breaking news
International Shooting
-
భారత్ ఖాతాలో కాంస్యం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే కాంస్యంతో బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాలతో కూడిన జట్టు మహిళల 25 మీటర్ల జూనియర్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత బృందం 17–1తో జర్మనీపై గెలిచింది. ముందుగా క్వాలిఫికేషన్లో 856 పాయింట్లతో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో 437 పాయింట్ల స్కోరు చేసిన భారత త్రయం జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు కాంస్యం కోసం తలపడగా భారత్ విజయం సాధించింది. -
రిజ్వీ గురి అదిరె...
అంతర్జాతీయ షూటింగ్ సీజన్ తొలి టోర్నమెంట్లో తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో మొదటిరోజు భారత షూటర్ల గురికి మూడు పతకాలు లభించాయి. కెరీర్లో తొలి ప్రపంచకప్ ఆడుతోన్న 23 ఏళ్ల ఉత్తరప్రదేశ్ షూటర్ షాజర్ రిజ్వీ ‘ప్రపంచ రికార్డు’ ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోగా... 18 ఏళ్ల బెంగాలీ అమ్మాయి మెహులీ ఘోష్ కాంస్య పతకం కైవసం చేసుకొని ఔరా అనిపించింది. స్టార్ షూటర్ జీతూ రాయ్ తన సత్తా చాటుతూ కాంస్యాన్ని దక్కించుకొని తన ఖాతాలో మరో అంతర్జాతీయ పతకాన్ని జమ చేసుకున్నాడు. గ్వాడలహారా (మెక్సికో): ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తొలి ప్రపంచకప్‌లోనే భారత యువ పిస్టల్ షూటర్ షాజర్ రిజ్వీ అద్వితీయ ప్రదర్శన చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో మీరట్‌కు చెందిన రిజ్వీ 242.3 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–239.7 పాయింట్లు) రజత పతకం సాధించాడు. మరో భారత షూటర్ ఓంప్రకాశ్ 198.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 33 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో క్రిస్టియన్ రీట్జ్ (588 పాయింట్లు) తొలి స్థానంలో నిలువగా... రిజ్వీ (579 పాయింట్లు), జీతూ రాయ్ (578 పాయింట్లు), ఓంప్రకాశ్ (576 పాయింట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను పొంది ఫైనల్‌కు చేరారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మెహులీ ఘోష్, అపూర్వీ చండేలా, అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు చేరారు. తొలి ప్రపంచ కప్ ఆడుతోన్న మెహులీ ఘోష్ 228.4 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. లారా జార్జెటా కొమన్ (రొమేనియా–251.5 పాయింట్లు) స్వర్ణం... జూ హాంగ్ (చైనా–251 పాయింట్లు) రజతం సాధించారు. గతేడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మెహులీ ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించి వెలుగులోకి వచ్చింది. భారత్‌కే చెందిన అంజుమ్ 208.6 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పొందగా... అపూర్వీ 144.1 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. -
మానవ్‌జిత్‌కు కాంస్యం
అకాపుల్కో (మెక్సికో): భారత అగ్రశ్రేణి షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ షాట్‌గన్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో మానవ్‌జిత్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఒకవేళ మానవ్‌జిత్ ఫైనల్‌కు చేరుకొని ఉంటే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించేవాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో మానవ్‌జిత్, జోవో అజెవెడో (పోర్చుగల్) 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ మూడు పాయింట్లు స్కోరు చేయగా... అజెవెడో రెండు పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఐఎస్ఎస్ఎఫ్ సభ్యుడిగా రణ్‌ధీర్
న్యూఢిల్లీ: భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. మ్యూనిచ్‌లో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో రణ్‌ధీర్‌కు 25 ఓట్లకు గాను 22 ఓట్లు పడ్డాయి. ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లో కూడా రణ్‌ధీర్ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మొత్తం 293 ఓట్లలో 145 ఓట్లు సాధించారు.