breaking news
information delay
-
పసిమొగ్గపై చిమ్మిన విషం
యువకుడి లైంగిక దాడి ఆలస్యంగా వెలుగుచూసిన వైనం తాడిపూడిలో దారుణ సంఘటన బడికి వెళ్లడం.. ఆటలాడుకోవడం మినహా ఆ బాలికకు అభంశుభం తెలియదు. కుటుంబ పోషణ కోసం ఆమె తండ్రి పొరుగు రాష్ట్రంలో కూలీ పనులకు వెళ్లిపోయాడు. తల్లి కూడా కూలీ పనులు పనులు చేస్తోంది. ఇంటి వద్ద పెద్దలు లేకపోవడంతో.. ఒంటరిగా ఉన్న ఆ బాలికపై ఓ మృగాడి కన్నుపడింది. మాయమాటలతో మభ్యపెట్టి ఆ అమాయకురాలికి నరకం చూపించాడు. వారం రోజుల తర్వాత ఆమె స్కూల్ టీచర్ గమనిస్తేనే కానీ.. ఈ దారుణ సంఘటన వెలుగులోకి రాలేదు. – తాడిపూడి(ఆత్రేయపురం) తాడిపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి పదేళ్ల వయసున్న కుమార్తె స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుటుంబ పోషణ కోసం ఆమె తండ్రి కొంతకాలం క్రితం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆమె తల్లి కూలీ పనులు చేస్తూ, బిడ్డను చూసుకుంటోంది. ఇలాఉండగా వారి పక్కనే 22 ఏళ్ల రేగుళ్ల సురేంద్ర అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆ బాలికపై సురేంద్ర చెడు దృష్టి పడింది. వారం రోజుల క్రితం ఆ బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో ఆ పాపకు మాయమాటలు చెప్పి, ఎవరూ లేనిచోటకు తీసుకువెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా వారం రోజుల తర్వాత, మంగళవారం పాఠశాలలో ఆ బాలిక బాధతో విలవిల్లాడడాన్ని స్కూలు టీచర్ గమనించారు. బాలికను ఆరాతీయగా.. ఆ దారుణాన్ని వివరించింది. ఈ విషయాన్ని పాప తల్లికి ఆమె వివరించింది. వైద్య పరీక్షల కోసం బాలికను రావులపాలెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆమెపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు బాధితురాలి తల్లి గురువారం ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. రావులపాలెం సీఐ పీవీ రమణ, ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ పాఠశాలకు చేరుకుని టీచర్‌ను, బాధితురాలి ఇంటి వద్ద స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ రమణ తెలిపారు. -
‘సమాచారం’ నై..
రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్‌లో అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్ మీడియా ప్రతినిధులను ఇబ్బంది పెడుతోంది. సమన్వయం చేసేవారు కరువవ్వడంతో ఎవరికివారే యమునాతీరే చందంగా వ్యవస్థ నడుస్తోంది. ప్రజలకు తెలియజేసేందుకు పత్రికా ప్రతినిధులకు ఇవ్వాల్సిన సమాచారం విషయంలో తమ బాధ్యత కాదని కొందరు.. తమ పనికాదని మరికొందరు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంతజరుగుతున్నా పరిస్థితిని గాడినపెట్టాల్సిన పెద్దలు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విజయవాడ : నూతన రాజధాని కేంద్రంలో ఏర్పాౖటెన రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కమిషనరేట్ అధికారులు, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వటానికి ఇటీవల అవుట్ సోర్సింగ్‌లో నియమితులైన సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి మధ్య కూడా పడటం లేదు. ఎవరికి వారు తమకు సంబంధం లేదని తప్పుకుంటున్నారు. దీంతో పత్రికా ప్రతినిధులకు కార్యక్రమాల వివరాలు మెసేజ్‌లు కూడా సక్రమంగా అందడంలేదు. ఎవరూ ఏ పని చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. బుధవారం టూరిజంపై మంత్రుల కమిటీ నిర్వహించిన సమాచారం, కాపు కార్పొరేషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అందించటంలో అధికారులు అలసత్వం వహించారు. ప్రతి రోజూ పత్రికలకు సమాచారం ఇవ్వటం, ఫొటోలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఫీడ్ పంపటం, పత్రికా ప్రకటనలు జారీలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీరందరినీ సమన్వయం చేసే నాథుడే లేకపోవటంతో మీడియా ప్రతినిధులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇన్‌కెమెరా మీటింగ్‌లలో స్పాట్ ఐటమ్స్ ఎవరూ పట్టించుకోవటం లేదు. మీడియాను లోపలకు అనుమతించకపోగా, సమాచారం ఇవ్వకపోవటం వల్ల పాత్రికేయులకు తిప్పలు తప్పడంలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు, సీఎం ప్రెస్మీట్లు, క్యాంపు కార్యాలయంలో జరిగే విషయాలను మెయిల్స్ ద్వారా ఆలస్యంగా ఇస్తున్నారు. స్థానికంగా ఉండే సమాచార అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కేవలం కలెక్టర్ పర్యటనలు, సమావేశాలకు పరిమితమవుతున్నారు. మంత్రులు, ఇతర వీఐపీల సమావేశాలు, ముఖ్యమైన ఇంటర్నల్ సమావేశాలకు సమాచార శాఖ అధికారులు ఎగనామం పెడుతున్నారు. సమాచారం అడుగుతుంటే ఎవరికి వారు తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. స్థానికంగా జరిగే సమావేశాల సమాచారం కూడా సక్రమంగా పంపటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఎవరికి వారే యమునాతీరే.. అవుట్‌సోర్సింగ్‌లో నియమించిన ఉద్యోగులు కూడా కొన్ని సమావేశాలకు సంబంధించి ప్రెస్నోట్లు వస్తాయని, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వస్తాయని, కొందరు డివిజన్, అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి వస్తాయని ఎవరికివారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ చివరకు సమాచారం ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మకాం ఉంటున్న సమాచార శాఖ కమిషనర్ వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి అధికారుల మధ్య సమన్వయం చేయాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.