breaking news
Government of Switzerland
-
బయటికి ‘అన్క్లెయిమ్లు’
ఖాతాలు వెల్లడించనున్న స్విస్ ప్రభుత్వం జ్యూరిచ్: నల్లధన ఖాతాలను వెల్లడిస్తున్న స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇక తమ దేశ బ్యాంకుల్లోని 60 ఏళ్లుగా క్లెయిమ్ చేయని విదేశీ ఖాతాల జాబితానూ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ దేశ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వెల్లడించింది. ఖాతా ప్రారంభించిన నాటినుంచి 10 ఏళ్లుగా బ్యాంకుతో సంబంధాలు నెరపక పోవడమే కాకుండా.. అరవై ఏళ్లుగా సంబంధిత మొత్తాలపై క్లెయిం చేయకుండా బ్యాంకులో మూలుగుతున్న నిధుల వివరాలు వెల్లడించేందుకు నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు స్విస్‌బ్యాంకు అసోసియేషన్ (ఎస్బీఏ) తెలిపింది. ఇక భారత్ విషయానికి వస్తే 1955 నుంచీ ఇలాంటి ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాదారుల్లో అత్యధికులు అప్పటి రాజులు, రాజకుటుంబీకులు, సంస్థానాలకు చెందిన ధనవంతులకు చెందినవిగా చెప్తున్నారు. వ్యక్తిగతంగా ఆ ఖాతాదారు గానీ, వారి వారసులుగానీ వాటిపై హక్కులను, సాక్ష్యాలను చూపకపోవడంతో ఆ నిధులు బ్యాంకులో మూలుగుతున్నాయి. స్విస్‌లో రూపొందించిన కొత్త బ్యాంకింగు చట్టాల ప్రకారం కనీసం 500 స్విస్ ఫ్రాంకులతో మొదలైన ఖాతాపై ఎవరూ 10 ఏళ్లపాటు లావాదేవీలు జరపకుండా ఉంచినప్పుడు దాన్ని ‘అన్‌క్లెయిమ్’ ఖాతాగా గుర్తిస్తారు. అటువంటి జాబితాలను 50 ఏళ్లపాటు వేచి చూశాక విడుదల చేయాలి. న్యాయబద్ధ వారసులు వస్తే పరిశీలిస్తారు, లేకుంటే ఆ సంపదను స్విస్ కాన్ఫడరేషన్‌కు బదిలీ చేయడమో, లేక విలీనం చేయడమో తప్పనిసరి. ఇలా 2015 చివరికల్లా ఇలాంటి ఖాతాలను గుర్తించి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంబుడ్స్‌మన్ పేర్కొన్నారు. అయితే ఈ ఖాతాలను అక్రమ ఖాతాల కోణాల్లో పరిగణించాల్సిన అవసరం ఉండదు. హక్కుదారుగా రాకపోవడమో, వివాదాలు తేలకపోవడమో, లేకుంటే ఆ సమాచారం ఖాతాదారు నుంచి తమవారికి లేకపోవడం కారణం కావచ్చని స్విస్ బ్యాంకర్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
చర్చించుకుందాం రండి!
నల్లధనంపై భారత అధికారులకు స్విస్ ఆహ్వానం న్యూఢిల్లీ/బెర్న్: నల్లధనం ఖాతాల విషయంలో చర్చలు జరపడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత అధికారులను తమ దేశానికి ఆహ్వానించింది. అయితే దీనిపై తదుపరి వివరాలను తెలపడానికి స్విస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల ద్వారా బయటకు వచ్చిన భారత ఖాతాదారుల జాబితా విషయంలో ఎలాంటి చర్చలూ ఉండవని తెలుస్తోంది. ఆయా బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల ద్వారా ఈ జాబితాలు బయటకు వచ్చాయని సమాచారం. అక్రమపద్ధతుల్లో బయటకు వచ్చిన వివరాలపై తాము మాట్లాడబోమని స్విస్ అధికారులు అంటున్నారు. ‘నల్ల’ నోట్లలో నకిలీలు భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు స్విట్జర్లాండ్‌లో దాచుకున్న నల్లధనం గురించి ఓ వైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతుంటే మరో పక్క ఈ నల్లధనంలో నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ అధికారులు గుర్తించారు. యూరోలు, డాలర్ల తర్వాత భారత కరెన్సీలోనే ఎక్కువగా నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ పోలీసులు తెలిపారు. 2013 సంవత్సరంలో 2,394 నకిలీ యూరోనోట్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 1,101 నకిలీ అమెరికా డాలర్లు వచ్చినట్లు కనుగొన్నారు. ఇక భారత కరెన్సీ విషయానికి వస్తే 2013లో 403 నకిలీనోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంలో భారత్ మూడోస్థానంలో ఉందని స్విస్ పోలీసులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో రూ. 500 నోట్లు 380, 23 వెయ్యిరూపాయల నోట్లు ఉన్నట్టు గుర్తించారు.