఊహించుకుని మురిసిపోయేవారు. పిల్లలు కూడా తాత, నా యినమ్మలు చెప్పే కథలను ఆసక్తిగా వినేవారు. ఆ కథల్లోని సారాంశాన్ని గుర్తించి అందులోని నీతి ని అర్థం చేసుకునేవారు. కథలు ఇంకా, ఇంకా చెప్పమని నిద్రపోయేదాక వారి వెంట పడేది. కథల్లోని మంచిని మనసులో నింపుకుని జీవితాంతం గుర్తుంచుకుని తమ భావి జీవితంలో స్నేహితులతో వాటిని పంచుకునేవారు. నైతిక విలువల నిర్మాణంలో కథలు ప్రేరణగా ఉపయోగపడేవి. ఇదంతా గతం. యాంత్రిక జీవనానికి తోడు మనుషుల్లో పెరిగిన స్వార్థం మూలంగా ఉమ్మడి కుటుంబాల ఉనికి కరువైంది. పట్టణాలేగాకుండా పల్లెల్లోనూ ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. ఇప్పటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంటు పాఠశాలలకు పంపుతూ, వారి చదువుల కోసమేనంటూ పట్టణాలకు వలస వెళుతున్నారు. పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డ పిల్లలు పల్లె ఒడిలో నేర్వాల్సిన ఆట, పాటలను మరిచిపోతున్నారు. దానికి తోడు పల్లెను పట్టుకుని ఉండే తాత, నాయినమ్మల అనుబంధాలకూ దూరమవుతున్నారు. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో వచ్చే సెలవులతోపాటు వేసవి సెలవుల సమయంలోనూ పిల్లలకు స్పెషల్ క్లాసులని, ఇతర వ్యాపకాల్లో శిక్షణలంటూ కథలకు దూరం చేస్తున్నారు. ఆట, పాటలూ అంతే పల్లె ఒడిలో ఎన్నో రకాల ఆట, పాటలు ఉండేవి. పల్లెల్లో చిర్రగోనె, గోళీలాట, చెట్టిరక, కబడ్డీ, అష్టచెమ్మ, తొక్కుడుబిచ్చ, పచ్చీసు వంటి ఆటలు ఇప్పటి పిల్లలకు తెలియకుండాపోతున్నాయి. చెరువులు, కుంటల్లో మునిగితేలుతూ ఈత నేర్చుకునేవారు. పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవారు. ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినే పరిస్థితులు ఇప్పటి పిల్లలకు లేకుండాపోయాయి. పల్లె అందాలు, పల్లె అనుభూతులు అనేవి వారికి దూరమవుతున్నాయి. చదువు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ ఆటలు వంటివి మాత్రమే వారి దరిచేరుతున్నాయి. తద్వారా వారిలో మానసిక వికాస ధోరణి తగ్గిపోతోంది. అనుబంధాలకు దూరమవుతున్నారు ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులలో అనుబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. పిల్లలకు కనీసం నాయినమ్మ, తాతలతో సంబంధాలు లేకుండా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రక్తసంబంధీకులతోనే అనుబంధాలు దూరం కావడం మూలంగా సమాజంతో వారికి సరైన అవగాహన కుదరడం లేదు. దీంతో పిల్లల్లో సామాజిక స్పృహ అనేది లేకుండాపోతోంది. నేను, నా జీవితం అన్న ధోరణులు పెరుగుతున్నాయి. ఇది స్వార్థానికి కారణమై, కన్నవారిని కూడా పట్టించుకోలేని పరిస్థితులకు నెడుతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే చూస్తుండడంతో డబ్బు కోసం క్రూరత్వం పెరిగిపోతోంది. ఇప్పటికైనా పిల్లలను కథలు నేర్పిస్తే భవిష్యత్ బాగుంటుంది.


