breaking news
Granollers
-
70వ ప్రయత్నంలో ఒకరు... 52వ ప్రయత్నంలో మరొకరు
పారిస్: పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే... ఎట్టకేలకు తమ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ కలను నెరవేర్చుకున్నారు మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్), హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా). గెలవాలన్న కసి ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని వీరిద్దరూ నిరూపించారు. 39 ఏళ్ల గ్రానోలెర్స్ 2007 నుంచి... 40 ఏళ్ల జెబలాస్ 2009 నుంచి గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పోటీపడుతున్నారు. చివరకు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరి గ్రాండ్‌స్లామ్ టైటిల్ స్వప్నం సాకారమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదో సీడ్ గ్రానోలెర్స్–జెబలాస్ ద్వయం 6–0, 6–7 (5/7), 7–5తో ఎనిమిదో సీడ్ జో సాలిస్బరీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంటను ఓడించి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. తాజా ఫ్రెంచ్ ఓపెన్కంటే ముందు గ్రానోలెర్స్ 69 సార్లు... జెబలాస్ 51 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీనల్లో బరిలోకి దిగారు. గతంలో గ్రానోలెర్స్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019, 2014), ఫ్రెంచ్ ఓపెన్ (2014)లలో... జెబలాస్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019)లలో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం విజేతలుగా అవతరించి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. చాంపియన్‌గా నిలిచిన గ్రానోలెర్స్–జెబలాస్ జోడీకి 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించింది.మహిళల డబుల్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ జోడీ జాస్మిన్ పావోలిని–సారా ఎరాని (ఇటలీ) టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పావోలిని–సారా ఎరాని ద్వయం 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జంటను ఓడించింది. సారా ఎరానికిది ఆరో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్. రొబెర్టా విన్సీ (ఇటలీ)తో కలిసి సారా ఎరాని గతంలో యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లోనూ సారా ఎరాని ఇటలీకే చెందిన ఆండ్రియా వావసోరితో జతకట్టి టైటిల్ గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన పావోలిని–సారా ఎరాని ఖాతాలో 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీగా చేరాయి. -
పేస్ ‘సెంచరీ’
డబుల్స్‌లో తన 100వ భాగస్వామిగా గ్రానోలెర్స్ నాటింగ్హమ్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. సోమవారం మొదలైన ఎగాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పేస్ పురుషుల డబుల్స్‌లో తన 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌కు చెందిన మార్సెల్ గ్రానోలెర్స్తో పేస్ జత కట్టనున్నాడు. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన పేస్ ఇప్పటివరకు డబుల్స్‌లో 99 మంది భాగస్వాములతో వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కెరీర్లో 702 మ్యాచ్‌ల్లో గెలిచిన పేస్, 55 డబుల్స్ టైటిల్స్ సాధించాడు.