breaking news
IT-based Center
-
వైట్ కాలర్ ఉద్యోగాలు పెరిగాయ్..!
ముంబై: దేశీయంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) ఏప్రిల్‌లో పెరిగాయి. గతేడాది ఇదే నెల నియామకాలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత రంగాలు (ఐటీఈఎస్) / బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ), రియల్ ఎస్టేట్ రంగాలు హైరింగ్‌లో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. ‘‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం 6 శాతం వార్షిక వృద్ధితో, నియామకాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ రంగాలు నియామకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది ఆయా రంగాల్లో ఉన్న మౌలిక డిమాండ్‌తో పాటు, పెరుగుతున్న వినియోగదారుల కార్యకలాపాలను సూచిస్తోంది. ఐటీ నియామకాలు నిలకడగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో మాత్రం కొంత మందగమనం కనిపిస్తోంది. మొత్తంగా, రంగాల వారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... భారత జాబ్ మార్కెట్ మాత్రం నిలకడగా ఉంది’’ అని నౌకరీడాట్‌కామ్ ఎండీ, సీఈవో హితేష్ ఒబెరాయ్ తెలిపారు. ‘నౌకరీ డాట్‌కామ్’ వెబ్సైట్లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా రూపొందించిన నెలవారీ నివేదిక ప్రకారం.... → బీమా రంగం 21 శాతం వృద్ధితో నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బీపీఓ/ఐటీఈఎస్ (15%), రియల్ ఎస్టేట్ (12%), హెల్త్‌కేర్ (11%), విద్యా రంగం (9%) నిలిచాయి. టెలికామ్, బ్యాంకింగ్ రంగాల నియామకాల్లో వరుసగా నాలుగో నెలా క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ఇవి వరుసగా 11%, 10 శాతం తగ్గాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) హైరింగ్ 4% తగ్గడం గమనార్హం. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల నియాకాల్లో పెద్దగా మార్పు లేదు. దక్షిణాదిలోనే అధికం: వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో దక్షిణాది మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్ 12 శాతం వృద్ధితో టాప్‌లో ఉండగా, బెంగళూరు (7 శాతం), చెన్నై (6 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (3 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా (1 శాతం) దాదాపు స్థిరంగా ఉంది. అయితే, ప్రధాన మెట్రో నగరం ముంబైలో హైరింగ్ 3% తగ్గింది. → మెట్రోలే కాకుండా, అభివృద్ధి చెందుతున్న నగరాలు జైపూర్ (12%), కోయంబత్తూరు (11%), అహ్మదాబాద్(7%) సైతం నియామాల్లో బలమైన వృద్ధిని కనబరిచాయి. వైట్‌కాలర్ హైరింగ్ సంస్కృతి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది. -
కాకినాడ సెజ్‌లో తొలి వాణిజ్య కేంద్రం షురూ
టాటా-జీఎంఆర్ భాగస్వామ్యంలో రూరల్ బీపీఓ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ సెజ్‌లో తొలి కమర్షియల్ సెంటర్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలో జీఎంఆర్, దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఈ ఐటీ ఆధారిత సెంటర్లో ఆధార్‌కార్డుల తయారీ పనులు జరగనున్నాయి. జీఎంఆర్ ప్రెసిడెంట్ ప్రసన్న చల్లా, టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనివాస్ కొప్పోలు సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. రూరల్ బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్)లో కాకినాడ సెజ్ నిర్వాసిత కుటుంబాలకు చెందిన శిక్షణ ఇచ్చిన 20 మంది యువకులకు చల్లా, కొప్పోలు ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ మెట్రో, టైర్-2 నగరాల్లో బలీయంగా ఉన్న బీపీఓ పరిశ్రమను, ప్రతిభావంతమైన మానవ వనరులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలనేదే లక్ష్యమన్నారు. టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ యువత నగర యువత కంటే ఎంత మాత్రం తక్కువ కాదనే విషయాన్ని నిరూపించిందన్నారు. కాకినాడ సెజ్‌లో మొదటి దశ పనులు ప్రారంభించామని, దీనిలో భాగంగా మెరైన్ ఫుడ్స్ ప్రాసెసింగ్, బొమ్మల పరిశ్రమలు వచ్చే మూడు, ఆరు నెలల్లో రానున్నాయని ప్రసన్న చెప్పారు. ఏడాదిలో ఈ పరిశ్రమల ద్వారా రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీబీఎస్ఎస్ఎల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ బీపీఓ వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్త్తుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి బీపీఓ కార్యకలాపాలు నిర్వహిస్త్తుందన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ పోతుకూచి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ డెరైక్టర్ మీరా రఘునాథన్, కాకినాడ సెజ్ ప్రాజెక్టు హెడ్ బీహెచ్ఏ రామరాజు తదితరులు పాల్గొన్నారు.


