ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అవసరం:జస్టిస్ కృష్ణయ్యర్
ఎర్నాకుళం: సమాజ అభివృద్ధి కోసం ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అత్యవసరమని ఇస్కఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ అన్నారు. కేరళలోని ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంస్థ(ఇస్కఫ్) వెబ్సైట్ iscuf.inను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల మధ్య స్నేహ, సాంస్కృతిక సంబంధాలు పెంపొందించేందుకు ఇస్కఫ్ కృషి చేయాలని కోరారు. మన రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిస్ట్, ప్రజాతంత్ర భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపు ఇచ్చారు.
ఇస్కఫ్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభ్యుల ఫోరం ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరాజు మాట్లాడుతూ దేశం గర్వించదగిన న్యాయకోవిధుడు, అభ్యుదయవాది జస్టిస్ కృష్ణయ్యర్ వెబ్సైట్ను ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ పురోభివృద్ధికి ఆయన విలువైన సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. శాంతి, స్నేహ ఉద్యమాలకు పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణయ్యర్ సూచించినట్లుగా వివిధ రాష్ట్రాలు, ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకు ఇస్కఫ్ సాంస్కృతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2015-16లో ఇస్కఫ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు దేశమంతటా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి సెబాస్టియన్, ఇస్కఫ్ కేరళ రాష్ట్ర సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోమలిన్, నారాయణన్, ఆంధ్రప్రదేశ్ ఇస్కఫ్ రాష్ట్ర సమితి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు టిఎస్ సుకుమార్, కాగితాల రాజశేఖర్, తమిళనాడు ఇస్కఫ్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ ప్రసంగించారు. కేరళకు చెందిన పలువురు నేతలతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ఇస్కఫ్ ప్రతినిధులు హాజరయ్యారు.