breaking news
free hold law
-
భూ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు.. తరాల కష్టం, బతుకునకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? రీ సర్వేకు తూట్లు.. 22ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు.. పేదల ఫ్రీహోల్డ్ హక్కులు రెండేళ్లుగా ఫ్రీజ్.. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు.. పాస్బుక్ల దందా.. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు.. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వినతులు అందజేయటానికి వచ్చిన రైతులు, ప్రజలు(ఫైల్) 22ఏ జాబితాలో ఏకంగా 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ప్రజాప్రతినిధులు 22ఏ జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేట్ పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్‌నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఫ్రీహోల్డ్ భూములపై పగబట్టిన చంద్రబాబు 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. 27 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పరిధిలోకి రాగా, ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే అక్రమాల పేరుతో ఫ్రీ హోల్డ్ భూములను మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పైకి మాత్రం 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుండటం విస్తుగొలుపుతోంది. జగన్ సంస్కరణలతో రూ.500 కోట్లు ప్రోత్సాహకాలు వైఎస్ జగన్ హయాంలో అమలైన భూ సంస్కరణలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభమై విజయవంతంగా జరుగుతున్న రీసర్వేపై విష ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలు దాన్ని నిలిపివేసి.. తప్పు తెలుసుకుని మళ్లీ తూతూ మంత్రంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు తానే రీ సర్వేను మొదలు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్ సాంకేతికతతో గ్రామ గ్రామాన సర్వే జరిగింది. రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు, భూ కబ్జాలకు తావులేని వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. భూ రికార్డుల డిజిటలీకరణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ధృవీకరించింది. ఈ పనితీరుకు ప్లాటినం గ్రేడింగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకాలు రూ.500 కోట్లు కూడా దక్కాయి. జగన్ అమలు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు అందుకుంది. పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ కాని భూములు, 22ఏ జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్‌బుక్‌లు రాని రైతులు, ఇచ్చిన పాస్‌బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకుని క్యూ కడుతున్నారు. అర్జీలు తీసుకుని రశీదులు ఇవ్వడమే తప్ప ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు పది సోమవారాలు తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. దీనికితోడు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆర్భాటంగా వినతులు తీసుకుని పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తీసుకున్న అర్జీలకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఆయన కొడుకు, ఇతర మంత్రులు పీజీఆర్ఎస్ను ప్రచారానికి వాడుకోవడమే తప్ప.. సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిపోయినట్లు బాధితులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటం తెలిసిందే.మా భూమి లోంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు పది ఎకరాల భూమిని మా తాతలు, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు కొందరు రాజకీయ పలుకుబడితో మా భూములు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరు. ఆదివాసీలమైన మేం ఎక్కడికి పోవాలి? – చీడిపల్లి దేముడమ్మ, జెడ్ జోగుంపేట, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా దొంగ రికార్డులతో బెదిరిస్తున్నారు సర్వే నంబర్ 49లో ఉన్న నా విలువైన భూమిని కాజేయడానికి ఊళ్లో కేటుగాళ్లు నా పేరుతో ఉన్న పత్రాలను మార్ఫింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ద్వారా నా భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్లు నా ఫైలును పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నారు. కళ్ల ముందే నా భూమి చేజారిపోతోంది. – టి.గిరిజమ్మ, ఒడ్డుపల్లి, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా ఆన్లైన్లో నా పేరు మారిపోయింది నా భర్త ఆర్మీలో దేశ సరిహద్దుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీ కోటా కింద 2022లో బురుజుపల్లిలో ఆయనకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరుపైకి మార్పించుకున్నా. ఎవరో ఏదో చేయడంతో ఇప్పుడు మళ్లీ నా భర్త పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వయసులో తిరగలేక చచ్చిపోతున్నా. – కె.సరస్వతి, జవాన్ చిన్న రామయ్య భార్య, బురుజుపల్లి, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లాకూటమి నేతల బెదిరింపులు..గుండెపోటుతో దళిత రైతు మృతి బుచ్చెయ్యపేట: కూటమి నేతలు భూమిని లాక్కుంటారన్న భయంతో తీవ్రవేదనకు గురైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళిత రైతు నందికొళ్ల నూకరాజు(36) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... నూకరాజు తండ్రి సాంబయ్య 40 ఏళ్లుగా తైపురంలో ఐదు ఎకరాల డి–పట్టా భూమిని సాగు చేసేవాడు. ఆయన మరణం తరువాత నూకరాజు సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని 22ఎలో పెట్టి హోల్డ్‌లో ఉంచింది. ఇటీవల తైపురానికి చెందిన కూటమి నేతలు నూకరాజు భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్, టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు పలుసార్లు ఆ భూమిని సర్వే చేశారు. నూకరాజు అడ్డుకుని తన తండ్రి పేరుపై ఉన్న డి–పట్టా రికార్డులను చూపించాడు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రాజు చోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూటమి నేతలు మళ్లీ నూకరాజు భూమిపై ఫిర్యాదు చేశారు. దీంతో నూకరాజు తన భూమిని కూటమి నేతలు లాక్కుంటారని ఆందోళన చెందాడు. తమ గతేంటని భార్య భవానీతో శుక్రవారం రాత్రి చెబుతూ బాధపడ్డాడు. అనంతరం గుండెపోటుకు గురై మృతిచెందాడు. కూటమి నేతల ఫిర్యాదుల వల్లే నూకరాజు మృతిచెందాడని ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరిసా శ్రావణ్ తదితరులు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నూకరాజు మృతదేహానికి శనివారం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాటలు కబ్జాలపై.. చేతలు కబ్జాలతోకబ్జాలు అరికట్టడానికి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణులే ఆచరణలో కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ.. ఆ గుట్టు బయట పడడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. విశాఖ, తిరుపతి, అన్నమయ్య సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ఖాళీ భూములను కబ్జా చేసినట్లు రోజుకో ఘటన వెలుగు చూస్తోంది.కళ్లెదుటే భూ ఆక్రమణవైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులకు చెందిన ఈమె పేరు వెంకట లక్ష్మమ్మ. సర్వే నంబర్లు 1,470, 1,471లో ఈమెకు 3.32 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో ఎకరంన్నర భూమిని ఊళ్లో పెత్తందార్లు ఆక్రమించారు. తిరిగి ఈ భూమిని దక్కించుకోవడానికి ఆమె ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ద్వారా సాధించుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ, రెవెన్యూ వాళ్లు ఈ భూమిని 1బీ రికార్డుల్లో చేర్చి, ఆన్లైన్ చేయడం లేదు. ఫలితంగా తన భూమి దక్కడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.78 ఏళ్ల నాటి భూమిని నకిలీ పత్రాలతో అమ్మేశారు ఇతని పేరు చంద్రాయుడు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు. ఇతని తాత బాలయ్య.. సర్వే నంబర్ 676/2లో 0.68 సెంట్ల స్థలాన్ని 1948లోనే కొన్నారు. 78 ఏళ్లుగా ఈ భూమి వీరి స్వాధీనంలోనే ఉంది. అందులో మూడు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలోకి వెళ్తే ప్రభుత్వం వీరికి రూ.23,287 పరిహారం కూడా ఇచ్చింది. అంత పక్కా రికార్డు ఉన్న ఈ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. రికార్డులన్నీ పట్టుకుని పీజీఆర్ఎస్ మెట్లు ఎక్కినా తనకు సమాధానం చెప్పేవారే లేరని చంద్రాయుడు వాపోతున్నారు. -
సింగపూర్ కంపెనీలకు దాసోహం
ఈ నెల 24న సింగపూర్‌లో నేరుగా సీఎం మంతనాలు దావోస్ పర్యటన జీవోలో సింగపూర్ పర్యటన గురించి ప్రస్తావనే లేదు అన్నీ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరినట్లే ఇప్పటికే 99 ఏళ్ల లీజు, ఫ్రీ హోల్డ్‌పై చట్టసవరణ ఎల్ అంట్ టీ తరహాలో సింగపూర్ కంపెనీలు నిర్మించి విక్రయం సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి అభివృద్ధి అంశంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర సర్కారు దాసోహం అంటోంది. అమరావతి మాస్టర్ డెవలపర్‌గా స్విస్ ఛాలెంజ్ విధానంలో అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియంను ఎంపిక చేయాలని ‘ముఖ్య’ నేత నిర్ణయించిన విషయం తెలిసిందే. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకంగా ‘రాష్ట్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వీలుకల్పించు చట్టం -2001’లో సవరణలు తీసుకువచ్చారు. తొలుత చట్టంలో 33 సంవత్సరాలకు మాత్రమే ప్రభుత్వం భూమిని లీజుకు ఇవ్వాలని ఉంది. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికపైన, అలాగే మొత్తం రాయితీ ధరపై పూర్తి హక్కు కల్పించాలని కోరాయి. అమరావతి మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియం సమర్పించిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు అనుగుణంగానే చట్టంలో ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. ఇక మిగతా ప్రతిపాదనలపైన కూడా ఈ కంపెనీలు సమర్పించిన ప్ర తిపాదనలపై ఆ కంపెనీల ప్రతినిధులతో సీఆ ర్డీఏ కార్యదర్శి అజేయ జైన్, కమిషనర్ శ్రీ కాంత్ సోమవారమిక్కడ చర్చలు జరిపారు. ఒప్పందానికి భిన్నంగా ప్రతిపాదనలు సింగపూర్ ప్రభుత్వ కంపెనీలే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేస్తామని తొలుత ఇరు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా నూటికి నూరు శాతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా ప్రతిపాదనలు సమర్పించాయి. తొలుత కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి, గతంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు చాలా వ్యత్యాసం ఉందని సీఆర్డీఏ కార్యదర్శి అజేయ జైన్, కమిషనర్ శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ‘ముఖ్య’నేత మాత్రం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చేసిన ప్రతిపాదనల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాజధాని భూములు ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన ఇచ్చేందుకు చట్ట సవరణలు చేశారు. సీడ్ కేపిటల్ పరిధిని ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి సింగపూర్ సంస్థలు కోరినట్లు 16.9 చదరపు కిలో మీటర్లకు పెంచేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఎల్ అండ్ టీ నిర్మాణం చేసి ఆ నిర్మాణ స్థలాన్ని ఎల్ అండ్ టీ ఎలాగ విక్రయించుకుందో అదే తరహాలో ఇప్పుడు రాజధానిలో కూడా వాణిజ్య, వ్యాపార సముదాయాలను సింగపూర్ కంపెనీలు విక్రయించనున్నాయి. దీనిపై సీఆర్డీఏ అధికారులను సంప్రదించగా... స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలపై ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామని తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని తెలిపారు. 24న దావోస్ నుంచి సింగపూర్‌కు సీఎం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడినుంచి నేరుగా 24వ తేదీన సింగపూర్ వెళ్తారు. అక్కడ సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ ప్రతినిధులతో సమావేశమై స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలపైన మంతనాలు సాగించనున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ జీవోలో సింగపూర్ పర్యటన గురించి పేర్కొనకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో బేరసారాల ద్వారా రాజధానిలోని కొన్ని కాం ట్రాక్టు పనులను తాను చెప్పిన వ్యక్తులు, సంస్థలకు ఇప్పించుకోవడమే లక్ష్యంగా సీఎం చర్యలున్నాయని విమర్శలున్నాయి.


