breaking news
harichandrapuram
-
సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
దాపులనే కృష్ణమ్మ గలగలలు... దారి పొడవునా తలలూపుతూ స్వాగతం పలుకుతున్న పచ్చని పంట పొలాలు... వాటి మధ్య చిన్న పల్లెటూరు హరిశ్చంద్రపురం. తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతుంటుంది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని ఈ ఊరి రైతులను ఇప్పుడు ఎన్నో సందేహాలు.. భూ సంబంధిత సమస్యలు చుట్టుముడుతున్నాయి. శుక్రవారం సాక్షాత్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి ఆ గ్రామానికి వెళ్లారు. పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులను ఆప్యాయంగా పలుకరించారు. వారి సమస్యలు విని, వాటి పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. - సాక్షి, గుంటూరు/గుంటూరు సిటీ జాయింట్ కలెక్టర్ : హరిశ్చంద్రపురం గ్రామ ప్రజలకు నమస్కారం. గ్రామస్థులు : నమస్కారమండి. జేసీ : సాక్షి సహకారంతో మీ గ్రామంలో ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు విలేకరిగా మీ ముందుకు వచ్చాను. మీ సమస్యలను నాకు చెప్పండి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తాను. జేసీ : (గామస్తుడిని పలుకరించి) మీ పేరేమిటి? మీ సమస్యేమిటి? గ్రామస్తుడు : నా పేరు శ్రీనివాసరావండీ, నాకు గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది సార్. వాటికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అడంగల్ కాపీల్లో వివరాలు తప్పుల తడకగా ఉండడం వల్ల ఇబ్బందులొస్తున్నారుు. నా సమస్య తీర్చండి సార్ జేసీ : భూములకు సంబంధించిన అన్ని రికార్డులను ప్రస్తుతం కంప్యూటరీకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రైతుల పాస్‌బుక్‌లను ఆధార్ కార్డులకు అనుసంధానించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాం. మీరు మీ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా మీ సేవ ద్వారా సమస్యను సత్వరం పరిష్కరించుకోవచ్చు. పాస్ పుస్తకాలను కూడా ఆధార్ తో అనుసంధానించుకోండి. భవిష్యత్తులో ఇక ఇబ్బందులు తలెత్తవు. జేసీ : మీ సమస్యేమిటయ్యూ? కృష్ణావతారం : ఈ గ్రామంలోని పొలాన్ని మా నాన్నగారు పదేళ్ళ కిందట కొన్నారు. దాని దస్తావేజులు కూడా మా వద్ద ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అది అనువంశికంగా నమోదై ఉంది. దీనికి పరిష్కారమేంటి సార్? జేసీ : మీ దగ్గర భూమి తాలూకు దస్తావేజులు ఉన్నప్పుడు అదేమంత పెద్ద సమస్య కాదండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో రెవెన్యూ అధికారులను కలవండి. వారు అనువంశికం కాదని రాసిస్తారు. జేసీ : ఇక మీ సమస్యలేంటమ్మా? శ్రీలత : గ్రామంలోని భూమి మా నాయనమ్మ పేరు మీద ఉంది సార్. అడంగల్‌లో మాత్రం తాతయ్య పేరు నమోదై ఉంది. ఇప్పుడు తాతయ్య లేరు. అడంగల్‌లో మా తాతయ్య పేరు మార్చాలంటే ఏం చేయాలి సార్? జేసీ : మీ తాతయ్య డెత్ సర్టిఫికెట్ ఉందామ్మా? శ్రీలత : లేదు సార్. జేసీ : ప్రస్తుతం ఆదాం అనే పేరు అడంగల్‌లో ఉంది. ఆయన మీ నాయనమ్మకు భర్తే అని నిర్ధారించే ఆధారాలు ఏమి ఉన్నా వాటిని తీసుకుని రెవెన్యూ అధికారులను కలవండి. అడంగల్‌లో కూడా మీ నాయనమ్మ పేరు నమోదు చేస్తారు. స్వర్ణకుమారి : మా ఆయన పేరు మీద ఈ గ్రామంలో 37 సెంట్ల స్థలం ఉంది. ఆయన చనిపోయారు. నాకు రేషన్‌కార్డు తప్ప మరే ఇతర ఆధారం లేదు. ఆ స్థలం నా పేరు మీద మార్చుకునే వీలుందా సార్? జేసీ : తప్పకుండా వీలవుతుందమ్మా. నీ వద్ద ఉన్న రేషన్‌కార్డు ఆధారంగా ఆయన డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకుని రెవెన్యూ అధికారులను కలవండి. 45 రోజుల్లో దాన్ని మీ పేరు మీద బదిలీ అయిపోతుంది. జేసీ : ఏం పెద్దయ్యూ పింఛన్ అందుతోందా? పెద వరదయ్య : నాకు 66 ఏళ్ల వయసు. అయినా నాకు పింఛన్ అందడం లేదు సారూ... ఆధార్‌కార్డులో 64గా నమోదవడం వల్లే ఈ సమస్య వచ్చింది. ఏం చేయాలి సార్? జేసీ : 65 ఏళ్లు దాటితేనే పింఛన్ అందుతుంది. ఆధార్ కార్డులో పొరపాటుగా నమోదవడం వలన ఇలా జరిగింది. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందేలా చూస్తా.. జేసీ : (రైతులందరినీ ఉద్ధేశించి) కొత్తగా వచ్చిన వీఆర్ఓ బాగానే సహకరిస్తున్నారా? లేక ఇబ్బంది పెడుతున్నారా? రైతులు : బాగానే పని చేస్తున్నారు సార్. సమస్యలపై ఆరా.. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జేసీ గ్రామంలోని రోడ్డు వెంట నడుస్తూనే రైతులను సాదరంగా పలకరించారు. దారిన పోతున్న కృష్ణయ్య అనే ఒక రైతును ఆపి రుణమాఫీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ : ఏం పెద్దయ్యా నీ పంటరుణం మాఫీ అయిందా..? కృష్ణయ్య : మా ప్రాంతంలో అసలు అరటి పంటే వేయం. కానీ పంట రుణాలను అరటి తోటల సాగుకు తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీని వల్ల మాకు తీవ్ర అన్యాయం జరిగింది. జేసీ : అలాగా.. దీనిపై స్వయంగా ఆర్డీవోతో విచారణ జరిపిస్తా. వాణిజ్య పంటలే పండిస్తున్నట్లు తేలితే రుణ మాఫీ జాబితాను తిరిగి సరిచేసే ప్రయత్నం చేస్తాం. మాతంగి నాగేశ్వరరావు : మా తండ్రి రామారావు నవంబర్ 15వ తేదీన ఇసుక తోలే పనిలో ఉండగా కృష్ణానదిలో మునిగి చనిపోయారు. ఆపద్బంధు కింద మా కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూడండయ్యా.. జేసీ : దరఖాస్తు చేసుకుంటే తప్పక సాయమందేలా చూస్తాం. పంట పొలాల్లో రైతులు, కూలీలతో.. జేసీ : పనులు పుష్కలంగా దొరుకుతున్నాయా? కూలీ ఎంత దక్కుతుంది? మస్తాన్, రైతు కూలీ : ఫర్వాలేదు సార్.. షేక్ హిదయతుల్లా, రైతు: పత్తికి మద్ధతు ధర దక్కడం లేదండి, అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది జేసీ : దగ్గరలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇప్పుడు అమ్మకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతు బ్యాంకు ఖాతాలోనే నేరుగా నగదు జమ అవుతుంది. వెంకటేశ్వరరావు, నిమ్మరైతు : వ్యవసాయంపై మమకారంతో రైల్వే ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా. 2007లో క్రాప్ లోన్ తీసుకుని నిమ్మ సాగుచేశా. లాంఫారం శాస్త్రవేత్తల సూచనల మేరకు అందులో అంతర్ పంటలు కూడా వేస్తున్నానండి. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. జేసీ : పేరు ఎందుకు లేదో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తా. అంతర్ పంటలు వేసుకునే విత్తనాల కొనుగోలుకు అవసరమయ్యే సబ్సిడీ కూడా అందేలా కృషిచేస్తా. -
కృష్ణానదిలో పడవ బోల్తా, ఒకరి గల్లంతు
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద కృష్ణానదిలో బుధవారం ఓ నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతు కాగా, వారిలో ముగ్గుర్ని స్థానికులు రక్షించారు. గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హరిశ్చంద్రపురంకు చెందిన నలుగురు గ్రామస్తులు తమ సొంత అవసరాల నిమిత్తం ఇసుక కోసం కృష్ణానదిలోకి వెళ్లారు. ఇసుక లోడ్‌తో తిరిగి వస్తుండగా ఓవర్ లోడ్‌తో పడవ బోల్తా పడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్నవారంతా నదిలో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.... చిన్నాబ్బాయి, బాబూరావు, మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా గల్లంతు అయిన రామారావు కోసం గాలిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.