రాముడికి జాబాలి ఉద్బోధ | Jabali exhortation to Lord Rama | Sakshi
Sakshi News home page

రాముడికి జాబాలి ఉద్బోధ

Mar 22 2026 12:16 AM | Updated on Mar 22 2026 12:52 AM

Jabali exhortation to Lord Rama

పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. 

భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.

‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. 

మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. 

నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.

‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.

రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.

రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సీతమ్మవారి కోవెల
శ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్‌ కోవిల్‌’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.

→ సాంఖ్యాయన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement