breaking news
jai jai telangana
-
జయహో తెలంగాణ
అంతా జోష్.. హుషార్.. తీన్మార్.. ధూంధాం.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. మిన్నంటిన నినాదాలు.. అరవై ఏళ్ల కల సాకారమైన వేళ.. మా రాష్ట్రం.. మా పాలన అని లక్షలాది గొంతుకలు ఆడిపాడాయి.. ఆదివారం అర్ధరాత్రి నుంచే జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు నింగినంటాయి. తెలంగాణవాదుల ఉరిమే ఉత్సాహానికి అద్దంపట్టేలా దిక్కులు పిక్కటిల్లేలా... భూమ్యాకాశాలు దద్దరిల్లేలా.. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సంబురాలు అంబరాన్ని తాకాయి. సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్రం నుంచి విడివడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వేళ మెతుకుసీమ ఆవిర్భావ వేడుకలతో పులకించింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన వెంటనే జిల్లాలోని పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా తెలంగాణకు స్వాగతం పలుకుతూ ప్రజలు, నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో వందలాది గొంతుకలు జై తెలంగాణ అంటూ హోరెత్తాయి.. మరోవైపు టపాసుల మోతలు మో గాయి.. యువకులు, విద్యార్థులు కేరింతలుకొడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు, ఉద్యోగులు, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు పలుపార్టీల నేతలు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ధూంధాం కళాకారుల ఆటపాటలతో తెలంగాణ సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో కేక్‌లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో కలెక్టర్ స్మితా సబర్వాల్ పాలుపంచుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేశారు. ఉద్యోగులకు కలెక్టరేట్ ఆవరణలో పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో కొత్తబస్టాండు వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీజేఏసీ చైర్మన్ వై.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుడు దుర్గేశ్ఆధ్వర్యంలో నిర్వహించిన దూంధాం కార్యక్రమం పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. యువకులు, విద్యార్థులు, టీఆర్ఎస్వీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్లో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీహెచ్ఈఎల్, బీరంగూడ, పటాన్చెరు, ఇస్నాపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చటంతోపాటు మిఠాయిలు పంచిపెట్టారు. బీహెచ్ఈఎల్ చౌరస్తా, ఇస్నాపూర్‌లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్‌లో టీఎన్జీవోభవన్, పాతబస్టాండు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని కేక్‌కట్‌చేశారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని టపాసులు కాల్చారు. సిద్దిపేటలో పాతబస్టాండు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. నారాయణఖేడ్‌లో రాజీవ్చౌక్వద్ద టీజేఏసీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు కిష్టయ్యమాస్టారు, శంకర్, నారాయణ పాల్గొన్నారు. జహీరాబాద్‌లో టీజేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆంబేద్కర్ విగ్రహాం దగ్గర దూంధాం కార్యక్రమం నిర్వహించారు. జోగిపేటలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు సంయుక్తంగా తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు వద్ద వేడుకలు జరిగాయి. -
విజయోత్సాహం
రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణవాదులంతా రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ జయహో తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నల్లగొండలోని అమరవీరులస్థూపం వద్ద విజయోత్సవ సందడి నెలకొంది. టీజేఏసీ, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలతో హడావిడి వాతావరణం కనిపించింది. అరవై ఏళ్ల పోరాటం ఫలించిందని, ఉభయసభల ఆమోదంతో అమరవీరుల ఆత్మ శాంతిస్తుందంటూ తెలంగాణవాదులు ఆనందం వ్యక్తం చేశారు.