breaking news
Getty Gopinath
-
పెండింగ్ కేసులు పరిష్కరించండి
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. అర్బన్ జిల్లా పరిధిలోని డీఎస్పీలతో తన కార్యాలయంలో శనివారం ఆయన సమావేశమయ్యారు. వరుస ఎన్నికల్లో సమస్యలు తలెత్తకుండా సమర్థంగా విధులు నిర్వర్తించారంటూ డీఎస్పీలను ఆయన అభినందించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగించి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లలో నిందితులను కోర్టులో హాజరు పరిచి పెండింగ్ వారెంట్లను తగ్గించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు జానకీధరావత్, బి.శ్రీనివాసులు, డీఎస్పీలు గంగాధరం, పీవీ నాగరాజు, ఎం.మధుసూదనరావు, వెంకటేశ్వరరావు, తిరుప్పాల్, మెహర్‌బాబా, ఎస్పీ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మలివిడత పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
ఎన్నికల విధుల్లో ఐదువేల మంది అధికారులు, సిబ్బంది ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: మలివిడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా పోలీసు స్టేషన్ల అధికారులకు ఎస్పీలు జె.సత్యనారాయణ, జెట్టి గోపినాథ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను, సాయుధ బలగాలను, కేంద్ర బలగాలను ఇప్పటికే గ్రామాల్లో మోహరించారు. ఎన్నికల బందోబస్తు నిర్వహించేందుకు ఇద్దరు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 300 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 3 వేల మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులతో పాటు, పది ప్రత్యేక బలగాలు, మూడు సాయుధ బలగాలు, ఒక కంపెనీ కేంద్ర బలగాలను ఆరంచెల విధానంలో విధులు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించేందుకు అర్బన్, రూరల్ ఎస్పీలు ప్రణాళిక రూపొందించారు. మొబైల్పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు నిరంతరం గస్తీలు నిర్వహిస్తాయి. గతనెల 3వ తేదీనుంచి జిల్లాలో కొనసాగుతున్న చెక్‌పోస్టుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 5.84 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.