breaking news
job racketeers
-
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్‌సైట్‌ను ప్రధాన నకిలీ పోర్టల్‌గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
నిందితులను పట్టుకొచ్చిన బాధితులు
బాలానగర్ (హైదరాబాద్) : రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ రైల్వే ఉద్యోగిని, అతడి తమ్ముడిని బాలానగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్లో టీటీఈగా పని చేస్తుంటాడు. శ్రీనివాసరావు తమ్ముడైన బాబూరావు హైదరాబాద్ బాలానగర్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటాడు. కాగా వీరిద్దరూ కూడబలుక్కుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. ఆ విధంగా తమ ప్రాంతంలోనే ఉండే అజయ్‌కుమార్ నుంచి రూ.రెండు లక్షలు గుంజారు. అశోక్, వెంకటేశ్వర్లు, పాపయ్య, కిరణ్ అనే మరో నలుగురు యువకులు కూడా వారికి రూ.8 లక్షలు ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అనుమానించిన బాధితులు ఓసారి బాబూరావు, శ్రీనివాసరావులను నిలదీశారు. గత ఏడాది బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల వారం రోజుల క్రితం బాబూరావు రాత్రికిరాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు నేరుగా విజయవాడ వెళ్లి శ్రీనివాసరావు, బాబూరావులను పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మోసం నిర్ధారణ అవడంతో ఇద్దరినీ మంగళవారం రిమాండ్‌కు తరలించారు.


