breaking news
Galli rain
-
గాలీవాన బీభత్సం
బండరాయిపడి మహిళ మృతి హడలిపోయిన తిరుపతి వాసులు తిరుపతిలో గాలీవాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బండరాయి పడి ఓ మహిళ మృతి చెందింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లపై వేసిన రేకులు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గంటకుపైగా కురిసిన గాలీ వానతో స్థానికులు హడలిపోయారు. తిరుపతి కార్పొరేషన్: నగరంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నెత్తిపై బండరాయి పడి జీవకోనకు చెందిన ఓ మహిళ మృతిచెందింది. రాజీవ్‌గాంధీ కాలనీలోని వెంకటగిరి స్కూల్ వద్ద దాదాపు 20 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షానికి కాలువలు, డ్రైన్లు పొంగిపొర్లాయి. మురుగునీరు రోడ్లపైకి చేరింది. సాయంత్రం 5 నుంచి దాదాపు గంటకు పైగా కుండపోత వర్షం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కాలువల నిర్మాణాల కోసం తవ్విన గుంతల్లో పడి పలువురు గాయపడ్డారు. విరిగిన చెట్లు- ధ్వంసమైన కార్లు ఈదురు గాలులకు నగరంలోని పలు కూడళ్లలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. జీవకోనలో చెట్ల కొమ్మలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ఇదే ప్రాంతంలో దాదాపు 11 పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీధుల్లో మోకాటి లోతు నీరు నిలిచిపోయింది. వరదరాజనగర్, పాచిగుంట ప్రాంతంలో ఈదురు గాలులు ప్రతాపం చూపాయి. చెట్ల కొమ్మలు విరిగిపడడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. వీఆర్వోకు తప్పిన ప్రమాదం వరదరాజనగర్, పాచిగుంట ప్రాంతంలో అర్హులైన పేదలకు మంజూరైన ఇంటి స్థలాల విషయమై వీఆర్వో విశ్వనాథం విచారణకు వెళ్లారు. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఒక్క సారిగా రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మూడు చెట్లు నేలకూలాయి. అదే సమయంలో అక్కడ ఉన్న వీఆర్వోతో పాటు స్వయం సహాయక సంఘాల ఆర్పీ సూర్యకుమారి, స్థానిక మహిళలు తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణపాయం తప్పింది. బందార్లపల్లెలో.. బందార్లపల్లె (పూతలపట్టు): మండలంలోని బందార్లపల్లె వద్ద గాలిబీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో బందార్లపల్లె నుంచి యం.బండపల్లె వరకు విపరీతమైన గాలి వీచడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బందార్లపల్లె వద్ద ఉన్న ఒక సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, రెండు హెచ్‌వీడీఎస్ ట్రాన్స్ఫార్మర్లు, 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి పూతలపట్టు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాలితో వీయడంతోపాటు చిరుజల్లులు పడ్డాయి. ట్రాన్స్‌కో ఏఈ వేలు, లైన్మెన్లు బద్రి, యాకుబ్ తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బండరాయి పడి మహిళ మృతి గాలీవాన బీభత్సానికి జీవకోనకు చెందిన నిర్మల కుమార్తె అమ్ములు(45) మృతిచెందింది. మృతురాలు తిరుమలలోని ఓ ప్రైవేటు హోటల్లో పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం సొంత పనుల నిమిత్తం కొర్లగుంటకు వచ్చింది. అప్పటికే గాలీవాన రావడంతో అక్కడే ఉన్న ఓ ఇంటివద్ద ఆగింది. అదే సమయంలో ఆ ఇంటి రేకులపై ఉన్న పెద్ద రాయి అమ్ములు తలపై పడింది. హుటాహుటిన ఆమెను స్థానిక రుయాకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
గాలీవాన బీభత్సం
చౌడేపల్లె, న్యూస్‌లైన్: మండలంలో శనివారం రాత్రి గాలీవాన బీభత్సాన్ని సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. టమాట, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చారాల, దుర్గసముద్రం, ఏ కొత్తకోట గ్రామ పంచాయతీల్లో టమోట, మామిడి కాయలు నేలరాలాయి. దుర్గసముద్రం, దాదేపల్లె, ఓదులపేట, అంకుతోటపల్లె, కుంచినపల్లె, ఏ.కొత్తకోట, బుటకపల్లె తదితర గ్రామాల్లో వడగండ్లుతో పాటు గాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బుటకపల్లె , ఓదులపేట కీలేరుల వద్ద సుమారు 12 స్తంభాలు నేలకొరిగాయి. రెండు ట్రాన్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు భారీ చెట్లు నెలకొరిగాయి. పంటలు చేతికివచ్చే సమయంలో మామిడి కాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. గాలీవాన బీభత్సంతో 200 ఎకరాల్లో టమాట పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లో మామిడి కాయలు గాలికి నేలరాలాయి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పుంగనూరులో.. పుంగనూరు: గాలీవాన బీభత్సంతో పుంగనూరు మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. శనివారం సాయంత్రం నుంచి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా పుంగనూరు మండలంలో సుమారు 96 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, వేప, తుమ్మ, మునగ, కొబ్బరి, అర్కీలిఫాం చెట్లు సైతం నేలకొరిగాయి. వీటితో పాటు కొత్తిమీర, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని నల్లగుట్లపల్లెలో జి.చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన పది ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అలాగే మర్రిమాకులపల్లెకు చెందిన రత్నమ్మకు చెందిన 15 ఎకరాల్లో , నల్లురుపల్లె రామిరెడ్డికి చెందిన 4 ఎకరాల తోట, జయరామిరెడ్డికి చెందిన 30 ఎకరాల తోట , మర్రిమాకులపల్లె నాగరాజారెడ్డికి చెందిన 7 ఎకరాల తోట, అలాగే కృష్ణప్ప, శ్రీనివాసులు, చంద్రప్పకు చెందిన 20 ఎకరాల తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పుంగనూరు సమీపంలోని మాదనపల్లెకు చెందిన వి.సుబ్రమణ్యంకు చెందిన 20 ఎకరాల మామిడి తోట,కృష్ణప్పకు చెందిన 5 ఎకరాల తోటలో మామిడి కాయలు రాలిపోయాయి. మామిడి తోటల్లో బెనీషా, బాదం, బెంగళూరు, నీలం కాయలు రాలిపోవడంతో ఒకొక్క రైతుకు సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లింది. ఆకాల వర్షాలతో మామిడి పంట రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు రాని కాయలను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్ద పంజాణి మండలంలో.. పెద్దపంజాణి: పెద్దపంజాణి మండలంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో పలువురు రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో చాలా పల్లెలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సుమారు 200 ఎకరాల్లోని మామిడి కాయలు నేలరాలాయి. మామిడి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మంది అప్పులు చేసి మరీ మామిడి తోటలను కొన్నారు. అలాగే గురివిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొరస్వామి, నరసింహయ్య, వెంకట్రామయ్యలకు చెందిన రేకులు గాలులకు లేచిపోవడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ముత్తుకూరు రోడ్డులోని గుణ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. రాయలపేట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు చెందిన రేకులన్నీ పూర్తిగా లేచిపోయాయి. కూరగాయల కొత్తపల్లెకు చెందిన హరినాథ్ నూతనంగా నిర్మిస్తున్న కోళ్లషెడ్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. అలాగే పలు చోట్ల పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కెళవాతి, వీరప్పల్లె, మంగప్పల్లె, పాత వీరప్పల్లె, సుద్దగుండ్లపల్లె గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కెళవాతి వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు, సుద్దగుండ్లపల్లె వద్ద నాలుగు, శ్రీరామాపురం వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కొండేపల్లె క్రాస్ వద్ద 33కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో కరసనపల్లె, ముత్తుకూరు గ్రామాలకు రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది.