రజనీకాంత్ స్కూల్‌ను పట్టించుకోరా?
బెంగళూరు: దక్షిణ భారతదేశంలో ‘సూపర్‌స్టార్’గా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ చదివిన పాఠశాలను పట్టించుకునే వారే లేకుండా పోయారని కర్ణాటక రజనీ జీ సేవా సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు జి.సదానంద స్వామి మాట్లాడుతూ... నగరంలోని గవిపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రజనీకాంత్ విద్యాభ్యాసం చేశారని గుర్తుచేశారు.
ఈ పాఠశాలను పునర్నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2009లో రూ.81.40 లక్షలను విడుదల చేసిందని తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ.32.42 లక్షలను అందజేసిందని చెప్పారు. ఈ నిధులతో పాఠశాల పునర్నిర్మాణ పనులను ప్రారంభించి నాలుగు అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారని వెల్లడించారు. అయితే గత ఎనిమిది నెలలుగా ఈ భవనం నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయని తెలిపారు. దీంతో ఆ భవనం అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక భవన నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందువల్ల సంబంధిత అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించి, మిగిలిన నిధులను విడుదల చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాలని సదానంద స్వామి డిమాండ్ చేశారు.