breaking news
Irrigation security
-
కందకాల తవ్వకంతో చేను కిందే చెరువు
♦ రూ.4 వేల కోట్లతో ప్రతి ఎకరానికీ సాగునీటి భద్రత.. ♦ ఏడాదిలో తెలంగాణ భూముల్లో తవ్వకం పూర్తవుతుంది ♦ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక ♦ నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి ♦ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల, ♦ దేవరకొండల్లో అవగాహన సదస్సులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తరఫున ఆ ప్రయత్నం చేయాల్సిందే. కానీ, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు దశాబ్దాలకాలం పట్టవచ్చు. అప్పటివరకు కురిసిన వర్షపునీరు భూగర్భంలో ఇంకిపోకుండా వృథా కావడం వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే ఏడాదిలో రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి, కందకాలు తవ్విస్తే.. కురిసే ప్రతి చినుకునూ సద్వినియోగం చేసుకుని భూగర్భ జలంగా మార్చుకోవచ్చు..’ అని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సం గెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంపస్రాద్రెడ్డి అన్నారు. ఈ నిధులను ఏకకాలంలో వెచ్చిం చడం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరం భూమిలో కందకాలను తవ్వించవచ్చని, తద్వారా ప్రతి వర్షపు బొట్టును భూమిలోకి ఇంకేలా చేయవచ్చని అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల, దేవరకొండల్లో ‘సాక్షి’, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో కందకాల తవ్వకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కందకాలు తవ్వుకోవడం ద్వారా ‘మన చేను కిందే.. చెరువు’ను ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ కందకాల్లోకి వచ్చిన నీరు భూగర్భంలోకి వెళ్లి ఎంతటి కరువు కాటకాల్లో అయి నా చేనుకు ఉపయోగపడేంతటి నీటిని అంది స్తాయని చెప్పారు. కందకాలను తవ్వుకోవడం వల్ల ఎకరానికి 2 శాతం భూమి కంటే ఎక్కువ నష్టం జరగదని, ఖర్చు కూడా ఎకరానికి రూ. 2 వేల కంటే ఎక్కువ కాదన్నారు. భూమి రకాన్ని బట్టి, భూమి ఉన్న స్థితిని బట్టి పకడ్బందీగా కందకాలను తవ్వుకోవడం ద్వారా నీటిని భూమిలో దాచుకుని.. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని వాడుకున్నట్టు నీరు అవసరం అయినప్పుడల్లా తీసుకుని వాడుకోవచ్చన్నారు. కందకాలు తవ్వుకునే విధానాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. సదస్సులకు హాజరైన రైతాంగం అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు. సదస్సులకు హాజరైన రైతులు తాము కూడా కందకాలు తవ్వించుకుంటామని స్వచ్ఛందం గా ముందుకు రావడం గమనార్హం. కొందరు రైతులు తాము కందకాలు తవ్వుకున్నందున జరిగిన ప్రయోజనాల్ని కూడా వివరించారు. కార్యక్రమంలో‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, స్థానిక ప్రజా ప్రతిని ధులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
చేను కిందే చెరువును సృష్టిద్దాం!!
పొలంలోనే కందకాలు తీసి.. వాన నీటిని తాపుదాం! సాగునీటి భద్రత కోసం ‘సాక్షి’ మీడియా గ్రూప్, విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ప్రచారోద్యమం పంటలను బతికించుకోవడానికే కాదు.. గొడ్డూ గోదాను కాపాడుకోవడానికి.. చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికీ చుక్క నీరు దొరక్క అలో లక్ష్మణా అంటూ అన్నదాతలు అలమటిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉందో.. పరిష్కారం కూడా అక్కడే ఉంటుందంటారు పెద్దలు. కురిసే ప్రతి చినుకునూ ఒడిసి పట్టుకుంటే మనకు, జీవాలకు, పంటలక్కూడా శాశ్వతంగా నీటి కొరతన్న మాటే ఉండదంటున్నారు నిపుణులు. ఈ స్ఫూర్తిని అన్నదాతలందరి మనసుల్లో రగిలించి.. కార్యోన్ముఖులను చేయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సంయుక్తంగా ప్రచారోద్యమానికి శంఖం పూరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న కొన్ని జిల్లాల్లో వర్క్‌షాపులు వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించబోతున్నాం. గత ఏడాది వర్క్‌షాప్‌లలో పాల్గొన్న అనేకమంది రైతులు కందకాలు తవ్వుకుని లబ్దిపొందారు. ఈ ఏడాదీ మరికొందరు అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో తమ పొలాల్లో కందకాలు తవ్వుకుంటారని.. ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాం.. కాలం మారిపోయింది. వాతావరణంలో పెనుమార్పు వచ్చింది. కార్తెల ప్రకారం వాన దేవుడు కరుణించడం అనుమానాస్పదంగా మారింది. స్థిమితంగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గింది. కుండపోత వర్షాల సంఖ్య పెరిగింది. ఉన్నట్టుండి విరుచుకుపడే అకాల వర్షాల సంఖ్య పెరిగింది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ అస్తవ్యస్థ పరిస్థితి వల్ల భూమిలోకి ఇంకే వాన నీటి శాతం తగ్గిపోయింది. అంటే.. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా ఆ వరద నీటిని సాధ్యమైనంత ఎక్కువగా భూమిలోకి ఇంకింప జేసుకోవడమే సర్వోత్తమం. ఇదే కరువుపై మనం చేసే పోరాటం. అందుకనే పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. కందకాలు తవ్వుకోవాలి. ఈ కందకాల లోతు అడుగో, అడుగున్నరో ఉంటే వరద నీటిని ఒడిసిపట్టలేం. కాబట్టి, కందకాల లోతు మీటరుండాలి. వెడల్పు కూడా మీటరుండాలి. పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత 5 మీటర్లు వదిలి.. అదే వరుసలో మరో కందకం తవ్వాలి. ఈ విధంగా వాన నీటిని కందకాల ద్వారా పొలం కిందే నిల్వ చేసుకోవాలి. చేను కిందే చెరువును సృష్టించుకొని సాగు నీటి భద్రతను కల్పించుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. చుక్క నీరు లేక పంట ఎండిపోయే దుర్భర నీటి దారిద్య్రాన్ని పారదోలడానికి ఇదే చక్కని దారి. చేను కిందే చెరువును సృష్టించుకోవాలంటే.. వర్షాలకు ముందే పొలంలో లోతైన కందకాలు తవ్వుకోవాలి. ఏయే పొలాల్లో కందకాలు తవ్వేదెలా? సమతల కందకాలు: పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల (ఒకే లెవల్) కందకాలను తవ్వుకోవాలి. కందకం పొడవు 25 మీటర్లుండాలి. తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి మరో కందకం తవ్వాలి. కందకంలో తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా లోతట్టు వైపున పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వాన నీరు పొర్లిపోకుండా ఉంటుంది. ఎర్రనేలలు: ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కానేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ ఎర్ర చల్కా చేను ఏటవాలుగా కాకుండా సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్లరేగడి నేలలు: ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పొలాల్లో కందకాలతోనే సాగునీటి భద్రత వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నదులపై ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంటాయి. అయితే, పాలకులు తలపెట్టిన ఒక ప్రాజెక్టు పూర్తయి, నీరు అందుబాటులోకి రావాలంటే చాలా సంవత్సరాలే గడచిపోతాయి. కాబట్టి, అన్ని ప్రాంతాల రైతులూ వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను ఒడిసిపట్టుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి. పొలంలో కందకాలు తవ్వుకొని ఈ సీజన్లోనే తమ పంటలకు సాగు నీటి భద్రత కల్పించుకోవచ్చు. చిన్నపాటి వర్షాలు కురిసినప్పుడు పొలంలో నుంచి వర్షపు నీరు పెద్దగా బయటకు పోదు. కానీ, భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా నీరు బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే, మీటరు లోతు, మీటరు వెడల్పున లోతైన కందకాలు తవ్వుకుంటే భారీ వర్షం కురిసినప్పుడు వరద నీటిని సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. ఖర్చు ఎకరానికి రూ. 2 వేలకు మించదు. రైతన్నలారా.. కదలండి..! - సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల వేదిక.


