పరీక్షల ఒత్తిడా? ఇదిగో హెల్ప్‌లైన్
పరీక్షల సీజన్ మొదలైంది. ఏడాది అంతా చదవడం ఒక ఎత్తు. ఈ నెల రోజుల పైచిలుకు కాలం కష్టపడడం మరో ఎత్తు. సహజంగానే అటు చదువుకొనే పిల్లలకూ, ఇటు ఇంట్లోవాళ్ళకూ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందిప్పుడు. అయితే, మార్కులు, ర్యాంకులే జీవితమన్న భావనను పెంచిపోషించడంతో అనవసరమైన ఆందోళనతో సతమతమై, ఆఖరికి ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఇటీవల ఎక్కువవుతున్నారు.
ఈ పరిస్థితుల్ని గమనించి, భావితరానికి మానసికంగా అండగా నిలవడం కోసం హైదరాబాద్ నగరానికి చెందిన హెన్రీటా డిక్రూజ్, ఆమె మిత్రులు కలసి ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ‘‘సంప్రతించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తాం. సమస్యల ఏమిటో తెలుసుకొని, తగిన సూచనలిస్తాం. పెపైచ్చు, ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం’’ అని ఈ హెల్ప్‌లైన్‌కు శ్రీకారం చుట్టిన హెన్రీటా చెప్పారు.
స్వతహాగా గీత రచయిత, స్వరకర్త, గాయని అయిన హెన్రీటాకు ఈ ఆలోచన రావడం వెనుక విషాద గాథే ఉంది. ఆమె బంధువు ఒకరు పదహారేళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే, ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న ఆమె స్నేహితులు ఒకరు కూడా తొందరపడి జీవితాన్ని అంతం చేసుకున్నారు. ‘‘ఆత్మీయులెంత క్షోభను అనుభవిస్తారో ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే, హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశాం’’ అని హెన్రీటా చెప్పారు.
నిజానికి, ఈ ఆత్మహత్యల అంశంపై ఏకంగా ఓ సినిమా స్క్రిప్టు తయారు చేస్తున్నారామె. ఆ సినిమా ద్వారా చైతన్యం తేవాలనుకున్నారు. అది ఇంకా పూర్తిగా రూపం తీసుకోక ముందే, ఈ హెల్ప్‌లైన్ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ‘‘మా అబ్బాయి స్నేహితుడు ఒకడు నిరాశకు లోనై, సాయం చేయమని కోరుతూ సందేశం పంపాడు. అది చూశాక, టీనేజర్లు విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ, కెరీర్లో ఎటువైపు వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న ఈ సమయంలో ఏదైనా చేయాలనిపించింది. అలా ఈ హెల్ప్‌లైన్ పెట్టాం’’ అని హెన్రీటా వివరించారు. పరీక్షల నుంచి కానీ, తల్లితండ్రుల నుంచి కానీ, తోటివారి నుంచి కానీ ఒత్తిడికి గురవుతూ, జీవితం మీద నిరాశకు లోనవుతున్నారా? అయితే, ఆ బాధకు సంకేతంగా ‘కోడ్ బ్లూ’ అంటూ ఎస్.ఎం.ఎస్. పంపితే చాలు. హెన్రీటా బృందం నిపుణుల ద్వారా వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. ‘‘తీవ్ర నిరాశకు లోనై, అవసరంలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాల్సిన సమయం వచ్చిందనడానికి సంకేతంగా ‘కోడ్ బ్లూ’ అనే మాట వాడాం’’ అని చెప్పారు హెన్రీటా.
బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్‌లో పట్టా పుచ్చుకొని, వివిధ రకాల సామాజిక కార్యకలాపాల్లో స్వచ్ఛందంగానూ, వృత్తిపరంగానూ పాలుపంచుకొన్న అనుభవం ఆమెకు ఉంది. ఈ సామాజిక కార్యకర్త నెలకొల్పిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఎవరైనా సరే ‘కోడ్ బ్లూ’ అని ఎస్.ఎం.ఎస్. పంపితే చాలు. వారికి నిపుణుల ద్వారా సాయం అందిస్తారు. ఢిల్లీ, ముంబయ్, కోచ్చి నగరాలలోని సుశిక్షితులైన కౌన్సెలర్ల సాయం తీసుకుంటున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ‘యూత్ ఎలైవ్’ అనే మరో హెల్ప్ గ్రూప్‌తో జత కట్టారు. ప్రస్తుతం దాదాపు పాతిక మంది దాకా కౌన్సెలర్లు తమ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ గ్రూపు ద్వారా టీనేజర్ల పరీక్షల ఒత్తిడి మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నా, రాగల రోజుల్లో మిగిలిన అన్ని రకాల వయసుల వాళ్ళకూ ఈ సేవలను విస్తరించాలని భావిస్తున్నారు. సాహిత్యం, కళలను ప్రేమించే హెన్రీటా దానికి ఆలంబన అయిన పరిసర సమాజం మీద ప్రేమను చూపడం సహజమే!
(ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు ‘కోడ్ బ్లూ’ అని ఎస్.ఎం.ఎస్. పంపాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ - 9959595050).