Jabali
-
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
జాబాలి జ్ఞానోదయం
పురానీతి పూర్వం జాబాలి అనే మహాముని ఉండేవాడు. నిష్ఠగా తపస్సు చేసుకునేవాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా తపస్సు సాగిస్తుండటంతో, జడలు కట్టిన ఆయన తలపై పిచుకల జంట గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకుని, పిల్లాపాపలతో నిశ్చింతగా ఉండసాగాయి. భూతదయా సంపన్నుడైన జాబాలి వాటిని తరిమివేయకుండా, అలాగే తలపై ఉండనిచ్చాడు. తలపై గూడు పెట్టుకున్న పక్షులను తాను అలా ఉండనిచ్చినందునే అవి హాయిగా ఉండగలుగుతున్నాయని, లోకంలో తన కంటే దయాళువు ఇంకెవరుంటారని భావించసాగాడు జాబాలి. జపతపాదుల కంటే తన తలపై గూడు పెట్టుకున్న పక్షుల గురించే ఎక్కువగా ఆలోచించసాగాడు. తాను గనుక వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉన్నానంటూ గర్వించసాగాడు. రోజు రోజుకూ జపతపాలపై అతడి శ్రద్ధ క్షీణించి, గర్వం పెరగసాగింది. జాబాలి గర్వానికి సమాధానంగా ఒక రోజు అశరీరవాణి ... ‘నాయనా! జాబాలి.. లోకంలో నువ్వొక్కడివే ధర్మపరాయణుడివని, దయాళువని నీకు నువ్వే అనుకోవడం సరికాదు. తులాధారుడనే వర్తకుడు నీ కంటే ఎక్కువ ధర్మపరుడు. అయితే, అతడు నీలా ఎన్నడూ గర్వించలేదు’ అని పలికింది. అశరీరవాణి పలుకులతో జాబాలికి అసూయ మొదలైంది. ‘ఎవరా తులాధారుడు..? నిత్యం జపతపాలు సాగించే నా కంటే ఘనత గలవాడా ఆ వర్తకుడు?’ అనే ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. తులాధారుడిని ఎలాగైనా చూసి తీరాలని, తనను మించిన ఘనత అతడిలో ఏముందో తెలుసుకోవాలని బయలుదేరాడు. తులాధారుడు ఉంటున్న గ్రామానికి వెళ్లాడు. తులాధారుడి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముంగిట ఏర్పాటు చేసుకున్న అంగడిలోనే వర్తకం చేసుకుంటూ బేరసారాల్లో తలమునకలైన తులాధారుడు కనిపించాడు. అతడిని చూసిన జాబాలి ‘ఈ మామూలు వర్తకుడు నా కంటే గొప్పవాడెలా అవుతాడు’ అని ఆలోచించసాగాడు. ఈలోగా బేరసారాలు ముగించుకున్న తులాధారుడు తన ముంగిట నిలుచున్న జాబాలిని గమనించాడు. ‘మహర్షీ! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. పిచుకలు తలపై గూడు పెట్టుకుని, పిల్లలతో కాపురం ఉంటున్నా, తపస్సు కొనసాగించిన దయాసాగరులు మీరు. మీ పాదధూళితో నా నివాసం పావనమైంది. దయచేయండి’ అంటూ ఆహ్వానించి, ఉచిత మర్యాదలు చేశాడు. తులాధారుడి మాటలకు జాబాలి నివ్వెరపోయాడు. ‘నా సంగతంతా నీకెలా తెలిసింది?’ అని ప్రశ్నించాడు. ‘మహర్షీ! నాకు దేనిమీదా మమకారం లేదు. ఎవరిమీదా రాగద్వేషాలు లేవు. ధర్మబద్ధంగా జీవించడం మాత్రమే తెలుసు. నా మనస్సు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది. అందుకే మీ ఘనతను తెలుసుకోగలిగాను’ అని బదులిచ్చాడు తులాధారుడు. ‘అయితే, నేను ధర్మమార్గంలో జీవించడం లేదంటావా? నేను సాగిస్తున్న జపతపాదులు ధర్మం కాదంటావా?’ కాస్త కోపంగా ప్రశ్నించాడు జాబాలి. ‘మునివరేణ్యా! మీకు తెలియనిదేముంది? అహంకారంతో చేసిన తపస్సును, ప్రతిఫలాపేక్షతో చేసిన యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్య తృప్తికి మించిన యజ్ఞం లేదు. దానివల్ల దేవతలతో పాటు మనమూ తృప్తి పొందుతాము’ అన్నాడు తులాధారుడు. ‘అయితే, నీ వర్తకం మానుకోవేం? నీది ధనాశ కాదా?’ అక్కసుగా అడిగాడు జాబాలి. ‘కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తగదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతే’ అని బదులిచ్చాడు తులాధారుడు. కావాలంటే ఇన్నాళ్లూ మీ తలపై ఆశ్రయం పొందిన పిచుకలను అడగండి అని అన్నాడు. వాటిని పిలిచాడు జాబాలి. వెంటనే అతడి తలపై ఉన్న పక్షులు రివ్వున పెకైగిరి ఆకాశమార్గాన నిలిచాయి. ‘మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞ మేరకు నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం వల్ల నీ తపస్సు నశించింది. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది’ అని చెప్పి అంతర్ధానమైపోయాయి. వాటి పలుకులతో జాబాలికి జ్ఞానోదయమైంది. ‘అనవసరంగా నీపై మత్సరం పెంచుకున్నాను. క్షమించు’ అని చెప్పి తులాధారుడి వద్ద సెలవు తీసుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి బయలుదేరాడు. -
రక్తం మరిగిన ‘జాబాలి’
మనిషికి దాహమేస్తే నీళ్లు తాగుతాడు, జాబాలికి దాహమేస్తే మనిషి నెత్తురు తాగుతుంది. ఆ భూతం చుట్టూ తిరిగే కథ - ‘జాబాలి’. జేఆర్ఈ గ్రూప్ బ్యానర్‌పై ఎం.అరుణ్, షర్మిష్ఠ, అనన్య త్యాగి ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి హేమరాజ్ దర్శకుడు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘80 శాతం అడవుల్లో, 20 శాతం సిటీలో చిత్రీకరించిన ఈ సినిమా ఇప్పుడొస్తున్న హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది’’ అని తెలిపారు. -
ఆసక్తికరంగా...
ఎం. అరుణ్, శర్మిష్ట, అనన్య త్యాగి కాంబినేషన్లో హేమరాజ్ దర్శకత్వంలో టి. జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలోని 80 నిమిషాల గ్రాఫిక్ వర్క్ పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకుంటుందని, ప్రస్తుతం వస్తున్న హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఓ ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు స్టూడెంట్స్ ఓ మందుకోసం కీకారణ్యంలోకి అడుగుపెడితే ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా తెరెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: గుణశేఖరన్. -
భయపెట్టే జాబాలి
‘‘అడవిలో హారర్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు సినిమా ఇది. గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’’ అని దర్శకుడు హేమరాజ్ చెప్పారు. ఎం.అరుణ్, షరిష్ట, అనన్య త్యాగి ముఖ్య తారలుగా జె.ఆర్.ఇ. గ్రూప్ పతాకంపై టి.జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు పీయన్ రామచంద్రరావు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని నిర్మాత ప్రసన్న కుమార్‌కి అందించారు. పీఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నా శిష్యుడు. సినిమా మేకింగ్‌పై విపరీతమైన ప్రేమానురాగాలు ఉన్నాయి తనకు. ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలి’’ అన్నారు. తమ సంస్థలో ఇది తొలి చిత్రమని, అందరికీ నచ్చుతుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు. -
మట్టి ముంతలో ప్రేతాత్మ
ఓ మందు కనుక్కొనే పనిమీద... ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలోకి ప్రవేశించారు. ఓ ఔషధ మొక్క వేళ్ల కోసం వారు నేలను తవ్వుతుండగా... ఓ మట్టిముంత బయటపడింది. దాని మూతను తెరవబోతున్న క్రమంలో... పొరపాటున అది పగిలి ముక్కలైంది. అంతే... అందులోని ఓ ప్రేతాత్మ హాహాకారాలు చేస్తూ బయటకొచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఇక ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న హారర్ చిత్రం ‘జాబాలి’. ఎం.అరుణ్, శర్మిష్ట, అనన్యత్యాగి ప్రధాన పాత్రధారులు. హేమరాజ్ దర్శకుడు. టి.జయచంద్ర నిర్మాత. 80 నిమిషాల గ్రాఫిక్స్ హైలైట్ అని నిర్మాత చెప్పారు. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ‘జాబాలి’ ఉంటుందని దర్శకుడు తెలిపారు.


