breaking news
higher value assets
-
జయ ఆస్తులు రూ. 117 కోట్లు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత జయలలిత తనకు రూ. 117. 13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరిగే చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి శుక్రవారం నామినేషన్ వేసినప్పుడు అందించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. 2011లో శ్రీరంగం అసెంబ్లీ నుంచి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో ఆమె తనకు రూ. 51.40 కోట్ల ఆస్తున్నాయని తెలిపారు. తాజా అఫిడవిట్ ప్రకారం.. జయకు రూ. 45.04 కోట్ల చరాస్తులు, రూ. 72.09 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. చెన్నెలోని పోయెస్ గార్డెన్లో రూ. 43.96 కోట్ల విలువైన భవనం, పోయెస్ గార్డెన్, హైదరాబాద్ తదితర చోట్ల రూ. 13 కోట్ల విలువైన నాలుగు వాణిజ్య భవనాలు, హైదరాబాద్లో రూ. 14 కోట్ల విలువైన 14.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. 21 కేజీల ఆభరణాలు ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వ ఖజానాలో ఉండటంతో వాటి అసలు విలువ తెలియదని జయ పేర్కొన్నారు. తన వద్ద రూ. 3 కోట్లకుపైగా విలువైన 1,250 కేజీల వెండి వస్తువులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. -
జయ ఆస్తుల అధిక విలువపై హైకోర్టు ఆగ్రహం
బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆమె ఆస్తుల విలువను అధికంగా చూపిన తమిళనాడు అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1994లో రూ. 150 లోపున్న మార్బుల్ ధరను రూ. 5,000గా లెక్కిస్తే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించింది. తమ ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారని జయలలిత సహా మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సీఆర్ కుమారస్వామి తమిళ అధికారుల విచక్షణా జ్ఞానాన్ని ప్రశ్నించారు.