breaking news
ibuprofen
-
నొప్పి నివారిణితో డిప్రెషన్‌కు చెక్!
సాదాసీదా నొప్పి నివారిణితో డిప్రెషన్‌కు చెక్ పెట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు కొందరు డిప్రెషన్ రోగులకు ప్రయోగాత్మకంగా నొప్పి నివారిణి ఔషధమైన ‘ఇబుప్రొఫెన్’ ఇచ్చి చూశారు. ఆశ్చర్యకరంగా వారిలో యాంటీ డిప్రెసెంట్లకు కూడా తగ్గని డిప్రెషన్ లక్షణాలు ఇబుప్రొఫెన్ వాడటంతో తగ్గుముఖం పట్టాయి. మెదడులో ఏర్పడే చిన్నవాపు వల్ల కొందరిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని, అలాంటి పరిస్థితిలో మామూలు యాంటీ డిప్రెసెంట్లు వాడటం వల్ల పెద్దగా ఫలితం ఉండదని కింగ్స్ కాలేజీకి చెందిన బయలాజికల్ సైకియాట్రీ ప్రొఫెసర్ కార్మైన్ పారియాంటె చెబుతున్నారు. మెదడులో వాపు వల్ల డిప్రెషన్‌కు గురయ్యే వారికి ఇబుప్రొఫెన్ ఇచ్చినట్లయితే, వాపు తగ్గడమే కాకుండా డిప్రెషన్ లక్షణాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన వివరిస్తున్నారు. అల్జిమర్స్ వంటి క్రానిక్ వ్యాధుల్లో వాపులు కూడా సాధారణ లక్షణమేనని, అలాంటి వారికి ఇతర ఔషధాలతో పాటు ఇబుప్రొఫెన్ ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు. -
బ్రూఫిన్‌తో కార్డియాక్ అరెస్టు ముప్పు!
నొప్పి నివారణకు మన దేశంతో పాటు చాలా దేశాల్లో ఉపయోగించే మందు.. ఇబూప్రోఫెన్. దీన్ని ఎక్కువగా బ్రూఫిన్ అనే పేరుతో అమ్ముతుంటారు. ఏవైనా గాయాలు తగిలినప్పుడు కలిగే నొప్పులను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అయితే.. ఈ మందును ఎక్కువగా వాడటం వల్ల కార్డియాక్ అరెస్టు ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వైద్యుల సలహా లేకుండా, తమంతట తామే (ఓవర్ ద కౌంటర్) ఈ మందులను కొనుక్కుని వాడుకునేవారిలో కార్డియాక్ అరెస్టు ముప్పు 31 శాతం అధికంగా ఉందని డెన్మార్క్ పరిశోధకులు చెప్పారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఇబూప్రోఫెన్ మాత్రమే కాదు.. డైక్లోఫెనాక్ వల్ల కూడా ఈ తరహా ముప్పు 50 శాతం పెరుగుతుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌కు చెందిన ప్రొఫెసర్ గున్నర్ గిస్లాసన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఇబూప్రోఫెన్తో పాటు ఇతర నొప్పి నివారణ మందుల అమ్మకాలను నియంత్రించాలని ఆయన సూచించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని వాడటం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన తెలిపారు. అలాగని నొప్పి నివారణ మందులన్నీ ప్రమాదకరం అనుకోనక్కర్లేదని.. ఎక్కువగా ఉపయోగించే ఇబూప్రోఫెన్, డైక్లోఫెనాక్‌ల వల్ల మాత్రం కార్డియాక్ అరెస్టు ముప్పు బాగా పెరుగుతుందని వివరించారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో గత సెప్టెంబర్ నెలలో ప్రచురితమైన ఓ వ్యాసంలో కూడా వీటివల్ల గుండెకు ప్రమాదమని చెప్పారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఇబూప్రోఫెన్, ఇతర నొప్పి నివారణ మందులను సొంతంగా వాడొద్దని గిస్లాసన్ సూచించారు. గుండెకవాటాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు, అవి వచ్చే ముప్పు ఉన్నవాళ్లు కూడా ఈ మందులు వేసుకోకపోవడమే మంచిదన్నారు. ఈ మందులను ఎవరు పడితే వారు అమ్మడం సరికాదని, వైద్యులు కూడా ఆచితూచి ఇవ్వాలని అన్నారు. డెన్మార్క్‌లో 2001 నుంచి 2010 వరకు కార్డియాక్ అరెస్టుతో బాధపడిన దాదాపు 29వేల మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఇబూప్రోఫెన్ను రోజుకు 1200 మిల్లీగ్రాములకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని గిస్లాసన్ చెప్పారు.