పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే | decline of joint families rise of nuclear families india marriage trends | Sakshi
Sakshi News home page

పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే

Apr 15 2026 8:41 AM | Updated on Apr 15 2026 8:45 AM

decline of joint families rise of nuclear families india marriage trends

కనిపించని ఉమ్మడి కుటుంబాలు 

వేరు కాపురాలు పెడుతున్న  కొత్త దంపతులు 

పెళ్లి చూపుల్లోనే షరతులు పెడుతున్న యువతులు  

సాఫ్ట్‌వేర్‌ పుణ్యమా అని పనిచేసే చోటే కొత్త కాపురాలు  

ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు.  

పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.

పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే 
పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్‌గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్‌లోనే అనేక షరతులు పెడుతున్నారు. 

పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్‌ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement