breaking news
India-Pakistan series
-
‘భారత్‌లోను మమ్మల్ని ఆరాధిస్తారు’
న్యూఢిల్లీ : భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. ఇక ఈ దాయాదీ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే యాషెస్ సిరీస్ కన్నా ఎక్కువ ఉత్కంఠ. ఇరు దేశాల పోరులో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న క్రికెటర్లు ఉన్నారు. అదే కోవకు చెందిన పాక్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఇదే విషయంపై స్పందించాడు. ‘సరిహద్దుల సమస్యలతో ఇరు దేశాల క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌లో లభించే గొప్ప అనుభవాన్ని కోల్పోతున్నారు. యాషెస్ సిరీస్‌తో సమానంగా జరిగే గొప్ప సిరీస్‌కు దూరమవుతున్నారు. అంతేకాకుండా రాత్రికి రాత్రే హీరో అయ్యే అవకాశాలు కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కోల్పోతున్నారు. భారత్‌లో పాక్ క్రికెటర్లను సైతం ఆరాధిస్తారు. ఇలా నేను భారత అభిమానుల ప్రేమను చాల అందుకున్నాను. మరో సారి పాక్ క్రికెటర్లు ఇలాంటి ప్రేమను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలతో క్రీడా సంబంధాలు దెబ్బతీనడం విచారకరమైన విషయం. ఇరు జట్ల క్రికెట్ బోర్డులు చొరువ తీసుకొని ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా కృషి చేయాలని’ అక్తర్ అభిప్రాయపడ్డారు. 1999 ఏషియన్ టెస్ట్ చాంపియన్ షిప్లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అప్పటి భారత ఆటగాళ్లైన రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్లను తన వేగమైన బంతులతో పెలిలియన్ చేర్చి రాత్రికి రాత్రే అక్తర్ హీరో అయ్యాడు. ఇక 2007 నుంచి భారత్-పాక్ మధ్య క్రీడా సంబందాలు దెబ్బతిన్నాయి. 2012లో ఓ చిన్న సిరీస్ మినహా ఈ దాయదీ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలబడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాద చర్యలు ఆపేంత వరకు పాక్ క్రీడా సంబందాలు ఉండయని భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. -
పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి
భారత్, పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ సిరీస్ జరగాలనే నేను కోరుకుంటాను. అయితే నిర్ణయం తీసుకోవడంలో అనేక ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది’ అని గంగూలీ అన్నారు. ఆటకు వయసుతో సంబంధం లేదని యువరాజ్, నెహ్రాలు జట్టులోకి రావడం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. -
క్రికెట్‌తో రాజకీయాలు ముడిపెట్టవద్దు
కోల్‌కతా: రాజకీయాలతో సంబంధం లేకుండా క్రికెట్ కొనసాగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మరణించిన జగ్మోహన్ దాల్మియా కుటుంబీకులకు సానుభూతి తెలిపేందుకు ఖాన్ కోల్‌కతాకు వచ్చారు. ‘ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. రాజకీయాలతో క్రీడలను ముడిపెట్టడం తగదు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో భారత్‌తో సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నాను. మా ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అలాగే ఈ సిరీస్ జరుగకపోతే ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌ను బాయ్‌కాట్ చేస్తామని నేను అనలేదు’ అని ఖాన్ తెలిపారు. మరోవైపు ఈసిరీస్ విషయమై దుబాయ్‌లో వచ్చే నెల జరిగే ఐసీసీ సమావేశాల సందర్భంగా చర్చిద్దామని బీసీసీఐ.. పీసీబీకి లేఖ రాసింది.