breaking news
JEE Advanced 2016
-
ఆకలి బాధతో పస్తులుంటూనే విజేతగా..
గోరఖ్పూర్: రోజులెప్పుడు ఒకలా ఉండవు. కొత్తకొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తి కూడా కష్టమొచ్చిన రోజు కుంగిపోకుండా.. సుఖం వచ్చిన రోజు పొంగిపోకుండా ఉండాలని అంటుంటారు. దీనికంటేముందు ప్రతి వ్యక్తికి ఓర్పు కచ్చితంగా ఉండాలి. కష్టాల్లో కూడా చేసే పనిపై దృష్టిని జారీపోనివ్వకుండా చూసుకుంటే విజయం దానంతటదే తన్నుకుని వస్తుంది. సరిగ్గా ఇదే నిరూపించాడు ఉత్తరప్రదేశ్లో ఓ పేద కుటుంబంలో జన్మించిన అభయ్ అనే విద్యార్థి. రాష్ట్రంలోని గోరక్ పూర్ కు చెందిన అభయ్ అనే విద్యార్థి పస్తులు ఉంటూనే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయం సాధించాడు. ఆదివారం దేశ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ ఫలితాల్లో 3,372వ ర్యాంకును సాధించాడు. దీంతో ఒక్కసారిగా తన గతమంతా మాయమై ఇప్పుడు అతడి ముఖంలో కుటుంబంలో సంతోషాలు వెల్లి విరిసాయి. పేదరికంతో నిండిన కుటుంబంలో జన్మించిన అభయ్ తండ్రి ఓ దినసరి కూలి. కుటుంబం మొత్తానికి అతడే పెద్ద దిక్కు. ప్రతి రోజు పనికి వెళ్లి వస్తేనే ఇంట్లో గడుస్తుంది. అయితే, ముందునుంచే చురుకైన విద్యార్థి అయిన అభయ్.. తన ఇంట్లో ఎన్నోసార్లు భోజనం లేకుండా ఖాళీ కడుపుతోనే ఉంటూనే చదువుపై మక్కువ పెంచుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలని కలగన్న అతడు దానికి తగినట్లుగా తన పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా చదివాడు. సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్డ్ 2016 పరీక్షల్లో విజయం సాధించాడు. అభయ్ కు మరో సోదరుడు ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్ ఏమన్నాడంటే..?
జైపూర్: జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన అమన్ బన్సాల్ మొదటి ర్యాంక్ సాధించాడు. 320 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. కోట ప్రాంతంలో అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ లో అతడు కోచింగ్ తీసుకున్నాడు. ఇదే ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న కునాయ్ గోయల్ 310 మార్కులతో మూడో ర్యాంక్ లో నిలిచాడు. ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నట్టు అమన్ బన్సాల్ తెలిపాడు. రెగ్యులర్ స్టడీస్, ఆత్మవిశ్వాసం తన విజయానికి కారణమని వెల్లడించాడు. 'జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం రోజుకు 5 నుంచి 6 గంటల పాటు చదివేవాడిని. తరగతి గదిలో తమకొచ్చిన అనుమానాలను విద్యార్థులు వెంటనే నివృత్తి చేసుకోవాల'ని 17 ఏళ్ల అమన్ అన్నాడు. అతడి తండ్రి ఇంజనీర్. తల్లి గృహిణి. సబ్జెక్టులోని కీలక అంశాలపై సహచర విద్యార్థులతో చర్చించేవాడినని.. దీంతో అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి అయ్యేవని, అవగాహన పెరిగేదని బన్సాల్ వివరించాడు. కోటలో కోచింగ్ తీసుకోవడం కూడా తనకు ఉపయోగపడిందని తెలిపాడు. ఇంటర్ పరీక్షల్లో అతడు 96.2 శాతం మార్కులు సాధించాడు.