breaking news
india shooters
-
దివ్యాంశ్, రమిత కొత్త ప్రపంచ రికార్డులు
డార్ట్మండ్ (జర్మనీ): ఇంటర్నేషనల్ సైసన్ స్టార్ట్ ఫర్ షూటర్స్ (ఐఎస్ఎఎస్) షూటింగ్ టోరీ్నలో భారత రైఫిల్ షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, రమితా జిందాల్ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో దివ్యాంశ్ 254.4 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచాడు. ఈ క్రమంలో 253.7 పాయింట్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో రమిత 254.1 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 254 పాయింట్లతో హాన్ జియాయు (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రమిత సవరించింది. -
బుల్లెట్ దిగింది...
చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్‌ను వదిలేసి రైఫిల్ ఎత్తిన సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్ షూటర్ ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించింది. పిస్టల్ ఈవెంట్లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ రెండు పతకాలతో భారత బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెయిలింగ్‌లో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్లో రోషిబినా దేవి ఫైనల్ చేరి... పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జోడీ సెమీఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్‌గా 22 పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 467 పాయింట్లతో బ్రిటన్ షూటర్ సియోనైడ్ మెకింటోష్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్ కౌర్ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో భారత్‌కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్ కియోంగ్‌యు జాంగ్ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది. పంజాబ్‌లోని ఫరీద్కోట్ ప్రాంతానికి చెందిన సిఫ్ట్ కౌర్ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్ షూటింగ్లో కొనసాగింది. అయితే షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్ కౌర్‌కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్‌లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్‌కు టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్ జీత్ సింగ్, గురుజోత్ సింగ్, అంగద్ వీర్‌సింగ్ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. -
మను భాకర్‌కు రెండు స్వర్ణాలు
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్ మనూ భాకర్ రెండు పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో శనివారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. టీమ్ ఈవెంట్లో ఆమెతో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్, అభింద్య అశోక్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది. -
హీనా సిద్ధూకు స్వర్ణం
కువైట్ సిటీ: వరుసగా రెండో రోజు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల గురి అదిరింది. సోమవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో 400 పాయింట్లకు 386 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానం పొందిన హీనా... ఫైనల్లో 200.3 పాయింట్లతో విజేతగా నిలిచింది. వూ చియా యింగ్ (చైనీస్ తైపీ-198.3 పాయింట్లు) రజతం... అల్ బాలూషీ వధా (ఒమన్-177.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనా సిద్ధూ, శ్వేతా చౌదరీ, హర్వీన్‌లతో కూడిన భారత బృందం 1138 పాయింట్లతో టీమ్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చెయిన్ సింగ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 619.6 పాయింట్లు స్కోరు చేసిన చెయిన్ సింగ్... ఫైనల్లో 206 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, రవి కుమార్, రఘునాథ్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు చేరాయి.