breaking news
heavy compensation
-
తాగుబోతు పైలట్‌ను పట్టేశారు
వేరే దేశానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన విమానం అది. దాన్ని నడిపించాల్సిన పైలట్ మాత్రం ఫుల్లుగా తాగేసి ఊగుతూ వచ్చాడు. అతగాడి తీరు చూసి అనుమానంతో అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే.. అయ్యగారు మందేసిన విషయం బయటపడింది. దాంతో విమానాన్ని నడపకుండా అతగాడిని ఆపేశారు. ఈ కారణంగా ఆ విమానంలో వెళ్లాల్సిన 259 మంది ప్రయాణికులకు 15 గంటలు ఆలస్యమైంది. ఉపేంద్ర రణవీర అనే సదరు పైలట్‌కు గతంలో జారీచేసిన లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు డీజీసీఏ నిమల్సిరి తెలిపారు. అతడి లైసెన్సు పూర్తిగా ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా చెప్పాలని చెప్పాలని నోటీసు ఇచ్చారు. కొలంబో నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ వెళ్లాల్సిన యూఎల్ 554 విమానం ఈ పైలట్ కారణంగా 15 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. దీంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. వారందరికీ ఈయూ నిబంధనల ప్రకారం భోజనాలు, వసతి ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఒక్కొక్కరికి రూ. 45 వేల (600 యూరోలు) పరిహారం కూడా చెల్లించారు. కేవలం ఈ పరిహారానికే ఆ విమానయాన సంస్థపై దాదాపు కోటి రూపాయలకు పైగా భారం పడింది. -
విమానప్రమాద బాధితులకు భారీ పరిహారం
ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయి మరణించిన 149 (కో పైలట్ లూబిడ్జ్‌ని మినహాయించి) మంది బాధితుల కుటుంబాలకు లుఫ్తాన్సా విమానయాన సంస్థ నష్ట పరిహారం కింద కోట్లాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ సహాయం కింద శుక్రవారం రాత్రి ఒక్కో ప్రయాణికుడికి రూ. 34 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. 1999 నాటి మాంట్రీల్ అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఒక్కో బాధితుడికి రూ. 98 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. తమ కుటుంబానికి భారీ నష్టం జరిగినట్టు బాధితుల కుటుంబాలు కోర్టులో రుజువు చేస్తే ఈ నష్ట పరిహారం మరింత పెరుగుతుంది. థర్ట్ పార్టీ కారణంగా విమాన ప్రమాదం జరిగినట్లు లుఫ్తాన్సా రుజువు చేయగలిగితే తాము చెల్లించాల్సిన నష్ట పరిహారం భారీగా తగ్గుతుంది. అయితే ఈ విమాన ప్రమాద సంఘటలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే కో పైలట్ ప్రమాదానికి బాధ్యుడని ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి కనుక. విమానయాన నిబంధనల ప్రకారం పైలట్ల మానసిక పరిస్థితిని సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి. అందుకు అవసరమైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుండాలి. అంతేకాదు... విమానం నడిపేముందు ప్రతిసారీ పైలట్ ఫిట్నెస్ను తెలుసుకోవాలి. ఈ విషయంలో లుఫ్తాన్సా పూర్తిగా విఫలమైనందున ఇందుకు కోర్టులు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.