breaking news
Housing AE
-
కూలీ నుంచి కోటీశ్వరుడు!
కర్నూలు: ఖరీదైన భవనాలు, భూములు, డిపాజిట్లు, బ్యాంకుల్లో నగదు, భారీ మొత్తంలో అప్పుల పత్రాలు, కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు.. ఇవీ గృహనిర్మాణ శాఖ కొత్తపల్లి మండల ఏఈగా పనిచేస్తున్న రంగస్వామి అక్రమార్జన. ఓ సాధారణ ఉద్యోగి ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఓసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కినప్పటికీ తీరు మారని రంగస్వామి మరింత రెచ్చిపోయాడు. ఈయన బారి నుంచి కాపాడాలని సామాన్య ప్రజానీకం ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టినా పట్టించుకున్న వారు లేరు. ఓ లబ్ధిదారునికి ఇంటి బిల్లు మంజూరు చేసేందుకుఏఈ రంగస్వామి రూ.7 వేలు లంచం తీసుకుంటూ గత నెల 15న ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఇతని అక్రమాస్తులపైనా పూర్తిస్థాయి విచారణ చేశారు. మంగళవారం ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి..భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల పట్టణానికి చెందిన వీఆర్వో జె.జె.బాబు ఆస్తులపై దాడులను మరువకముందే ఏసీబీ మరోసారి పంజా విసరడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కూలీ నుంచి కోటీశ్వరుడు! కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన రంగస్వామి ఉద్యోగం రాకముందు కుటుంబ సభ్యులతో కలసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గృహ నిర్మాణ శాఖలో సాధారణ ఉద్యోగిగా చేరి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు, సీఐలు ఖాదర్ బాషా, గౌతమి నేతృత్వంలో మంగళవారం కర్నూలు శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న విజయ నగర్ కాలనీలో రంగస్వామి నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణానగర్‌లోని రెండో కుమార్తె సులోచన, బేతంచర్లలోని మూడో కుమార్తె గాయత్రి, హైదరాబాద్ గచ్చిబౌలిలోని కుమారుడు లక్ష్మీనారాయణ ఇళ్లలో సీఐలు నాగభూషణం, తేజేశ్వరరావు, శ్రీధర్ నాయకత్వంలో తనిఖీలు చేపట్టారు. కోడుమూరులో రెండంతస్తుల భవనం, రెండు ఇంటి స్థలాలు, కర్నూలు విజయనగర్ కాలనీలో మూడంతస్తుల భవనం, ఇంటి స్థలం, పాములపాడు మండలం జూటూరులో 75 సెంట్ల వ్యవసాయ భూమి, 200 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, డస్టర్ కారు, రెండు మోటర్ సైకిళ్లు, రుణాల పత్రాలతో పాటు బ్యాంకు అకౌంట్లలో రూ.3 లక్షల నగదు, ఇన్సూరెన్స్ పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.కోటి ఉంటుందని, బహిరంగ మార్కెట్లో అయితే రూ.3 కోట్లకు పైమాటే అని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. రంగస్వామిని అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు. -
హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖాధికారులు(ఏసీబీ) మెరుపు దాడి చేశారు. రామభద్రపురం హౌసింగ్ డీఈ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నాయుడువలసలోని ఆయన ఇంటిపై అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయనగరం : విజయనగరం జిల్లా సాలూరు హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణుగోపాలనాయుడు నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. శుక్రవారం బొబ్బిలిలోని ఆయన నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వేణుగోపాలనాయుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. -
ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ
కోడూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా కోడూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈ.. లబ్దిదారుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. వివరాల ప్రకారం... పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన చిముటూరి శ్యాంసన్‌కు పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆఖరి విడత బిల్లు రూ.17,500 మేర రావాల్సి ఉంది. ఇందుకోసం స్థానిక హౌసింగ్ ఏఈ పి.గణేశ్వరరావు వద్దకు వెళ్లగా ఆయన రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో శ్యాంసన్ ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారిచ్చిన సూచనల మేరకు గురువారం సాయంత్రం శ్యాంసన్ హౌసింగ్ ఏఈ గణేశ్వరరావుకి రూ.10వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.