breaking news
HIV virus
-
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగింగచలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్‌హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్-ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్, హెచ్ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా. -
కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ప్రపంచానికి పరిచయమైందంటున్నారు ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్రహీత లక్ మాంటెగ్నియర్. అక్కడి ల్యాబ్‌లో ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ఈ వైరస్ ఉద్భవించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనాలో హెచ్ఐవీ జన్యుక్రమం ఉందని పేర్కొన్నారు. అంతేకాక మలేరియాలో ఉండే అతి సూక్ష్మజీవులు దీనిలోనూ ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇలాంటి వైరస్ల విషయంలో వూహాన్ ల్యాబ్‌కు ఎంతో నైపుణ్యముందని, 2000 సంవత్సరం నుంచే అది ప్రయోగాలు చేస్తుందన్నారు. ఇదిలావుంటే చైనాలోని అమెరికా ఎంబసీ అధికారులు వూహాన్ ల్యాబ్‌పై రెండేళ్ల కిందటే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రాణాంతక వైరస్‌లతో పాటు అంటు వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారని వారు గతంలోనే ప్రస్తావించినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. (అమెరికా విచారణకు చైనా నో!) ఇప్పటికే అందరి దృష్టి వూహాన్ ల్యాబ్‌పై పడింది. అది కావాలనే ఈ జీవాయుధాన్ని సృష్టించిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర ప్రముఖులు అది చైనాల పనే అని నిర్ధారణకు వస్తుండగా, అందుకుతగ్గ ఆధారాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాగా వైరాలజీ డాక్టర్ లక్ మాంటెగ్నియర్ హెచ్ఐవీలో పరిశోధనకుగానూ ఫ్రాంకోఇయన్ బర్రీ- సినోస్సీతో కలిసి 2008లో నోబెల్ అవార్డును అందుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి హెచ్ఐవీ వైరస్ కారణమవుతుందన్న విషయాన్ని వీరి నేతృత్వంలోని బృందం గుర్తించింది. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది?) -
ఎయిడ్స్ అంటించావ్.. క్షమించేది లేదు
లండన్ : తనకున్న సుఖవ్యాధిని కావాలనే పది మందికి అంటించిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. దయతో శిక్ష తగ్గించాలన్న అతగాడి విజ్ఞప్తిని కోర్టు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. ‘ఐదుగురి జీవితాలను నాశనం చేసిన నీకు బయటతిరిగే హక్కు లేదు’ అంటూ ఓ బ్రిటన్ కోర్టు.. జీవిత శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిగ్టోన్కు చెందిన డరైల్ రోవ్(27) ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్ డ్రెస్సర్. విలాసాలకు మరిగిన ఇతగాడికి 2015 లో ఎయిడ్స్ వ్యాధి సోకింది,(తల్లిదండ్రుల నుంచే సోకిందని అతని బంధువు ఒకరు చెప్పటం విశేషం). అయినప్పటికీ ఓ ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఐదుగురు పురుషులతో సంబంధాలను కొనసాగించాడు. వారితో రక్షణ లేకుండానే లైంగిక చర్యల్లో పాల్గొనటం.. తద్వారా వారికీ హెచ్ఐవీ సోకింది. డరైల్ చేష్టలు ఇక్కడితో ఆగలేదు. ‘నాకు ఎయిడ్స్ ఉందోచ్’ అంటూ సందేశాలు పెట్టాడు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతను పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల యత్నించారు. చివరకు వాస్తవాలు తేలటంతో నేరం అంగీకరించాడు. అతని శాడిజంపై బ్రిగ్టోన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎందరో యువకుల జీవితాలను రాక్షసంగా నువ్వు నాశనం చేశావ్. పైగా సురక్షిత శృంగారానికి వీలున్నా.. కావాలనే నిరాకరించావ్. నీలాంటి వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. జీవిత కాల శిక్షే సరైంది’ అని జడ్జి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. -
హెచ్ఐవీ భరతం పట్టే యాంటీబాడీ
సాక్షి, హైదరాబాద్: దాదాపు అన్ని రకాల వైరస్‌లను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఫార్మా కంపెనీ సనఫీ, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లు సంయుక్తంగా జరిపిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ప్రయోగాల్లో భాగంగా శాస్త్రవేత్తలు 24 కోతులను మూడు గుంపులుగా విడగొట్టారు. రెండు గుంపుల్లోని కోతులకు భిన్నమైన యాంటీబాడీలు ఇచ్చారు. చివరి గుంపునకు కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని అందించారు. 5 రోజుల తర్వాత అన్ని కోతులకు వేర్వేరు రకాల హెచ్ఐవీ వైరస్‌లను ఎక్కించారు. అయితే కొత్త యాంటీబాడీని అందుకున్న కోతుల్లో ఏ ఒక్కటి కూడా హెచ్ఐవీ బారిన పడలేదు. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకుని కొత్తదానిగా మారుతుండటం ఈ వ్యాధి చికిత్సను జటిలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వైరస్‌లను నిలువరించగల యాంటీబాడీ తయారు కావడం విశేషం. పరిశోధన వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
హెచ్ఐవీ సోకనివ్వని పిల్
వాషింగ్టన్: ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ నిరోధం దిశగా మరో ముందడుగు పడింది. అధ్యయనంలో భాగంగా ట్రువిడా అనే వ్యాధి నిరోధక మాత్ర(పీఆర్‌ఈపీ)ను రెండున్నరేళ్లపాటు తీసుకున్న 600 మందిలో ఎవరికీ ఆ వైరస్ సోకలేదు. వీరు సెక్సు పరంగా జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ, వీరిలో కొంత మంది పురుషులు స్వలింగ సంపర్కులైనప్పటికీ వైరస్ సోకకపోవడం గమనార్హం. అధ్యయనంతో తొలి దశలోనూ వీరు పూర్తి ఆరోగ్యవంతులు. శాన్ఫ్రాన్సిస్కోలోని కైజర్ పర్మనెంట్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పీఆర్ఈపీతో ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. హెచ్ఐవీ వైరస్ నిరోధానికి ఇది దోహదం చేసే అవకాశముందని అధ్యయనానికి నేతృత్వం వహించిన జొనాథన్ వోక్ చెప్పారు. అధ్యయన ఫలితాలను ‘క్లినికల్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్’ పత్రికలో ప్రచురించారు. -
హెచ్ఐవీ చాపకింది నీరులా... రక్షణ పొందడమిలా!
హెచ్ఐవీ వైరస్ రక్తం నుంచి వేరుచేస్తే చాలా త్వరగా చనిపోతుంది. నేరుగా హాని చేయదు. కానీ చాపకింది నీరులా ఎంతో హాని చేస్తుంది. అది మన రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. దాంతో అంతకు మునుపు మనం హాని చేయగలదని భావించని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే పెనుముప్పుగా తయారవుతాయి. మనకు సోకి కూడా ఏమీ చేయకుండా వాటంతట అవే తగ్గిపోయే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ, ఇతర సూక్ష్మజీవుల వల్ల సంక్రమించే జబ్బులూ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అంతకుమునుపు అస్సలు హాని చేయకుండా, హెచ్ఐవీ కారణంగా రోగనిరోధకశక్తి దెబ్బతినడం వల్ల ఇవి ముప్పుగా పరిణమిస్తాయి కాబట్టి వీటిని హెచ్ఐవీకి సంబంధించిన అవకాశవాద ఇన్ఫెక్షన్స్గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో వీటినే ‘ఆపర్చ్యయనిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెచ్ఐవీ’గా అభివర్ణిస్తారు. డిసెంబరు 1న ఎయిడ్స్ డే సందర్భంగా... హెచ్ఐవీని ఆసరా చేసుకుని విజృంభించే ఈ తరహా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, సాధారణ జీవితం గడపడం ఎలాగో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. హెచ్ఐవీ రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు సోకేదెప్పుడు...? మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా హెచ్ఐవీ సోకినవారు కూడా మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అయితే హెచ్ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బ తీస్తూపోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కణాల కౌంట్) ప్రతి మైక్రోలీటర్కూ 200 కంటే తగ్గితే (200 సెల్స్/మైక్రోఎల్) అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చూడవచ్చు. అందుకే అనేక వ్యాధుల్లాగే ఎయిడ్స్ పూర్తిగా తగ్గకపోయినా... ఈ రోజుల్లో ఎయిడ్స్ కూడా డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల్లాగే వైద్యంతో అదుపులో ఉండే వ్యాధి (మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్). సాటి వ్యక్తులంతా అపోహాలు తొలగించుకొని వీళ్ల పట్ల వివక్ష చూపకపోతే చాలు... ఈ రోగులు సైతం పూర్తి జీవితకాలం సాధారణంగానే బతకగలరు. ఎంతెంత కౌంట్‌కు... ఏయే తరహా జబ్బులకు చికిత్స... హెచ్ఐవీ సోకిన వారు ఎవరైనా వారి ‘టీ’సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉంటే వారి రోగనిరోధకశక్తి మామూలుగానే ఉంటుంది. అయితే అంతకంటే తగ్గితే మాత్రం ఏమేరకు కౌంట్ తగ్గిందో దాన్ని బట్టి సంక్రమించగల వ్యాధులకు తగిన నివారణచర్యలు / నివారణ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అది... * టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉంటే న్యూమోసిస్టిక్ నిమోనియా వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవాలి. టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తగ్గి... ఆ తర్వాత చేయించిన రక్తపరీక్షలో టాక్సోప్లాస్మా అనే ఏకకణజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్కు పాజిటివ్ అని తేలితే, ఆ సాంక్రమికవ్యాధి పెచ్చుమీరకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి. * టీ సెల్ కౌంట్ 50 /మైక్రోలీటర్ కంటే తగ్గితే మైకోబ్యాక్టీరియా ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ) అనే తరహా బ్యాక్టీరియల్ ఇన్షెక్షన్లను నివారించేందుకు అవసరమైన మందులు తీసుకోవాలి. వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇక్కడ పేర్కొన్న చాలా వ్యాక్సిన్ల వల్ల కొద్దిపాటి మంట/నొప్పి ఉంటుంది. అది కేవలం ఒక్క రోజులో తగ్గుతుంది. ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్లు... ప్రొఫిలాక్టిక్ చికిత్సలు హెచ్ఐవీ రోగిలో ‘టీ’ సెల్స్ తగ్గి, రకరకాల ఇన్ఫెక్షన్లు సోకేందుకు అవకాశం ఉందని నిర్దిష్టంగా తెలిసినప్పుడు, అవి రాకుండానే ముందుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే వ్యాధి రాకుండా తీసుకునే చికిత్సను ‘ప్రొఫిలాక్సిస్’ చికిత్స అంటారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు తగ్గిన కౌంటును అనుసరించి, ఆయా దశల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొఫిలాక్టిక్ చికిత్సలు తీసుకుంటే వారు సైతం నార్మల్‌గా ఉంటారు. ఈలోపు రోగనిరోధక శక్తి పెరిగే మందులూ వాడుతుంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్ తరహా ప్రొఫిలాక్టిక్ మందులను సీడీ4 సెల్ కౌంట్ మెరుగుపడే వరకూ వాడవచ్చు. హెచ్ఐవీ రోగులకు... వ్యాక్సిన్లు ఉపయోగపడతాయా? ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వ్యాధులను నివారించే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంది. ఇవి మామూలు వ్యక్తులకు ఎలాగూ ఉపయోగపడతాయి. అయితే హెచ్ఐవీ రోగులకూ ఇవి అదే తరహాలో ఉపయోగపడతాయా అనే సంశయం చాలా మందికి ఉంటుంది. సాధారణ ప్రజల్లో వ్యాధిని నివారించే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో... హెచ్ఐవీ రోగులకూ ఆయా వ్యాక్సిన్లు అదే తరహాలో ఉపయోగపడతాయి. నిజానికి మామూలు వ్యక్తుల కంటే హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ఇవి మరింత ఉపయోగకరం. అయితే హెచ్ఐవీ ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లే సురక్షితం. అంటే ఉదాహరణకు వ్యాక్సిన్ల తయారీ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా ఒక తరహా వ్యాక్సిన్ తయారీలో చనిపోయిన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ తరహా వ్యాక్సిన్‌ను ‘ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. ఇక మరికొన్ని రకాల వ్యాక్సిన్లలో జీవించి ఉన్న వైరసే అయినప్పటికీ బాగా బలహీనపరచినదాన్ని, నిష్క్రియతో ఉండేదాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహాగా రూపొందించిన వైరస్‌ను ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. సాధారణంగా ఎయిడ్స్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్ఐవీ ఉన్న రోగులకు చికెన్‌పాక్స్‌ను నివారించేందుకు లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్‌నూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ రోగులు ప్రయాణం చేయదలిస్తే...? హెచ్ఐవీ రోగులు ఒకవేళ ప్రయాణం చేయదలిస్తే, వారు ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో తమ డాక్టర్‌తో సంప్రదించాలి. అక్కడి స్థానిక పరిస్థితులు, అక్కడి స్థానిక వ్యాధులకు అనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు, నివారణ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని రకాల ట్రావెల్ వ్యాక్సిన్లు హెచ్ఐవీ రోగులకు సురక్షితమే అయినా మరికొన్ని సురక్షితం కావు. అందుకే ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. పరిస్థితులను బట్టి అదనంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ : మెనింగోకోకస్ అనే సూక్ష్మక్రిమి మెదడు చుట్టూ ఉండే పొరల వాపు వచ్చేలా చేసి, మెనింజైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారిలో... కాలేజీలలోని డార్మెటరీలలో నివసించేవారు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. మెనింజైటిస్ విస్తృతంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేవారు, లేదా అకస్మాత్తుగా ఈ వ్యాధి విజృంభించినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కలుషితమైన నీటి వల్ల ఈ వైరస్ సోకుతుంది. మాదకద్రవ్యాలను రక్తనాళం (ఐవీ) ద్వారా లోపలికి తీసుకునే వారు, ఇంతకుమునుపే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రక్తస్రావం విపరీతంగా జరిగే హీమోఫీలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, ప్రపంచ పర్యటనలకు వెళ్లేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. లైవ్ వ్యాక్సిన్లలో ఏవి తీసుకోవాలి? హెచ్ఐవీ రోగులు కొన్ని లైవ్ వ్యాక్సిన్లను సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వారు తమ టీసెల్ (సీడీ4) కౌంట్ 200 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవి.. వారిసెల్లా వ్యాక్సిన్ : రెండు మోతాదుల్లో తీసుకోవాల్సి ఈ వ్యాక్సిన్ చికెన్పాక్స్నుంచి రక్షణ ఇస్తుంది. జోస్టర్ వ్యాక్సిన్ : ఒక మోతాదులో తీసుకోవాల్సిన ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ఇది చికెన్‌పాక్స్‌కు సంబంధించిన వ్యాధి. ఇందులో చర్మంపై తీవ్రమైన నొప్పితో కూడిన కదుముల వంటి ర్యాష్ కనిపిస్తుంది. గర్భధారణను కోరుకుంటే...? హెచ్ఐవీ ఉన్న మహిళలు గర్భాన్ని ధరించాలని కోరుకుంటే తప్పనిసరిగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణకు ముందుగా విధిగా తీసుకోవాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఏయే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఎంతెంత వ్యవధి తర్వాత? హెచ్ఐవీ రోగులు వాడాల్సిన వ్యాక్సిన్లు... ఫ్లూ వ్యాక్సిన్ : జ్వరం, చలి, కండరాల నొప్పులు, దగ్గు, బొంగురుగొంతు లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. దీన్ని ‘ఫ్లూ షాట్’ లేదా ‘ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్’ అంటారు. దీన్ని ప్రతి ఏడాదీ ఒక డోసు తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్: న్యూమోకోకస్ అనేది ఊపిరితిత్తులు, చెవులు, రక్తం లేదా మెదడు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసే సూక్ష్మక్రిమి. దీన్ని నివారించే వ్యాక్సిన్‌ను న్యూమోనియా వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్ఐవీ ఉన్నవారు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని 19 నుంచి 64 ఏళ్ల మధ్యన వాడుతుండాలి. ఇక వారికి 65 ఏళ్లు నిండాక కూడా ఈ రెండింట్లో ఒకదాన్ని వాడాలి. అయితే గత ఐదేళ్లలో వాడని రకాన్నే ఈసారి వాడాలి. డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్ : డిఫ్తీరియా రోగులకు గొంతు వెనక నల్లటి పొర ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు సృష్టిస్తుంది. టెటనస్ వ్యాధి కండరాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పెర్టుసిస్ను కోరింత దగ్గు అని కూడా అంటారు. దీని వల్ల రోగులకు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఈ మూడు జబ్బులనూ నివారించే ఒకే వ్యాక్సిన్‌ను హెచ్ఐవీ రోగులు ఒకే మోతాదు (ఒక షాట్‌గా) తీసుకోవాలి. ఇలా ఈ మూడు వ్యాక్సిన్లు కలిపిన ఒకే షాట్‌ను ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ : ఈ వైరస్ మర్మావయవాల వద్ద పులిపిరుల వంటి వాటికీ, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారు ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్: హెపటైటిస్-బి వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. వచ్చేందుకు అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు... చికిత్సలు న్యూమోసిస్టిస్ న్యూమోసిస్టిస్ కేరినై న్యుమోనియా (పీసీపీ) అనే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకావం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో అత్యధికుల్లో మరణానికి దారితీసే న్యూమోనియా రకాల్లో ఇదొకటి. యాంటీబయాటిక్స్‌తో చికిత్స ద్వారా ఈ పీసీపీని నివారించవచ్చు. నోటిలో థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి, టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉన్నవారికి ఈ వ్యాధి చికిత్స అవసరం. అయితే ఒకవేళ హెచ్ఐవీ ఉన్నందున యాంటీ రిట్రోవైరల్ మందులు (ఏఆర్వీ) వాడుతూ... వాళ్ల టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే ఎక్కువ ఉంటే వారు ఆరు నెలల పాటు పీసీపీకి చికిత్స తీసుకొని ఆ తర్వాత దాన్ని ఆపేయవచ్చు. కానీ టీసెల్ కౌంట్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం జీవితాంతం ‘పీసీపీ’కీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. టోక్సోప్లాస్మా పెద్దగా బాహ్యలక్షణాలేవీ కనిపించకుండా సంక్రమించే వ్యాధుల్లో టోక్సోప్లాస్మోసిస్ ఒకటి. అయితే టోక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్కు కారణమైన ఏకకణజీవి... కొందరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగేలా చేసి, మృత్యువుకు సైతం దారితీయవచ్చు. ఒక వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అతడి రక్తంలో టోక్సోప్లాస్మా పరాన్నజీవి అప్పటికే ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వెంటనే రక్తపరీక్ష నిర్వహించాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిలో టీసెల్స్ కౌంట్ 100/మైక్రోలీటర్ ఉంటే టోక్సోప్లాస్మా నివారణ చికిత్స ప్రారంభించాలి. అయితే న్యుమోసిస్టిక్ కేరినై న్యూమోనియా (పీసీపీ) చికిత్స కోసం వాడే కొన్ని మందులు టోక్సోప్లాస్మానూ నివారిస్తాయి. ఒకవేళ రక్తపరీక్షలో ఆ రోగికి అంతకుమునుపు టోక్సోప్లాస్మా లేదని తెలిస్తే అతడు ఆ వ్యాధికి ఎక్స్పోజ్ కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అతడు పచ్చి మాంసం లేదా ఉడికీ ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. పిల్లి విసర్జనకు, మట్టికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టోక్సోప్లాస్మా నివారణకు మరికొన్ని చర్యలు/జాగ్రత్తలు చేపట్టాలి. అవి... * వేటమాంసం, బీఫ్ అండ్ పోర్క్ రంగు పింక్ కలర్లో ఉందంటే అది ఉడకనట్టు లెక్క. అలాంటి మాంసాన్ని ఎయిడ్స్ రోగి తినకూడదు. * పిల్లి విసర్జనను శుభ్రపరచదలచుకుంటే చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. * తోట పని చేసిన తర్వాత చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. * పచ్చిగా తినే పండ్లు, కూరగాయలను చాలా శుభ్రంగా కడిగాకే తినాలి. * మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్) * హెచ్ఐవీ రోగుల్లో టీ సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్స్ కంటే తక్కువ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లలో ఇదొకటి. మ్యాక్‌కు గురైన రోగుల్లో అత్యధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వాతావరణాల్లోనూ మ్యాక్ కనిపిస్తుంది. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన దీన్ని నివారించలేము. అయితే ‘టీ’సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఆ తర్వాత టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్‌కు చేరగానే ఈ చికిత్సను ఆపేయవచ్చు. ఈ చికిత్స కనీసం మూడు నెలలు కొనసాగాల్సి ఉంటుంది. క్యాండిడా (ఈస్ట్) క్యాండిడా అనే ఈ ఇన్ఫెక్షన్ హెచ్ఐవీ ఉన్న రోగుల్లో సాధారణంగా నోరు, యోని ప్రాంతాల్లో రావచ్చు. ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంలోని ముడుత పడే ప్రాంతాల్లో పెరగవచ్చు. మలద్వారం చుట్టూ కూడా రావచ్చు. అయితే తరచూ పునరావృతమవుతుంటే తప్ప దీనికి నివారణ చికిత్సలు చేయరు. ఇదొక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల నేలలో ఇది పెరుగుతుంది. దీని వల్ల క్రిప్టోకాక్సోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇది టీసెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న వారిలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఎయిడ్స్ రోగుల్లో కనిపించే అత్యధిక ఇన్ఫెక్షన్లలో దీనికి నాలుగో స్థానం. అయితే యాంటీ రిట్రోవైరల్ మందుల ఉపయోగం తర్వాత ఇది కనిపించే ఫ్రీక్వెన్సీ కొంత తగ్గినప్పటికీ, ఎయిడ్స్ మందులు వాడని వారిలో ఇప్పటికీ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మందులు వాడినప్పటికీ దీని నివారణ విషయంలో పెద్ద తేడా ఏమీ లేనందువల్ల సాధారణంగా దీనికి ఎలాంటి మందులనూ సిఫార్సు చేయరు. సైటోమెగాలోవైరస్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ సైటోమెగాలో వైరస్ (సీఎమ్‌వీ) సోకిన కొద్దిమందిలో తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎయిడ్స్ రోగుల్లో ఈ వైరస్ ఉంటే అది వారి కళ్లు, జీర్ణవ్యవస్థ, మెదడు, వెన్నుపూస వంటి భాగాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. కంటిలో రెటీనాను దెబ్బతీసే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ వల్ల రోగికి కనిపించే దృశ్యం అస్పష్టంగా మారి క్రమంగా చూపుపోవడం జరగవచ్చు. హెచ్ఐవీకి గురికాకమునుపే ఈ సీఎమ్వీకి గురైన కేసులు చాలా ఎక్కువే ఉంటాయి. ఇలా గతంలోనే సీఎమ్వీకి గురైన వారికి హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణ అయితే వారి టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తగ్గితే... కంటికి సంబంధించిన లక్షణాలు కనింపించినా, కనిపించకపోయినా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. అయితే సీఎమ్‌వీ నివారణకు మందులు వాడినా పెద్ద ఫలితాలేమీ కనిపించకపోవడంతో దీని నివారణకు సాధారణంగా మందులూ సూచించరు. కాకపోతే... సీఎమ్‌వీ రెటినైటిస్ తొలిదశలోనే ఉన్నప్పుడు (అంటే చూపు అస్పష్టంగా మారడం, కంటి ముందు నల్లమచ్చలు కనిపించడం, మిరుమిట్లు గొలుపుతున్నట్లు, తేలుతున్నట్లు మెరుపులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు) తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తక్షణం చికిత్స తీసుకోవాలి. తొలిదశలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం, ఫలితం తప్పక కనిపిస్తాయి. క్రిప్టోస్పోరీడియోసిస్ ఇది కలుషితమైన నీటిని తాగేవారిలో, అలాంటి నీటిలో ఈదే వారిలో కనిపించే పరాన్నజీవి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలం నుంచి ఇది నీటిలోకి చేరి... ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ క్రిమి కలిగించే ఇన్ఫెక్షన్ను ‘క్రిప్టోస్పోరీడియోసిస్’ అంటారు. హెచ్ఐవీ ఉన్న రోగులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది వారికి నీళ్లవిరోచనాలను కలిగిస్తుంది. మామూలు వారికీ ఇది సోకే అవకాశం ఉన్నప్పటికీ... టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్ఐవీ రోగులకు ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పునరావృతమవుతూ ఉంటుంది. దీని రిస్క్ నుంచి తప్పించుకోడానికి రోగులు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా డయాపర్స్ను మార్చాక, తోటపనిలో భాగంగా మట్టిని ముట్టుకున్న తర్వాత, పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. ఒక్కోసారి మున్సిపల్ నీటిపంపిణీ వ్యవస్థలోని నీరు కలుషితం కావడం వల్ల ఇది ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో నీటిని కాచి, వడపోసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిప్టోస్పోరీడియోసిస్కు నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. అయితే మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్)కు ఇచ్చే చికిత్సే క్రిప్టోస్పోరీడియోసిస్కూ ఉపయోగపడుతుంది. నిర్వహణ: యాసీన్