breaking news
Jagannathpur
-
తీరు మారకుంటే.. ఆ ఎనిమిదిమంది మాంత్రికులను మట్టుబెడతాం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/రాయికల్ (జగిత్యాల): జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురు వ్యక్తులను పాశవికంగా హతమార్చిన ఘటన మరువకముందే అలాంటి దృశ్యం పునరావృతం అవుతుందంటూ వెలిసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రాల నెపంతో జగిత్యాలకు చెందిన వడ్డీ వ్యాపారి జగన్నాథం నాగేశ్వర్రావు అతని ఇద్దరు కుమారులను కులసంఘం సమావేశంలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 8 మందిని అదే తరహాలో హతమారుస్తామంటూ.. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లో ఫ్లెక్సీ వెలిసింది. ఇది స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామంలో 8 మంది మాంత్రికులు ఉన్నారని, వారు తీరు మార్చుకోకపోతే చంపుతామని అందులో హెచ్చరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, ఎస్సై కిరణ్‌కుమార్ ఊరిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఎవరికైనా ప్రాణభయం ఉన్నా, బెదిరింపులు వచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులు తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) -
గూడెం గుబాళిస్తోంది..!
సాక్షి, జగిత్యాల: అవి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రం నుంచి 25 కి.మీల దూరంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం జగన్నాథ్‌పూర్. దానికి ఆనుకునే నాయికపుగూడెం. రెండు దశాబ్దాల క్రితం వరకు నక్సల్స్ సమావేశాలు.. పోలీసుల బూట్ల చప్పుళ్లతో అల్లకల్లోలంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. ఒకప్పుడు పోలీసులంటేనే భయంతో పరుగులు పెట్టిన ఆ గిరిజనులు.. ఇప్పుడు వారికి దోస్తులుగా మారారు. వారితో కష్టసుఖాలను పంచుకుం టున్నారు. తాము అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. ఏడాది క్రితం వరకు కనీసం ఎర్రబస్సు ఎరుగని ఆ ఊరికి రోజుకు రెండుసార్లు పరుగులు పెడుతోంది. ఏళ్ల తరబడి ఏ సదుపాయం లేకుండా ఓ గుడిసెలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం వరించింది. ఏటా వర్షాకాలంలో వాగును తలపించే జగన్నాథ్‌పూర్–నాయికపుగూడం 2 కి.మీ రోడ్డుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం ఇప్పుడు అభివృద్ధి బాట పడుతున్నాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ దత్తత గ్రామంపై ‘సాక్షి’ఫోకస్.. మార్పుదిశగా..! సుమారు 850 మంది ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెంలో 90 శాతం మంది నిరక్షరాస్యులే. కొందరు పత్తి, మిర్చి పండిస్తే.. అనేక మంది వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్యకూ నోచుకోలేదు. అయితే ఎస్పీ అనంతశర్మ ఏడాది క్రితమే ఈ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గతేడాది మార్చి 8న గ్రామానికి చెందిన గిరిజన మహిళలతో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్న ఎస్పీ వారికి మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. పురుషులతో సమానంగా పోటీ పడేతత్వం గురించి వివరించారు. నాయికపుగూడెంలో రూ. 2 లక్షలతో నిర్మించనున్న పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం గిరిజన విద్యార్ధినీవిద్యార్థులు 23 మంది చదువుకుంటున్నారు. ఎస్పీతో కలసి గిరిజనులు తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నారు. జగన్నాథ్‌పూర్ టు హైదరాబాద్ పోలీసులు.. నక్సలైట్ల భయంతో జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఏనాడూ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. జగిత్యాల వరకు వచ్చిన వారు కొందరు మాత్రమే ఉన్నారు. అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తించిన ఎస్పీ అనంతశర్మ.. తొలిసారిగా గతేడాది జులై 4న ప్రత్యేకంగా వారి కోసం ‘సందర్శనయాత్ర’ నిర్వహించి ఏకంగా హైదరాబాద్‌కు పంపించారు. గోల్కొండ, చార్మినార్ చరిత్రాత్మక కట్టడాలను చూసిన గిరి జనులు మురిసిపోయారు. అసెంబ్లీ, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, విమానాశ్రయాలను చూసి ఆనందంతో పరవశించిపోయారు. స్వయం సాధికారిత వైపు అడుగులు గిరిజన మహిళా సాధికారిత కోసం నడుంబిగించిన ఎస్పీ అనంత శర్మ.. స్వయంగా కలకత్తాకు చెందిన నేషనల్ జ్యూట్ బోర్డును సంప్రదించారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో జగన్నాథ్‌పూర్‌లో జాతీయ జనపనార శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 మంది మహిళలకు జనపనారతో వస్తువుల తయారీ, కుట్టుమిషన్లు, అల్లికలు వంటి వాటిపై రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. నెలరోజుల లోపే గిరిజన మహిళలు జనపనారతో లగేజీ బ్యాగు, హ్యాండ్‌బ్యాగ్, మార్కెట్బ్యాగ్, గిఫ్ట్బ్యాగ్, షాపింగ్ బ్యాగ్, మనీపౌచ్, చిల్డ్రన్ హ్యాండ్‌బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు తయారు చేయడం మొదలుపెట్టారు. మొత్తం వెయ్యికి పైగా బ్యాగులు తయారు చేసి రూ.60 వేలు సంపాదించారు. జియో నెట్వర్క్ అధికారులతో మాట్లాడి ఆ గిరిజన గ్రామంలో జియో 4జీ సేవలను సైతం ఎస్పీ ప్రారంభించారు. గిరిజనుల్లో చిరునవ్వు చూడాలని.. : అనంతశర్మ జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఎంతో అమాయకులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిలో జీవిస్తున్న విషయం తెలుసుకున్న నేను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న. ముఖ్యంగా మహిళలు ఆర్థి కంగా ఎదిగేలా.. సాధికారిత సాధించేలా వారికి జనపనార శిక్షణ ఇప్పించా. అనతికాలంలో తాము తయారు చేసిన బ్యాగులతో రూ. 60 వేలు సంపాదించుకున్నారు. మహిళల్లో చైతన్యం కోసం సదస్సులు నిర్వహించాం. విజ్ఞానయాత్ర ద్వారా హైదరాబాద్ తిప్పించాం. గూడెంలో రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షలతో మినరల్ ప్లాంట్ కొనుగోలు చేశాం. త్వరలోనే దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. పురుషులకు ఇటుకల తయారీకి సంబంధించి మిషనరీ ఇప్పించాలని నిర్ణయించా. ఎంపీ కవిత సహకారంతో జగన్నాథ్పూర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తా. -
జగన్నాథపూర్‌లో చైన్ స్నాచింగ్
ఎల్కదుర్తి (కరీంనగర్ జిల్లా) : ఎల్కదుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం బంగారు గొలుసు చోరీ జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న చల్లూరి మనోహర(60) అనే వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. పుస్తెల తాడు రెండున్నర తులాలు ఉంటుందని, ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.