breaking news
jamaat-ud-dawah
-
లష్కరే నేత అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్–దవా ఉపాధ్యక్షుడు హఫీజ్ అబ్దుల్ రహ్మాన్(76) మక్కి లాహోర్లో చనిపోయాడు. మధుమేహం ముదిరిపోవడంతో కొంతకాలంగా అతడు లాహోర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, శుక్రవారం వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడని జమాత్ ఉద్–దవా తెలిపింది. ఉగ్ర నిధుల కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతడికి 2020లో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో ఇతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో, మక్కి ఆస్తుల సీజ్తోపాటు ప్రయాణ, ఆయుధ నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి మక్కి బహిరంగంగా కనిపించడం మానేశాడు. అప్పట్నుంచి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త వాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాడు. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కరులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. -
పాక్ ఎన్నికల్లో పోటీకి హఫీజ్ సయీద్ దూరం
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్కు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్ తెహ్రీక్(ఏఏటీ)తో ఎంఎంఎల్ జట్టు కట్టింది. సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు. -
లాహోర్ టు ఇస్లామాబాద్: హఫీజ్ భారీ ర్యాలీ
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ మంగళవారం కశ్మీర్ కు స్వాతంత్ర్యం(కశ్మీర్ కారవాన్) పేరుతో భారీ ర్యాలీ చేపట్టాడు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు (264 కిలోమీటర్లు) సాగనున్న ఈ ర్యాలీలో వేల మంది జమాత్ ఉల్ దవా కార్యకర్తలు, వందలాది వాహనాల్లో దేశ రాజధాని వైపు కదిలారు. బుధవారానికి ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోనుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి కశ్మీర్ విషయంలో పాక్ సెనెటర్లు, ఇతర నేతలపై ఒత్తిడి ఒత్తిడి పెంచుతామని హఫీజ్ మీడియాకు చెప్పాడు. కశ్మీర్ లోయలో హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు 11 రోజులు గడిచినా చల్లారడంలేదు. ఇప్పటికే ఒక జవాన్ సహా 43 మంది పౌరులు చనిపోయారక్కడ. కశ్మీర్ లో ఉద్రిక్తతలు పార్లమెంట్ ను సైతం కుదిపేశాయి. సోమవారం రాజ్యసభలో కశ్మీర్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. 'లోయలో ఆందోళనలన్నీ పాకిస్థాన్ ప్రోద్బలంతో జరుగుతున్నవే'అని అన్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే ర్యాలీ ద్వారా కశ్మీర్ అంశాన్ని తిరిగికి ప్రాముఖ్యత తీసుకురావాలన్నది హఫీజ్ వ్యూహంగా కనిపిస్తోంది. -
ఎవరీ హఫీజ్ సయీద్?
డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ సయీద్ గిలానీ వీడియో కాన్ఫరెన్స్ విచారణతో 26/11 ముంబై దాడుల కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. దాడుల కీలక సూత్రధారి హఫీజ్ మొహమ్మద్ సయీద్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతూ .. భారత్ కు వ్యతిరేకంగా మరింతమంది కసబ్ లను తయారుచేసేపనిలోఉన్నాడు. అయితే అందరు ఉగ్రవాద నాయకుల్లాగా రహస్యంగా దాక్కోకుండా.. బహిరంగంగా సంచరించడం, పెద్ద ఎత్తున జనాలన సమీకరించి సభలు నిర్వహించడం హఫీజ్ ప్రత్యేకత. జమాత్-ఉద్-దవా(జేయూడీ)పై నిషేధం ఉన్నప్పటికీ హఫీజ్ ను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? నిజంగానే పాకిస్థాన్ లో ఆయనకు ప్రజాబలం ఉందా? లేక వాపును చూసి బలుపనుకుని అతణ్ని కట్టడిచేసేందుకు పాక్ ప్రభుత్వం వెనకడుగువేస్తోందా? ఒక్కసారి హఫీజ్ గురించిన వాస్తవాలను తెల్సుకొని ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకుదాం.. ఏకాలంలోనైనా ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు సంవృద్ధిగా పండే నేల అది. కాస్త వివరంగా చెప్పాలంటే.. అమృతకశంలాంటి ఆ ప్రాంతాన్ని వదులుకోలేకే దాయాది దేశం మనతో యుద్ధాలు చేసింది. మారిన పరిస్థితుల్లో తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేక.. బీ టీమ్ లైన ఉగ్రవాదులన ఎగదోస్తోంది. ఆ 'ఆక్రమిత కశ్మీర్' లోని ముఖ్యనగరాల్లో ఒకటైన సర్గోదా.. హఫీజ్ మొహమ్మద్ సొంత ఊరు. 1950, మార్చి 10 ఆయన పుట్టినరోజు. తండ్రి పేరు కమాలుద్దీన్. ఇస్లామిక్ పండితుడైన కమాలుద్దీన్ వ్యవసాయం కూడా చేసేవాడు. హఫీజ్ తల్లితోపాటు బంధువర్గంలో చాలామంది విద్యావంతులే. హఫీజ్ పూర్వీకులది ఇండియానే ముస్లిం గుర్జర్లయిన హఫీజ్ పూర్వీకులది హర్యానాలోని హిస్సార్. దేశవిభజన సమయంలో అటువైపునకు బయలుదేరిన వారి కుటుంబం.. నాలుగు నెలల ప్రయాణం తర్వాతగానీ పాకిస్థాన్ కు చేరుకోలేదు. అదే సమయంలో చెలరేగిన హిందు- ముస్లిం ఘర్షణల్లో ఆ కుటుంబానికి చెందిన 36 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పుడే మతపరమైన బోధనలకు ఆకర్షితుడైన హఫీజ్ 12 ఏళ్లకే పవిత్రగ్రంథాన్ని కంఠతాపట్టాడు. అయితే కేవలం మతానికే పరిమితమైపోకుండా సాధారణ చదువుల్లోనూ రాణించాడు. 1966లో మెట్రిక్యులేషన్, 68లో ప్లస్ టూ పూర్తిచేసి, లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తోపాటు రెండు మాస్టర్ డిగ్రీలను సాధించాడు. ఆసియాలోని మొదటి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(లాహోర్)లో ప్రొఫెసర్ గా చేరాడు. కొంతకాలం తర్వాత సౌదీలోని కింగ్ సౌద్ యూనివర్సిటీలో చేరి అరబి భాష స్పెషలైజేషన్ గా మరో డిగ్రీ విత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇస్లామిక్ స్టడీస్ తోపాటు ప్రాపంచిక అవగాహన కలిగిఉన్నాడనే భావనతో.. ప్రొఫెసర్ హఫీజ్ సయీద్ ను కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(మత పరమైన విషయాల్లో పాక్ ప్రభుత్వానికి సలహాలిచ్చే రాజ్యాంగ సంస్థ) సభ్యుణ్ని చేశాడు నాటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగామారిపోయాడు హఫీజ్. 1979లో ప్రారంభమైన అఫ్ఘాన్- సోవియట్ యుద్ధంలో ఆఫ్ఘన్లకు మద్దతుగా లష్కరే తోయిబా(అల్లాహ్ సైన్యం) అనే సంస్థను స్థాపించారు హఫీజ్ సయీద్, అబ్దుల్లా యూసుఫ్ ఆజం(ఈయనా ఇస్లామిక్ స్కాలరే, అల్- ఖాయిదా వ్యవస్థాపకుల్లో ఒకడు). యుద్ధం చివరిదశలో అంటే 1986లో ప్రారంభమైన ఈ సంస్థ వేలమంది పాకీస్థానీ యువకులకు జిహాదీ పాఠాలు నేర్పించి ఆఫ్ఘన్లకు మద్దతుగా సోవియట్ తో పోరాడేందుకు పురిగొల్పేది. లష్కరేకు మొదట్లో ఒసామా బిన్ లాడెనే ప్రధాన ఆర్థిక వనరు. అప్పట్లో అది అస్థిత్వపోరాటంగా ప్రాచుర్యం పొందింది. అయితే 1988లో సోవియెట్ యుద్ధం నుంచి వెనుకడుగు వేయటం, 1991 నాటికి ఏకంగా సోవియట్ యూనియనే కుప్పకూలడంతో యుద్ధంలోపోరాడిన ఇస్లామిక్ గ్రూపులన్నీ తలోదారి వెతుక్కున్నాయి. వాటిల్లో ఒకటైన అల్- కాయిదా అఫ్ఘానిస్థాన్ లో రాజకీయపట్టుకు ప్రయత్నించగా.. దిక్కుతోచకే 'ఆజాద్ కశ్మీర్' నినాదం హఫీజ్ నేతృత్వంలోని లష్కరే 'కశ్మీర్ విముక్తి'పై దృష్టిసారించింది. దాయాది దేశంతో యుద్ధం తర్వాత భారత భూభాగంలో ఉండిపోయిన కశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపాలనే ప్రధాన డిమాండ్ తో ఆ సంస్థ మళ్లీ జిహాదీ పోరాటం ప్రారంభించింది. అటు ఉగ్రవాద కార్యకలాపాలతోనేకాక స్వదేశంపై రాజకీయపరమైన ఒత్తిడి పెంచాలనేది హఫీజ్ వ్యూహం. 1990ల్లో కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి, భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన లష్కరే.. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడంలో సఫలమైంది. అయితే 2001లో భారత పార్లమెంట్ పై దాడి అనంతరం అంతర్జాతీయంగా తలెత్తిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి దానిపై నిషేధం విధించింది. దీంతో లష్కరే నుంచి విడిపోయి 'జమాత్-ఉద్-దవా(జేయూడీ)' అనే కొత్త సంస్థను ప్రారంభించాడు హఫీజ్. పేరుతోపాటే విధివిధానాల్లోనూ పలు కీలక మార్పులు తెచ్చాడు. పాకిస్థాన్ లోని అనేక పట్టణాల్లో ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించి సేవకార్యక్రమాలను ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా విస్తరించిన జేయూడీ కార్యకర్తలు సంస్థ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించగల సమర్థులు. కేవలం జీహాదీ గ్రూప్ గానేకాక.. రాజకీయ సంస్థగానూ జమాత్- ఉద్- దవాను తీర్చిదిద్దాలన్నది హఫీజ్ సయీద్ ప్రణాళిక. కానీ ముంబై దాడుల తర్వాత అతనికి, అతని సంస్థకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. లష్కరేతో తనకుగానీ, జేయూడీకిగానీ సంబంధాలు లేవని ఎంత బుకాయించినప్పటికీ ఆ బంధం తాలుకూ సాక్ష్యాధారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం జేడీయూపైనా నిషేధం విధించింది. హఫీజ్ ను అరెస్టు చేసి కొంతకాలం జైల్లో పెట్టగలిగిందికానీ ఎప్పటిలాగే కోర్టు ఆదేశాల మేరకు అతణ్ని విడుదలచేసింది. ఆ సంస్థ పేరుచెబితే ఒళ్లుమంట 'బ్రిటన్ ప్రధానులు నాలుగు గదుల ఇంట్లో సాధారణంగా జీవిస్తుంటే మా దేశ నాయకులు మాత్రం మహల్లలో రాజభోగాలు అనుభవిస్తారు. ఇది ఇస్లాంకు విరుద్ధం' అని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. పాకిస్థానీ పాలకులను తూర్పారబట్టాడు. అందుకు ప్రతీకారంగా అదనుచూసి అతణ్ని దెబ్బకొట్టాలని అక్కడి పాలకులు భావిస్తుండొచ్చు. అయితే తనదైన ఇస్లామిస్ట్ మార్క్ తో పాక్ ఆర్మీతో ఆయన ఏర్పర్చుకున్న సంబంధాలు, సయూద్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ లో పాక్ ఆర్మీకి బీ టీమ్ గా ఉండటం, భారత్ ను అస్థిరపర్చే క్రమంలో ఆ మూకలుచెప్పుకోదగ్గ విధ్వంసాలకు పాల్పడటం వంటి కారణాలు హఫీజ్ సయీద్ పూర్తికాల అరెస్టుకు ప్రతిబంధకాలని చెప్పొచ్చు. ఇండియాలో చోటుచేసుకునే పొలిటికల్ డెవలప్ మెంట్ల పై నిమిషాల వ్యవధిలో కామెంట్లు చేసే హఫీజ్ సయ్యిద్ కు స్వదేశంలోనూ శత్రువులు లేకపోలేరు. పాక్ ను నాశనం చేస్తామని కంకణం కట్టుకున్న పాక్ తాలిబన్లంటే ఆయనకు మంట. అందుకే ఆ సంస్థను భారత్ ప్రోత్సహిస్తోందంటూ నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తాడు. పార్లమెంట్ పై దాడి అనంతరం అరడజనుకుపైగా దేశాలు లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించగా, ముంబై దాడుల తర్వాత యావత్ ప్రపంచం మొత్తం హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా, ఆయన జేయూడీని ఉగ్రసంస్థగా గుర్తించింది. అమెరికా హఫీజ్ తలపై రూ.60 కోట్ల బహుమతిని ప్రకటించింది. ముంబైలో దాడుల్లో సజీవంగా దొరికిన కసబ్ లాంటి చిన్నచేపలు వెల్లడించిన సమాచారాన్ని బట్టి హఫీజ్ సయీద్ మాటలతో మత్తుమందు జల్లుతాడు. జిహాద్ కోసం ఎంతటి క్రౌర్యానికౌనా ఒడిగట్టేలా మనుషుల్ని మృగాలుగా మారుస్తాడు. లాహోర్ లోని ఓ మధ్యతరగతి నివాస ప్రాంతంలోని హఫీజ్ ఇంటిచుట్టూ ఆయన ప్రైవేటు బలగాలు తుపాకులతో పహారా కాస్తుంటారు. హఫీజ్ భార్య పేరు మైమూనా. వారికి ముగ్గురు సంతానం. కొడుకు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుతుళ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.