breaking news
jedie
-
మిశ్రమ వ్యవసాయంతో లాభాలు
కళ్యాణదుర్గంరూరల్: రైతులు మిశ్రమ వ్యవసాయంతో అనేక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ జేడీ టీవీ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. మండలంలోని భట్టువానిపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి జేడీఏ, కేవీకే సమన్వకర్త డాక్టర్ జాన్ సుధీర్, మహానంది అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, కేవీకే డాక్టర్ ప్రసాద్‌బాబు, ఆదినారాయణ, రేజష్, తిమ్మప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో రావీప్ విద్యార్థినులు పాల్గొన్నారు. అమడగూరు: పంటలకు రసాయనాల వాడకం ద్వారా తక్కువ ఖర్చులు వస్తాయని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. గుండువారిపల్లి గ్రామంలో నాలుగు నెలల నుంచి వ్యవసాయ కళాశాలకు చెందిన 18 మంది రావె విద్యార్థులు చేపట్టిన శిక్షణలో భాగంగా సోమవారం గ్రామ సచివాలయంలో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా హాజరైన సంపత్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, రసాయనాలను వినియోగించడం ద్వారా పంటలో కలుపు రాకుండా, రోగాలు సోకకుండా నివారించవచ్చన్నారు. అలాగే వేరుశనగలో వస్తున్న కొత్త వంగడాలైన కే–9, కే–6 ను సాగు చేయడం ద్వారా ఏకంగా 45 రోజుల పాటు నీటి సరఫరా లేకున్నా పంట తట్టుకుంటుందన్నారు.ఈసందర్భంగా ఆర్గానిక్ క్లస్టర్ సీఏ, సీఆర్పీలు కొన్ని రకాల కషాయాలను తయారు చేసి చూపించారు. అనంతరం సచివాలయంలో రావె విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను, పోస్టర్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కవితారాణి, సర్పంచ్ శశికళ, కదిరి ఏడీఏ లక్ష్మినారాయణ, ఓడీచెరువు ఏఓ సత్యనారాయణ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
రాయితీతో పైపులు
అనంతపురం అగ్రికల్చర్: జాతీయ నూనెగింజల పథకం కింద రాయితీతో అందించనున్న నీటి సరఫరా పైపులు (వాటర్ క్యారియింగ్ పైప్స్) అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాకు 445 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. రెండు, రెండున్నర, మూడు, నాలుగు ఇంచుల పీవీసీ పైపులు ఇస్తామన్నారు. ఐదు ఎకరాల్లోపున్న రైతులకు ఒక్కో యూనిట్ కింద రెండు, రెండున్నర ఇంచుల పైపులు 43, మూడు ఇంచులవి 35, నాలుగు ఇంచులవి 25 పైపులు ఇస్తామన్నారు. అలాగే ఐదు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రెండు, రెండున్నర ఇంచులవి 66, మూడు, నాలుగు ఇంచులవి 50 పైపులు ఇస్తామన్నారు. రెండు ఇంచుల పైపులకు సంబంధించి పూర్తి ధరపై రూ.155, ఆపైన ఉన్న పైపులపై రూ.210 ప్రకారం రాయితీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అవసరమైన వేరుశనగ రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.