వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు పెరిగాయ్‌..! | White-collar hiring in India up 6percent in April amid boost from AI | Sakshi
Sakshi News home page

వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు పెరిగాయ్‌..!

May 3 2026 5:25 AM | Updated on May 3 2026 5:25 AM

White-collar hiring in India up 6percent in April amid boost from AI

ఏప్రిల్‌లో 6% నియామకాల వృద్ధి 

బీమా రంగంలో అధిక హైరింగ్‌  

దక్షిణాది నగరాల దూకుడు 

అగ్రస్థానంలో హైదరాబాద్‌ 

నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి

ముంబై: దేశీయంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్‌ కాలర్‌) ఏప్రిల్‌లో పెరిగాయి. గతేడాది ఇదే నెల నియామకాలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత రంగాలు (ఐటీఈఎస్‌) / బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ), రియల్‌ ఎస్టేట్‌ రంగాలు హైరింగ్‌లో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. ‘‘నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం 6 శాతం వార్షిక వృద్ధితో, నియామకాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇన్సూరెన్స్, రియల్‌ ఎస్టేట్, హెల్త్‌కేర్‌ రంగాలు నియామకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

ఇది ఆయా రంగాల్లో ఉన్న మౌలిక డిమాండ్‌తో పాటు, పెరుగుతున్న వినియోగదారుల కార్యకలాపాలను సూచిస్తోంది. ఐటీ నియామకాలు నిలకడగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మాత్రం కొంత మందగమనం కనిపిస్తోంది. మొత్తంగా, రంగాల వారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... భారత జాబ్‌ మార్కెట్‌ మాత్రం నిలకడగా ఉంది’’ అని నౌకరీడాట్‌కామ్‌ ఎండీ, సీఈవో హితేష్‌ ఒబెరాయ్‌ తెలిపారు. ‘నౌకరీ డాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా రూపొందించిన నెలవారీ నివేదిక ప్రకారం....  

→ బీమా రంగం 21 శాతం వృద్ధితో నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బీపీఓ/ఐటీఈఎస్‌ (15%), రియల్‌ ఎస్టేట్‌ (12%), హెల్త్‌కేర్‌ (11%), విద్యా రంగం (9%) నిలిచాయి. టెలికామ్, బ్యాంకింగ్‌ రంగాల నియామకాల్లో వరుసగా నాలుగో నెలా క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ఇవి వరుసగా 11%, 10 శాతం తగ్గాయి. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) హైరింగ్‌ 4% తగ్గడం గమనార్హం. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల నియాకాల్లో పెద్దగా మార్పు లేదు.  

దక్షిణాదిలోనే అధికం: వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాల్లో దక్షిణాది మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్‌ 12 శాతం వృద్ధితో టాప్‌లో ఉండగా, బెంగళూరు (7 శాతం), చెన్నై (6 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ (3 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా (1 శాతం) దాదాపు స్థిరంగా ఉంది. అయితే, ప్రధాన మెట్రో నగరం ముంబైలో హైరింగ్‌ 3% తగ్గింది. 

→ మెట్రోలే కాకుండా, అభివృద్ధి చెందుతున్న నగరాలు జైపూర్‌ (12%), కోయంబత్తూరు (11%), అహ్మదాబాద్‌(7%) సైతం నియామాల్లో బలమైన వృద్ధిని కనబరిచాయి. వైట్‌కాలర్‌ హైరింగ్‌ సంస్కృతి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement