breaking news
goddes kanakadurga
-
కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో దుర్గమ్మ నగలు దొంగతనం జరిగితే వాటి స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారు.. ఇపుడు ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని తెలిపారు. ఆ పూజలు మీ అనుమతి లేకుండా చేశారా.. ఎవరి కోసం చేశారో చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. తాంత్రిక పూజలపై దొంగే దొంగ అన్నట్లుగా ఉందంటూ ఈ పూజలపై విచారణ అంటున్న ప్రభుత్వం గతంలో వేసిన విచారణ కమిటీల నివేదికలపై తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు తెలపాలన్నారు. తాంత్రిక పూజలు భక్తులు మనోభావాలను దెబ్బతీశాయన్నారు. మీ విచారణల మీద ప్రజలకు నమ్మకం లేదని, అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాగా, గత నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ ఇపుడు జన్మభూమి నిర్వహిస్తున్నారు.. దీనివల్ల ఏ ఒక్కరికీ ఉపయోగం లేదన్నారు. జన్మభూమి, టీడీపీ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉపయోగించడం సబబుకాదన్నారు. పులివెందులలో మైక్ ఇవ్వకుండా చంద్రబాబు ఎంపీని అవమానించారన్నారు. ప్రైవేట్ వ్యక్తులు జన్మభూమి కార్యక్రమంలో ఎక్కవ కనిపిస్తున్నారని, పోలీస్ పహరాలోనే ఈ కార్యక్రమం జరుగుతోందని రఘువీరా విమర్శించారు. -
దుర్గమ్మ హుండీ లెక్కింపులో చోరీ!
కనకదుర్గ దేవస్థానం హుండీ లెక్కింపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దేవస్థానంలో ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీలను లెక్కిస్తారు. దీనిలో భాగంగానే హుండీ కలెక్షన్లను లెక్కిస్తుండగా ఓ ఉద్యోగి అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు మంగళసూత్రాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని ఆలయ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు సిబ్బంది సుబ్బారావు టీ కప్పులో నాలుగు గ్రాముల బరువున్న మంగళ సూత్రాలను వేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీటీవీలో గుర్తించి అతడిని పట్టుకున్నారు. మొదట ఆలయ అధికారులు అతడిని విచారించి, తర్వాత విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.