Jigris Teaser: నవ్వులు పూయిస్తున్న ‘జిగ్రీస్’ టీజర్
‘కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌తో మొదలైంది జిగ్రీస్ మూవీ టీజర్. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, కామెడీ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.టీజర్ రిలీజ్ అనంతరం సందీప్ మాట్లాడుతూ.. ‘ కృష్ణ వోడపల్లి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నాకు చెబితే తిడతానని.. చెప్పకుండానే సినిమా స్టార్ట్ చేశాడు. యానిమల్ షూటింగ్ గ్యాప్‌లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్ చూపించాడు. చాలా బాగున్నాయి. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఈ రోజుల్లో కాన్ టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్. టీజర్లో చూసిన కామెడీ చాలా తక్కువే. సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. కంటెంట్ బాగుంటే చాలు డైరెక్టర్, నిర్మాతలతో సంబంధం లేకుండా సినిమాను హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ చిన్న సినిమా కంటెంట్ బాగుంది. అందరూ సపోర్ట్ చేయండి’ అన్నారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.