breaking news
Governor accepts
-
రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి! ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి. దీన్ని చరిత్రాత్మక ఘటనగా డీఎంకే అభివర్ణించగా చరిత్ర సృష్టించడం తమ పార్టీ నైజమంటూ సీఎం స్టాలిన్ ఎక్స్లో పోస్టు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది. -
ఏపీలో ఓటు హక్కు పొందిన గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు పొందారు. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో గవర్నర్, ఆయన సతీమణి ఓటు కోసం దరఖాస్తు చేయగా.. నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాయమణి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ గవర్నర్ దంపతులకు ఓటరు కార్డును అందచేయనున్నారు. -
మండలి రాజీనామా ఆమోదించిన గవర్నర్
అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరిసింహన్కు పంపారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమెదించారు.అనంతరం అధికార భాషా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మండలి బుద్ధ ప్రసాద్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2004లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పని చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. దాంతో నామినేటడ్ పోస్ట్లో ఉన్న వారు తమతమ పదవులకు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.