breaking news
highway firing
-
ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ప్రశాంతమైన గ్రామం అది.. పచ్చటి పంట పొలాలతో అలరారుతుండేది. అలాంటి గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక లవ్ మ్యారేజి.. నాలుగు హత్యలకు, మరికొన్ని హత్యాయత్నాలకు కారణమైంది. అది పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామం. విజయవాడ సమీపంలో జాతీయరహదారి మీద ఢిల్లీ నుంచి వచ్చిన కిరాయి హంతకులు కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నా.. హైదరాబాద్ జింకలబావి సమీపంలో జ్యోతిష్యుడు తురపాటి నాగరాజుపై కాల్పులు జరిగి.. అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. అన్నింటికీ పినకడిమి గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన లవ్ మ్యారేజే కారణం. ఈ గ్రామం జిల్లా కేంద్రం ఏలూరుకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అవ్వడానికి చిన్నదే అయినా.. అక్కడ ఇళ్లు చాలావరకు పెద్దపెద్ద బంగ్లాల్లా కనిపిస్తాయి. అందుకు కారణం.. అక్కడి జంగాలు. జ్యోతిష్యాన్ని వృత్తిగా చేసుకున్న జంగాలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్దపెద్ద వాళ్లకు జాతకాలు చెబుతుంటారు. విదేశాల్లో కూడా వీళ్లు పలువురు పెద్దలకు జాతకాలు చెప్పేవాళ్లు. అలా డబ్బు సంపాదించి ఇక్కడివాళ్లలో చాలామంది గొప్పవాళ్లయ్యారు. ఏలూరులోని కొన్ని హోటళ్లు కూడా పినకడిమి గ్రామస్థులవే. ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం రెండు కుటుంబాల మధ్య ఓ లవ్ మ్యారేజి చిచ్చు రేపింది. భూతం గోవిందు కుమార్తెను తురపాటి నాగరాజు కుమారుడు శివకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది భూతం కుటుంబానికి ఇష్టం లేదు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి అలా కొనసాగుతుండగానే.. గ్రామంలో ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లిన భూతం దుర్గారావు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తులతో నరికి చంపారు. తురపాటి నాగరాజు కుటుంబమే ఈ హత్య చేయించిందని భూతం వర్గీయులు అనుమానించారు. ఈ ఘటన తర్వాత దుర్గారావు సోదరుడు భూతం గోవిందు లండన్ పరారైపోయాడు. మరో సోదరుడు శ్రీనివాసరావు మాత్రం ఇక్కడే ఉండి.. నాగరాజు కోసం గాలించడం మొదలుపెట్టాడు. నాగరాజు, అతడి కొడుకులను కొన్నాళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేసినా, వాళ్లు అత్యంత నాటకీయంగా పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఎక్కడున్నారన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ తెలియలేదు. దుర్గారావు హత్య కేసులో ఇతర నిందితులైన నాగరాజు బావమరిది గంధం నాగేశ్వరరావు, అతడి కొడుకులు పెదమారయ్య, చినమారయ్య ముంబైలో తలదాచుకున్నారు. అక్కడి నుంచి కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు వస్తుండగా.. కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి సమీపంలో జాతీయ రహదారిపై కాల్పులు జరిగి, వాళ్లు ముగ్గురూ మరణించారు. ఈ హత్యకు స్కెచ్ వేసింది లండన్లో ఉన్న భూతం గోవిందు కాగా, ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లకు సుపారీ ఇచ్చింది మాత్రం శ్రీనివాసరావు అని చెబుతారు. తురపాటి నాగరాజు, అతడి కుమారులు ఎక్కడున్నారన్న విషయం చాలా కాలం పాటు ఎవరికీ తెలియలేదు. అయితే, ఇటీవలే ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాద్ సరూర్నగర్ సమీపంలోని జింకలబావి ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్న నాగరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. వాటిలో మూడు నాగరాజుకు తగిలాయి. పొట్ట భాగంలో రెండు రౌండ్లు, తొడ భాగంలో ఒక రౌండు బుల్లెట్లు దిగాయి. అయితే నాగరాజు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడినా, కోలుకున్న తర్వాత మాత్రం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. భూతం, తురపాటి కుటుంబాలకు చెందినవాళ్లు అందరూ ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూనే కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన జరిగినా వెంటనే అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, అంతా చక్కబడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామంలోకి రావడం మామూలైపోయింది. పెద అవుటపల్లి కాల్పులు జరిగిన తర్వాత ఒక్కసారిగా పినకడిమి గ్రామం ఉలిక్కిపడింది. అప్పటివరకు ఈ ఊరి గురించి తెలియని బాహ్య ప్రపంచానికి కూడా ఈ మొత్తం వ్యవహారం తెలిసింది. మొత్తానికి ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాను ఓ లవ్ మ్యారేజి అల్లకల్లోలం చేసింది. -పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు -
నేటి బాధితుడే.. నాటి నిందితుడు!
-
నేటి బాధితుడు.. నాటి నిందితుడు
సరూర్నగర్ జింకలబావి సమీపంలో కాల్పులకు గురైన నాగరాజు.. గతంలో ఏలూరు హైవేపై జరిగిన పినకడిమి హత్యకేసులో నిందితుడు. గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఏలూరు జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకేసులో నాగరాజే ప్రధాన నిందితుడు. అప్పటినుంచి నాగరాజు పరారీలో ఉన్నాడు. అతడితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత నాగరాజు బృందం పోలీసులకు లొంగిపోయింది. పదిరోజుల పోలీసు కస్టడీ తర్వాత నాగరాజుతో పాటు అతడి ఇద్దరు కుమారులు పరారయ్యారు. అయితే, పోలీసులే డబ్బులు తీసుకుని వాళ్లను వదిలేశారని భూతం దుర్గారావు బంధువులు ఆరోపించారు. నాగరాజు జైలు నుంచి పరారైన తర్వాత సెప్టెంబర్ నెలాఖరులో కృష్ణాజిల్లా పెద అవుటపల్లి వద్ద ప్రతీకార హత్యలు జరిగాయి. ఢిల్లీ గ్యాంగుకు సుపారీ ఇచ్చి మరీ దుర్గారావు అనుచరులు ఈ హత్యలు చేయించారు. అప్పటి నుంచి భూతం గోవింద్, భూతం శ్రీనివాసరావు అజ్ఞాతంలోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు నాగరాజుపై కాల్పులు జరగడంతో.. ఈ ఘటనలో భూతం గోవింద్, భూతం శ్రీనివాసరావులకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. భూతం దుర్గారావు వర్గీయులు, నాగరాజు కుటుంబాల మధ్య మొదలైన వివాదం వరుస హత్యలు, హత్యాయత్నాలకు దారితీస్తోంది. -
కాల్పుల కేసులో నిందితుల తరలింపు
-
'అవి ఖరీదైన హత్యలుగా భావిస్తున్నాం'
విజయవాడ : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో షూటర్లకు సహకరించిన నిందితులను తాజా గుర్తించినట్లు నగర సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్యలకు పాల్పడిన గ్యాంగ్ స్టర్స్ వివరాలను సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాల్పులు జరిగినప్పుడు అదే వాహనంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్న సంగతి వాస్తవేమనేని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏలూరు వన్ టౌన్ సీఐ మురళీ కృష్ణతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ ను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీపీ తెలిపారు. ఆ హత్యలను ఖరీదైన హత్యలుగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ హత్యా నిందితులు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో పరిచియాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. -
కాల్పుల కేసులో నిందితుల గుర్తింపు
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలో జరిగిన కాల్పుల కేసు విచారణ క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పినకడిమికి చెందిన ముగ్గురిని హతమార్చేందుకు ముంబై నుంచి షూటర్లను రప్పించి మరీ ఈ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. షూటర్లకు సహకరించిన ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. భూతం శ్రీనివాసరావు, పురాణం గణేశ్, వారణాసి శ్రీనివాసరావులతో పాటు మరో ముగ్గురు నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కోర్టు కేసు వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం వరకు విమానంలో వచ్చి అక్కడినుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నవారిని నిందితులు వెనకనుంచి కారుతో ఢీకొని, తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటు కృష్ణా, అటు పశ్చిమగోదావరి రెండు జిల్లాల్లోనూ సంచలనం సృష్టించింది.