breaking news
hydernagar
-
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. -
సెప్టెంబర్ 7కు హైదర్‌నగర్ భూముల కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : హైదర్‌నగర్ భూములకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. హైదర్‌నగర్ సర్వే నంబర్ 172లోని 98 ఎకరాల భూమి తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషన్లో లోపాలుంటే సరిచేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్, ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. -
గోల్డ్‌స్టోన్‌కు గట్టిదెబ్బ
సాక్షి, హైదరాబాద్: పెను సంచలనం సృష్టించిన వేల కోట్ల విలువైన హైదర్‌నగర్ గ్రామంలోని 196 ఎకరాల భూముల స్కాం కేసులో గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు ఇతరులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్ స్టోన్ ఎక్స్‌పోర్ట్స్, మరో 16 మంది దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లు, అనుబంధ పిటిషన్లు అన్నింటినీ కొట్టేస్తూ ఇటీవల కీలకతీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో 60 ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అత్యంత విలువైన ఈ భూముల వివాదానికి తెరపడింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్ 172 సహా అప్పీల్ పిటిషన్లల్లో పేర్కొన్న భూములు జాగీర్ భూములేనని స్పష్టం చేసింది. నిజాం కాలంలో 1948కి పూర్వమే వాటిని ఈనాం ఇచ్చారని పేర్కొంది. సర్వే నంబర్ 172తో సహా ఈ భూములపై పిటిష నర్లు ఖుర్షీద్ జా పైగా.. మాతృక ఆస్తి నుంచి ప్రాథమిక డిక్రీ ద్వారా భూములపై హక్కులు పొందినట్లుగా గోల్డ్‌స్టోన్ కంపెనీ ఇతరులు రుజువు చేసుకోలేకపోయారని తేల్చింది. ఖుర్షీద్ జా పైగాకు చెందిన భూముల్లో కొన్నింటిని రుకియా బేగం, వారిస్ అలీ, ఘనీ షరీఫ్, బొడ్డు వీరస్వామి ఇతరులు 1948కి ముందే నిజాం కాలంలోనే సాగు చేసుకున్నారని, భూముల్ని సాగు చేసినట్లుగా పట్టాలు ఉన్నాయంది. వారి నుంచి కొనుగోలు చేసిన వారికే భూములపై హక్కులు ఉంటాయని.. ఖాసిం నవాజ్, సైరస్ ఇన్వెస్ట్మెంట్ల నుంచి కొనుగోలు చేసిన వారికి ఏ హక్కులు ఉండవని తెలిపింది. నిజాం స్టేట్ భారత్‌లో విలీనం కాకముందే రైతులకు భూములపై హక్కులు సంక్రమించా యని, హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్, 1358 ఫసలీ (1947) రాక ముందే వారికి సాగు నిమిత్తం పట్టాలు ఉన్నందున ఇవి ప్రభుత్వ భూములు కావని పేర్కొంది. ఆ డిక్రీ చెల్లదు..: ఈ భూముల విషయంలో కోర్టును తప్పు దారి పట్టించి 1963, జూన్ 28న కింది కోర్టు నుంచి పొందిన డిక్రీ చెల్లదని తేల్చింది. 1996 బెయిలీఫ్ నివేదిక ఆధారంగా సర్వే నంబర్ 172లోని భూమిని ప్రతివాదుల నుంచి స్వాధీనం చేసుకోవడం చెల్లదని, ఆ భూమిని తక్షణమే ప్రతివాదులకు అప్పగించాలని ఆదేశించింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్ 172లో 98 ఎకరాల 10 కుంటల భూమి విషయంలో 1998లో తుది డీక్రీ ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. ఇదే వివాదంపై రంగారెడ్డి జిల్లా కోర్టు 1996లో జారీ చేసిన ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ వారెంట్లు, బెయిలీఫ్ చట్ట వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. 2004లో హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. -
హైదర్‌నగర్ ఎస్బీఐలో చోరీ యత్నం
హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ ఎస్బీఐ బ్యాంక్ చోరీకి దొంగలు యత్నించారు. బ్యాంకు తాళాలు పగులగొట్టి మంగళవారం రాత్రి లోపలికి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. లాకర్లు తెరుచుకోకపోవడంతో దొంగలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చిన సిబ్బంది బ్యాంకు గేట్లు తెరిచి ఉండడం చూసి షాకయ్యారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు వద్దకు చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.